5, అక్టోబర్ 2024, శనివారం

నా మీద నాకే అసూయ

నా మీద నాకే అసూయ - భండారు శ్రీనివాసరావు 

"ఏమిటి మీ ఆరోగ్య రహస్యం?" అడిగాడు ఓ మిత్రుడు.
"ఏమీ లేదు, జ్ఞాపకాలను నమిలి తింటుంటాను"

2019 లో కంటికి రెప్పలా చూసుకున్న మా ఆవిడ నిర్మల హఠాత్తుగా కన్నుమూసింది. 
ఈ ఏడాది (2024) ఫిబ్రవరి నాలుగున, నాకు కుడి భుజంగా వున్న నా రెండో కుమారుడు సంతోష్ తల్లి మీద ప్రేమతో ఆమె దగ్గరికే వెళ్ళిపోయాడు. వాడికి తల్లి అంటే ప్రాణం. ఆమె చనిపోయినప్పుడు, ఎవరో పెద్దగా బాడీని తీసుకు రండి అంటుంటే వాడు కోపం ఆపుకోలేక పోయాడు. ' బాడీ ఏమిటి బాడీ. బుద్ది వుందా! ఆమె మా అమ్మ. అమ్మ.' అంటూ విరుచుకుపడ్డాడు. అంత ప్రేమ తల్లి అంటే.

అయిదేళ్ల వ్యవధిలో ఈ ఇద్దరూ నాకు కాకుండా పోయారు. అయినా దుక్కలా వున్నానంటే  జ్ఞాపకాలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ వుంటే చెప్పరాని ఆనందం, చెప్పుకోలేని బాధ రెండూ పడుగుపేకలుగా మనసును ముప్పిరిగొంటాయి. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని స్థితి.

కొన్ని జ్ఞాపకాలు అంతే. తలచుకున్నప్పుడల్లా  వయసును మురిపిస్తాయి. మనసుని వేధిస్తాయి.

 దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి, కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే   నేను పుట్టిన ఆగస్టులోనే, నా పుట్టినరోజున ప్రేమతో కేకు తినిపించిన పదో రోజునే  2019లో  కన్ను మూసింది. వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు. కారణం నా ఇద్దరు  పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు. 
సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.
ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు, నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.
పెద్ద కోడలు భావన అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది.  వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువుల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. దాంతో ఖాళీగా వుండడం ఇష్టంలేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఇచ్చారు. 
నా రెండో కోడలు నిషా. ఆమెకు ఏదో పెద్ద  కార్పొరేట్ సంస్థలో, దేశ దేశాల్లోని సిబ్బంది మీద అజమాయిషీ చేసే బాధ్యత కలిగిన పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ఎందుకమ్మా ఇలా అవస్థ పడతావు అంటే నవ్వి ఊరుకుంటుంది.
  
 
మా ఆవిడ వుండివుంటే, ఈ వైభోగాలు చూస్తూ వుంటే, నా కొడుకు బతికి వుంటే నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు. దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కానీ ఏదీ మన చేతిలో పెట్టలేదు.

దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో,  ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, 'చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిట'ని.
చంద్రుడికే తప్పలేదు. మనమెంత? 

కింది ఫోటో:
అమెరికాలో  గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర ఆలూమగలం.
ఇదొక బంగారు జ్ఞాపకం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి