28, ఆగస్టు 2024, బుధవారం

చనిపోయిన వాడి కళ్ళు చారడేసి

చనిపోయిన వాడి కళ్ళు చారడేసి 

నాకో తీరని కోరిక. ఇక తీరదు కూడా.
కుటుంబంలోని వారందరూ అంటే నేనూ మా ఆవిడా పిల్లలు  రోజులో ఒక్క పూటయినా కలిసి కూర్చుని భోజనం చేయాలని. ఈ కోరిక తీరక పోవడానికి నేనే కారణం. ప్రెస్ మీట్లు, డిన్నర్ల పేరుతో ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరే వాడిని. అప్పటికి పిల్లలు గాఢ నిద్రలో వుండేవాళ్ళు. బారెడు పొద్దెక్కి నేను లేచేసరికి వాళ్ళు స్కూలుకు పోయేవాళ్ళు. ఈ విషయాన్ని నేను మిత్రులతో ఓ జోక్ గా చెప్పుకుని మురిసిపోయే వాడిని. రాత్రి పొద్దుపోయి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడితే మా పిల్లలు తలుపు తీయకుండా, మా నాన్న ఇంట్లో లేరని జవాబు చెబుతారని,  ఆదివారం నాడు భోజనాల సమయంలో మా ఆవిడ నన్ను చూపిస్తూ ఇదిగో ఈయనే మీ నాన్న అని మా పిల్లలకు పరిచయం చేస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాడిని. 
ఇప్పుడు అమెరికాలో మా పెద్దబ్బాయి సందీప్ ను చూస్తుంటే, నా కోరికను వాడు తీరుస్తున్నాడు అనే భావన కలిగింది. ఎంచక్కా వున్న నలుగురు భోజనాల బల్ల వద్ద కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. నాకు చూడ ముచ్చటగా వుంటుంది.
పోతే అసలు విషయానికి వస్తాను.
ఈరోజు పొద్దున హిందూ టెంపుల్ లో మా రెండో కుమారుడు సంతోష్  ఏడో మాసికం కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత రాత్రికి భోజనాల బల్ల వద్ద,  మా కుటుంబం అర్థాంతరంగా పోగొట్టుకున్న మా ఆవిడ నిర్మల, రెండో కుమారుడు సంతోష్ ప్రసక్తి వచ్చింది. 
మా కోడలు భావన రాంచీ అమ్మాయి. పెళ్ళి నాటికి తెలుగు ఒక్క ముక్క రాదు. ఇంట్లో అందరూ గలగలా తెలుగులో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బిక్క మొగం వేసుకునేది. ఈ సంగతి గుర్తు చేసుకుంటూ  భావన చెప్పింది. "అప్పుడు అత్తయ్యే నాకు తోడు నిలిచింది. ప్రతివారం ఒక తెలుగు సినిమాకు తీసుకు వెళ్ళే వారు. తను నాకు హిందీలో చెబుతూ నాకు అర్థమైంది తెలుగులో చెప్పమనే వారు. ఆ విధంగా నాకు కొద్దికొద్దిగా తెలుగు నేర్పించారు. అలాగే ఇంట్లో పనిచేసే కళ నాకు మరో తెలుగు టీచరు. ఇక సంతోష్ మరిది అయినా చాలా చనువుగా బహురాణి అంటూ తెలుగు విషయంలో చాలా సాయం చేసేవాడు. నేను సఖిని కడుపుతో ఉన్నప్పుడు వేవిళ్ళు. ఆ రోజుల్లో అత్తయ్య నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. "మామయ్య కోసం కానీ , ఇంకా ఎవరికోసం కానీ వెయిట్ చేయవద్దు. వేళకు అన్నం తిను. వాళ్ళకు వీలైనప్పుడు వాళ్ళు తింటారు" అంటూ నాకు అన్నం పెట్టేవారు. సంతోష్ అయితే, కాళ్ళు పీకుతున్నాయి అంటే ఏమాత్రం సంకోచించకుండా నా కాళ్ళు పట్టేవాడు. బంగారం లాంటి మరిది. వాడు పోయాడు అంటే నాకు ఈ నాటికీ నమ్మకం కుదరడం లేదు. దేవత లాంటి అత్తయ్య పోయింది. వజ్రం లాంటి సంతోష్ పోయాడు "
అని భావన కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
నా కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకి పోయాయి.
కింది ఫొటో:
పక్కన వున్న ఇద్దరూ ఇప్పుడు లేరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి