8, జులై 2024, సోమవారం

పోస్ట్ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి? – భండారు శ్రీనివాసరావు

 చాలా రోజులుగా ఒక విషయాన్ని గురించి విపులంగా రాయాలని అనుకుంటూ వస్తున్నాను. వీలు దొరకలేదు అని అబద్ధం చెప్పను, కానీ నేనే వీలు చేసుకోలేదు. ఇది నిజం. విషయం ఏమిటంటే పోస్టు రిటైర్మెంటు జీవితం.

2005  డిసెంబరు  ముప్పై ఒకటిన  నేను  దూరదర్సన్  నుంచి  రిటైర్ అయ్యాను. కానీ, అదే రోజు ఓ ఏడాది సర్వీసు పొడిగించారు. కానీ దాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదు. మధ్యలోనే బయటకు వచ్చి సత్యం రామలింగరాజు గారు ప్రారంభించిన 104 సర్వీసు గ్రామీణ ఆరోగ్య సేవల స్వచ్చంద సంస్థలో మీడియా అడ్వైజర్ గా కొన్నాళ్ళు పనిచేశాను. అలాగే రోజువారీ టీవీ చర్చలు. ఇలా జీవితం సాగిపోయింది. రిటైర్ అయ్యాను అనే ఫీల్ లేకుండా పోయింది. 2019 లో మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణంతో నా జీవితం మరో మలుపు తిరిగింది. ఇతర వ్యాపకాలు తగ్గిపోయాయి. అసలైన రిటైర్ మెంట్ జీవితం మొదలయింది. కానీ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి అనే విషయంలో సరైన అవగాహన లేక మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకరకంగా చెప్పాలి అంటే రోజులు దొర్లిస్తున్నాను.  సరే! ఇది నా గొడవ. అలా ఉంచుదాం.

ఇప్పుడు మరో వ్యక్తిని గురించి చెప్పుకుందాం. ఆయన పేరు వనం జ్వాలా నరసింహారావు. నా బాల్య మిత్రుడు. చిన్నప్పుడు  స్కూల్లో సహాధ్యాయి. పెద్దయిన తర్వాత నా మేనకోడలు విజయలక్ష్మి భర్త. తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి ఎంతో పైకి వచ్చాడు. కిందపడ్డాడు. మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేచాడు.

చేయని ఉద్యోగం లేదు. బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో మొదలు పెట్టి  తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన సంబంధాల అధికారి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో  మారని ఇల్లు లేదు. అయితే,  ఈ ఒక్క విషయంలో మాత్రం  నాకూ ఆయనకు పోలిక. మరీ ఆయనలా  అన్ని కాకపోయినా నేను సైతం హైదరాబాదు ఉద్యోగపర్వంలో అనేక అద్దె ఇళ్ళు మారాను.

మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో,  హైదరాబాదులో నేను చేసింది ఒకే ఒక ఉద్యోగం, ఒకే ఒక సంస్థ ఆలిండియా రేడియోలో. కాకపొతే చరమాంకంలో కొద్ది కాలం దూరదర్సన్ లో కూడా ఇష్టం లేని కాపురం చేశాను. జ్వాలా అలా కాదు. అనేక ఉద్యోగాలు. అనేక తరహా ఉద్యోగాలు. కొన్ని సర్కారు కొలువులు. మరి కొన్ని అటూ ఇటూ కానివి.  అందుకే రిటైర్ మెంటు అనేది ఆయనకు లేకుండా పోయింది. ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్య ఖాళీ. ఖాళీకి ఖాళీకి నడుమ కొలువు. ఇలా సాగిపోయింది ఆయన జీవితం.

చివరికి జ్వాలా కూడా రిటైర్ అయ్యాడు. కానీ ఒప్పుకోడు. నో రిటైర్మెంట్ అనేది ఆయన పాలసీ. నాకూ ఆయనకు మధ్య ఒకటి రెండేళ్లే తేడా. కానీ  రిటైర్మెంట్ విషయంలో చాలా తేడాలు. ఒకప్పుడు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. కానీ నా భార్య మరణానంతరం నా లోకం మారిపోయింది. ఏకాంతం నా లోకం అయింది. ఇంతవరకు నా జోలికి రాని కొన్ని ఆరోగ్య సమస్యలు. మరికొన్ని హార్దిక ఇబ్బందులు. రెండో కుమారుడి మరణం వంటి తట్టుకోలేని సంఘటనలు. జీవితం పట్ల నా దృక్పథం మారిపోయింది. ఒంటరితనం. ఒంటరిగా  జీవించడం. ఏదీ పట్టించుకోకపోవడం. నిర్లిప్తత. నిర్వేదం.

విల్లాల్లో జీవితం కాకపోయినా, చెప్పుకోదగిన ఆర్ధిక ఇబ్బందులు  లేవు.  వయసురీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలాగు తప్పవు.

ఈ నేపధ్యంలో జ్వాలా జీవితం నాకు ఓ దిక్సూచిలా కనిపించింది. ఒప్పుకోడు కానీ ఆయనది రిటైర్మెంట్ జీవితమే. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్లాను. గతంలో మాకిది రోజువారీ వ్యవహారమే. కానీ ఈ మధ్య నేను ఇల్లు వదిలి బయటకు  పోలేదు. నిజం చెప్పాలి అంటే ఇంట్లో నా గది వదిలి  అడుగు బయట పెట్టలేదు. బెడ్ రూమ్ టు బాత్ రూమ్. తిండీ తిప్పలు అన్నీ నా గదిలోనే. అంతగా ఒంటరితనం నన్ను ఆవరించింది.

ఆయన ఇల్లు ఎప్పటిలా కళ కళ లాడుతోంది. ఒకానొక కాలంలో, అంటే మా ఆవిడ జీవించి వున్న కాలంలో అందరూ మా గురించి, మా ఇంటి గురించి  ఇలాగే చెప్పుకునేవారు. ఒకప్పటి  నా రేడియో సహోద్యోగి, న్యూస్ డైరెక్టర్ శ్రీ ఆర్వీవీ కృష్ణారావు  అప్పటికే అక్కడ వున్నారు. గతంలో రోజూ కలిసే మేము, ఒకరినొకరం కలవక  చాలా కాలం అయింది. అలాగే ఎప్పుడో పరిచయం అయి చాలాకాలంగా కలవని మితృలు, శ్రేయోభిలాషులు వనం నర్సింగరావు గారు, వారి శ్రీమతి మాతాజీ, మా ఆవిడ ఆప్త మిత్రురాలు, బహిప్రాణం అయిన వనం గీత, భర్త వనం రంగారావు, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు, వదిన విమలాదేవి ఇలా అనేకమందితో జ్వాలా గృహం కొలువు తీరింది.

స్నేహితులని, సన్నిహితులని, బంధువులని, మిత్రులని అప్పుడప్పుడు కలుస్తూ, పాత ముచ్చట్లు, కొత్త సంగతులు కలబోసుకోవడం ద్వారా రిటైర్ మెంటుని హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపవచ్చనేది జ్వాలా థియరీ.  మధ్యమధ్య కలుస్తుంటేనే చుట్టరికాలు అయినా స్నేహితాలయినా చిరకాలం నిలబడతాయని ఆయన నమ్ముతాడు. అందుకే చిన్ననాటి స్నేహితుల నుంచి ఉద్యోగ పర్వంలో పరిచయం అయిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందితో ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. మధ్యమధ్య ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, ఏ పనీ లేకపోయినా.  హ్యూమన్ రిలేషన్స్ ప్రాధాన్యతని ప్రాక్టికల్ గా నిరూపిస్తున్న జ్వాలాని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది అనిపించింది.

 నా దగ్గర కూడా అంతకు మించిన ఫోన్ లిస్టు వుంది. కానీ ఏరోజూ ఎవరితో మాట్లాడను. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది నాకు నేను చెప్పుకునే సమర్ధన.    

ఇంత పెద్ద వయసులో ఈ అనుకరణలు సాధ్యమా!  కాదని నాకు తెలుసు.

ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు. నేనో సీతయ్యని.

(07-07-2024)

కింది  చిత్రం   జ్వాలా ఇంట్లో తీసినది



 

 

     

 

       

 

1 కామెంట్‌:

  1. Jwala's policy is good for him . Your policy is good for you. It depends on one's nature. Still meeting friends and well-wishers occassionally is advisable.

    రిప్లయితొలగించండి