నిన్న ఆదివారం (30-6-24) వినుకొండ రైల్వే స్టేషన్
వందలాదిమంది జనంతో కిక్కిరిసిపోయింది. వారెవరూ ప్రయాణీకులు కాదు. ఆ స్టేషన్ లో
చిరకాలం పనిచేసి పదవీ విరమణ చేస్తున్న ఓ చిరుద్యోగికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన
వాళ్ళు వారు. ఓ రైల్వేఉద్యోగి, అదీ బుకింగ్ క్లర్క్ స్థాయి నుంచి సూపర్నెంట్
స్థాయికి ఎదిగిన వ్యక్తికి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పడానికి ఇంతమంది జనం రావడం
ఏమిటి? మేళతాళాల
సందడి ఏమిటి?
ఇంతకీ ఎవరితగాడు? ఏమా కధ. తెలుసుకోవాలంటే ఓ ముప్పయ్ నలభయ్ ఏళ్ళు వెనక్కి
పోవాలి.
స్టేషన్ లో నైట్ డ్యూటీ ముగించుకుని బయటకు
వచ్చాడు. ఇంటికి పోవడానికి రిక్షా కోసం చూసాడు. నిర్మానుష్యంగా ఉన్న రైల్వే
ప్రాంగణంలో ఒకే ఒక రిక్షా కనబడింది. వెళ్లి ఎక్కాడు. రిక్షా మనిషి లాగలేక
లాగుతున్నట్టు అనిపించింది. ఆరా తీసాడు. రెండు రోజులుగా జ్వరం. రిక్షా లాగకపోతే బతుకు
గడవదు. అదొక్కటే ఆధారం. చేతకాకపోయినా బండి బయటకు తీశాడు. విషయం తెలియగానే మనవాడు
వెంటనే రిక్షా దిగాడు. రిక్షా మనిషిని వెనక కూర్చోబెట్టుకుని తొక్కుకుంటూ అతడ్ని
ఇంటికి చేర్చాడు. జేబులో వున్న డబ్బు లెక్కపెట్టకుండా తీసి అతడి చేతిలో పెట్టాడు.
అతడితో చెప్పాడు,
మర్నాడు ఉదయం మళ్ళీ వస్తానని, కొద్ది రోజులు రిక్షా తొక్కవద్దని. అంతవరకూ అతడి
బాగోగులు తానె చూసుకుంటానని.
అన్నాడే కానీ, తను కూడా ఓ చిరుద్యోగి. ఉద్యోగం
అప్పటికి పర్మనెంట్ కాలేదు. చేతికి వచ్చేది చాలా తక్కువ. మరి రిక్షా మనిషికి తోడు
పడడం ఎలా. నిద్ర పోకుండా ఆలోచిస్తున్న అతడికి ఓ ఆలోచన స్పురించింది. అలా చేస్తే
అందరూ ఏమనుకుంటారు అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇక అడుగు ముందుకు పడదు అని
నిశ్చయించుకున్నాడు. తన నిర్ణయంలో బాగోగులు కంటే రిక్షా మనిషి బాగోగులు ముఖ్యం అనుకున్నాడు.
అతడి ఇంటికి వెళ్ళాడు. రిక్షా తన చేతిలోకి
తీసుకున్నాడు. పగలల్లా రిక్షా తొక్కి వచ్చిన డబ్బులు అతడి చేతిలో పెట్టి నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇలా వారం రోజులు పగలు
రిక్షా తొక్కి, రాత్రీ ఉద్యోగం చేసీ, రిక్షా మనిషి ఆరోగ్యం కుదుటపడేవరకు
శ్రమించాడు. ఈ విషయం మూడో మనిషికి తెలియదు.
తన నాలుగు దశాబ్దాల ఉద్యోగపర్వంలో ఇలాంటి స్వచ్చంద
సేవలు ఎన్నో చేశాడు. సాయం చేసిన తనకూ, సాయం పొందిన వారికీ తప్ప ఎవరికీ తెలియకుండా
జాగ్రత్త పడ్డాడు.
అందుకే పదవీ విరమణ రోజున అంత జనం. వినుకొండలోని
ఆటో రిక్షాల వాళ్ళు అతడ్ని ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద ప్రదర్శనగా
తీసుకువచ్చారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టి, ఉద్యోగ రీత్యా
ఎక్కడో దూరంగా ఉన్న వినుకొండను తన స్వస్థలం చేసుకుని, నలుగురికీ తలలో నాలుకలా ఉంటూ,
ప్రజాసేవ చేయడానికి పెద్ద పదవులు ఏమీ అక్కర లేదని, వున్నంతలో కూడా అవసరాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చని
నిరూపించాడు.
అతడి పేరు చామర్తి భవానీ శంకర్,
మేమందరం శ్రీధర్ అని పిలుస్తాము. మాది బాదరాయణ సంబంధం కాదు. శ్రీధర్ ఎవరో కాదు, స్వయానా మా రెండో అన్నగారు భండారు రామచంద్రరావు
గారి బావమరది.
ఇల్లాంటి వ్యక్తులు మనుషులలో ఉన్న దైవత్వానికి నిదర్శనమవుతున్నారు. జయహో శ్రీధర్ గారు!!
రిప్లయితొలగించండి