భగవంతుడు
అనే వాడికి ప్రతిరోజూ వంగి వంగి నమస్కారం పెట్టక్కర లేదు. ఆరోజు ముగిసే సమయానినికి
దేవుడా ఓ దండం అంటూ కృతజ్ఞత చెబితే చాలు.
ఆయన నాకు అన్నీ ఇచ్చాడు. కొన్ని
తీసుకున్నాడు. అంతే కానీ నా జీవితంతో చెడుగుడు
మాత్రం ఆడలేదు. తోడూ నీడా అయినా భార్యను తీసుకు వెళ్ళాడు. మంచి కొడుకులను, కోడళ్ళను ప్రసాదించాడు. నువ్వు చేసిన చెత్త పనులకు ఇది
చాలులే అని హెచ్చరిస్తూ నా భార్యను నాకు దూరం చేశాడు. చివరికి అయిదు పదులు నిండని
నా రెండో కొడుకుని నాకు కాకుండా చేశాడు. కానీ వాడిని పెళ్లి చేసుకున్న నా కోడలు
ఏమి నేరం చేసిందో తెలియదు. వాడి రెండేళ్ల కూతుర్ని, అయిదో వివాహ వార్షికోత్సవానికి నోచుకోని నా రెండో కోడల్ని వదిలేసి
వాడు హాయిగా ఈ లోకం నుంచి
నిష్క్రమించాడు. నేను నిర్భాగ్యుడిని అయినానే కానీ, ఒంటరిని కాలేదు.
ఉమ్మడి కుటుంబం అంతా కంటికి రెప్పలా నా వెంటే వుంది.
అల్లుడు
పోయిన తర్వాత, కన్నవాళ్ళు కన్నకూతుర్ని
పుట్టింటికి తీసుకుపోవడం అతి సహజం. అదే జరిగింది.
మళ్ళీ
ఒంటరితనం ముసురుకుంది. రాత్రల్లా ఎందుకీ జీవితం, పొతే పోలా అనిపించడం, తెల్లారి నలుగురిలో పడగానే బతకాలని
అనిపించడం, దీనికి మించి ఒంటరితనానికి నిర్వచనం ఏముంది.
ఈ
సోదికి కారణం వుంది. రేపు అంటే శుక్రవారం నా మనుమరాలిని చూడడానికి కటక్
వెడుతున్నాను. నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను.
ఇది
పెద్ద విషయం ఏమీ కాదు.
ఈ మధ్య
సుస్తీ పడ్డప్పుడు డాక్టర్లు ENSURE అనే బలవర్ధక పానీయాన్ని ప్రతిరోజూ రెండుమార్లు
తాగమన్నారు. ఫలితం బాగానే వుంది. కటక్ ప్రయాణానికి సాయంత్రం బట్టలు సర్దుకుంటూ వున్నప్పుడు అమెజాన్ నుంచి
కాబోలు ఈ ENSURE పాకెట్
నాకు బట్వాడా అయింది. దాన్ని కటక్ లో ఉన్న మా కోడలు ఆర్డర్ చేసింది. రాగానే
ఏమాత్రం ఇబ్బంది ఎదురు కాకూడదని ఈ ఏర్పాటు. కళ్ళు చెమర్చాయి.
ఇళ్ళూ వాకిళ్ళూ లేవనే బెంగ నాకెందుకు?
అదృష్టవంతులు మీరు.
రిప్లయితొలగించండిమీకు అనేక రంగాల్లో అనుభవముంది. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా పరిష్కరిస్తే బాగుంటుందో అని సూచనలు మీ బ్లాగు ద్వారా చేస్తే మీకు కాలక్షేపంగా ఉంటుంది రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది.