రేపే, అంటే ఏప్రిల్ తొమ్మిది శ్రీ క్రోధి ఉగాది. తెలుగువారి నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు.
ఉగాది పర్వదినంనాడు పంచాంగ శ్రవణం అనేది అనూచానంగా
వస్తున్న ఆచారం.
మా స్వగ్రామం కంభంపాడులో మా చిన్నతనంలో ఇద్దరు
పంచాంగకర్తలు వుండేవాళ్ళు. లంకా సూర్య ప్రకాశ సిద్ధాంతి గారు. గూడా సత్యనారాయణ
సిద్ధాంతి గారు. నాకు గుర్తున్నంతవరకు తెలుగు అంకెల్లో అంటే – ౧ ౨ ౩ ౪ ౫ (1 2 3 4 5 ) ఇలా ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు ఆ రోజుల్లో చాలా తక్కువ వుండేవి. పైగా
పంచాంగంలో తెలుగు భాషను అర్ధం చేసుకుని కంపోజ్ చేసేవాళ్ళు, ప్రూఫులు దిద్దేవాళ్ళు కూడా తక్కువగా వుండడం వల్లనో యేమో, చాలా పంచాంగాలు, విభిన్న పండితులు రాసినా ఒకే
ప్రెస్సులో ముద్రించేవారు. (ఇలాంటి ఓ ముద్రణాలయం తెనాలిలో ఉండేదని జ్ఞాపకం) ఉగాదికి చాలా ముందుగానే వీటి ముద్రణ
పూర్తయ్యేది. ఎందుకంటే రాసిన సిద్ధాంతులు వాటిని కాలినడకన అన్ని వూళ్ళకు వెళ్ళి
పంచాంగాల ముద్రణకు ద్రవ్యసాయం చేసిన దాతలకు వాటిని ఇచ్చి అందుకు ప్రతిఫలంగా తృణమో
ఫణమో స్వీకరించేవారు. పంచాంగ రూపకల్పనకు ముందు, నాకు బాగా గుర్తు, సత్యనారాయణ సిద్ధాంతిగారు అస్తమానం గాలిలో చేతులు
ఆడిస్తూ, అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో గణిస్తూవుండేవారు. ఒకరకంగా
చెప్పాలంటే వాళ్లదో లోకం.
తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అనేక
తెలుగు ఛానళ్ళు ‘రాజకీయ పంచాంగాల’ పేరుతొ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం
చేస్తుండడం ఒక ఆనవాయితీగా మారింది. ప్రతి
రాజకీయ పార్టీ కూడా తన కార్యాలయంలో ఒక
సిద్ధాంతి గారితో పంచాంగ శ్రవణం కార్యక్రమాలను ఏర్పాటుచేసుకుని, తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పించుకుని తాత్కాలిక
ఉపశమనం పొందుతూ వుండడం కూడా కొత్తేమీ కాదు. నిజానికి దేవాలయ ప్రాంగణాల్లో
నిర్వహించాల్సిన తంతు ఇది. వెనుకటికి, ఆ మాటకు వస్తే ఇప్పటికీ చాలా
ఊళ్ళల్లో గుళ్ళల్లో జరిగే పంచాంగ
శ్రవణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతూనే వున్నారు. టెక్నాలజీ వినియోగం తక్కువగా
వున్నరోజుల్లో ప్రజలు, తమకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని
ఈ పంచాంగ శ్రవణాల ద్వారా తీర్చుకునేవారు. అప్పట్లో వాళ్లకు కొన్ని అంశాల మీదనే
ఆసక్తి వుండేది. ఈ ఏడాది వానలు యెలా పడతాయి? పంటలు యెలా పండుతాయి? యే పంటలకు ఎలాటి ధర లభిస్తుంది? ఇక వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు
ఆదాయ వ్యయాలు యెలా వుంటాయి? ఆరోగ్యం ఎలావుంటుంది? ఇలాటి ప్రశ్నలకు పంచాంగ శ్రవణ
కార్యక్రమాల్లో సమాధానాలు లభిస్తాయన్న ఆశ వారిది. నాటి పరిస్తితుల దృష్ట్యా తప్పుబట్టడానికి
కాని, సిద్ధాంతులు చెప్పే విషయాలతో కేవలం వాదన కోసం
విభేదించడానికి కాని వీలులేదు.
కాకపొతే ప్రజలు వీటిని బాగా నమ్ముతున్నారు అన్న
నమ్మకం పెంచుకున్న రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఈ పంచాంగ శ్రవణాన్ని
సైతం తమ ప్రయోజనాలకు వాడుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ప్రబలిపోయింది. అందుకే యే
పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకుని పండితుల చేత నాలుగు
మంచి ముక్కలు చెప్పించుకుని, మీడియాలో ప్రచారం చేయించుకుని, తాము సంతోషపడడం మాత్రమే కాకుండా ఆ మాటలు జనం కూడా నమ్ముతున్నారు అనే భ్రమలో
పడిపోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఎన్నికల సర్వేలు చేయించుకుని, తమకు అనుకూలంగా రాయించుకుని, సానుకూల ఫలితాలు రాకపోతాయా అని
సంతృప్తి పడడం ఎలానో ఇదీ అలానే.
ఈ ఆచారానికి బీజం పడింది మాత్రం పాలక పక్షాలు
ప్రభుత్వ ఖర్చుతో ఉగాది వేడుకల పేరుతొ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో.
మొదట్లో గుడిలో జరిగే రీతిలోనే ఈ పంచాంగ శ్రవణాలు మొదలయినా, పోను పోను రాజుల ఆస్థానాల్లో వందిమాగధుల స్త్రోత్రపాఠాల మాదిరిగా తయారై, ఇదిగో ఈనాటి ఈ వికృత రూపాన్ని సంతరించుకున్నాయి. దేనికీ పడనివాడు పొగడ్తకు
పడతాడన్నట్టుగా ఈ నాటి రాజులను అంటే ముఖ్యమంత్రులను సంతోషపెట్టడానికి నాలుగు మంచి
ముక్కలతో ప్రారంభమై ఇప్పడు పొగడ్తల అగడ్తలలో కూరుకుపోతున్నాయి. పేరున్న సినిమానటి
‘పలానా సబ్బునే వాడుతాను’ అంటే జనం ఎగబడి కొంటారన్న భ్రమలకు గురై వాణిజ్య సంస్థలు ప్రకటనలు
గుప్పిస్తున్నట్టు, ఇప్పుడు ఈ కార్యక్రమాలకోసం ప్రజల్లో
పట్టున్న పండిత ప్రకర్షులను పోటీలుపడి ఎంపిక చేసుకుంటున్న తీరు గమనిస్తే పరిస్తితి
యెంత వేగంగా దిగజారుతున్నదో అర్ధం అవుతుంది. యే రోటి వద్ద ఆ పాట పాడాలి అన్నచందంగా
యే పార్టీ ఆఫీసులో ఆ పార్టీ పలుకు పలికే తీరులో ఇవి ఏడాది ఏడాదికీ విలువలు
పోగొట్టుకుంటున్నాయి. ‘పంచాంగాలా పాత చింతకాయ పచ్చడేం కాదూ’ అంటూ అవహేళన చేసే
హేతువాదులకు, జన చైతన్య కార్యకర్తలకు కొత్త ఆయుధాన్ని చేతికి
అందిస్తున్నాయి. అలాగే, వాటిని పవిత్రంగా, సంస్కృతిలో భాగంగా భావించేవారికి
కూడా ఈ పరిణామాలు తీరని మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని
పునరుద్ధరించాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
తోకటపా:
పంచాంగపఠనం అనాలా, పంచాంగ శ్రవణం అనాలా అనే విషయం పక్కనపెడితే, అసలే ఎన్నికల సమయం, మరి రాజకీయ పంచాంగ శ్రవణ
కార్యక్రమాలు ఎన్నికల నియమావళి కిందికి వస్తాయా లేదా అనేది మరో సందేహం.
08-04-2024
ఇందులో అభ్యంతరం ఏముంది ? పంచాంగం శ్రవణం లో మంచి జరుగుతుంది అని వివిధ పార్టీల వారు
రిప్లయితొలగించండిసరదాపడి చెప్పించుకుంటే తప్పేముంది.
కనీసం ఉగాది రోజు అయినా వారు సంతోషం పొందనివ్వండి. ఇలాంటి విషయాలకు మనస్తాపం కలగడం ఏమిటి?
మీ టపా బావుందండి
రిప్లయితొలగించండిమీలా ఇలా నిఖ్ఖచ్చిగా రాసే వారు ఈ కాలంలో అరుదు. ఏ పార్టీ అయినా మనదే అన్న సమసిద్ధాంతంతో మీరు వ్రాస్తున్నవి తప్పకుండా జనాకర్షకంగా ఉంటున్నాయి.
ఉగాది శుభాకాంక్షలు.
ఏ పార్టీ అయినా మనదే అన్న ఒక అరుదైన సమ సిద్ధాంతంలో మీకు నిక్ఖచ్చితనం గోచరించిందా - ఇక్ఖడే ఏదో తమదైన జిలేబీయం ఔపడుతోందే!!!
రిప్లయితొలగించండితాతగారూ
తొలగించండిఉగాది నాడు కూడా పాతపచ్చడేనా :)
చెప్పేవారిది పంచాంగపఠనం వినేవారికి పంచాంగ శ్రవణం. మధ్యలో మీకెందుకు శ్రమణం . మీకు అన్ని పార్టీలు అస్మదీయులే కాబట్టి ఏదో ఒక చోట పంచాంగం విని ఉగాది పచ్చడి స్వీకరించండి.
రిప్లయితొలగించండి