మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్)
అలా నేనూ మా ఆవిడా విడివిడిగా, కలివిడిగా కలలు కనే రోజుల్లో కలలో మేము కట్టుకోబోయే ఆ కొత్త ఇంటికి పూజ గది విడిగా వుండాలని కోరుకునేది తాను. అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం. అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి ఇదిగో ఈ కింద ఫోటోలోని పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది. అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది.
ఈరోజు జులై 17. అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టి లేపింది.
నాలుగేళ్ల క్రితం అంటే 17-07-2019 నాడు పొద్దున్నే ఏదో ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలో దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.
“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.
ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.
సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో దేవుళ్ళు అందరూ అలాగే వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.
దేవుళ్లా! మజాకా!
17-07-2023
Okanelaemaipoyaaru?
రిప్లయితొలగించండిసారీ అండీ ... అయినా మీరు అన్న చిన్నమాటకి ఒక ప్రాణాన్ని తీసుకుపోయే దుర్మార్గుడు కాదండీ దేవుడు
రిప్లయితొలగించండి