25, మే 2023, గురువారం

ఎం.వి.ఎస్. ప్రసాద్ (ఐ.ఏ.ఎస్.) ఇక లేరు

 

గత మార్చి పదకొండో తేదీన ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు ఫేస్ బుక్ లో ఈ కింది కవిత రాశారు. అది చదివిన మావంటివాళ్ళం నివ్వెరపోయాము. ఏమిటి సార్ ఇలా రాసారు అని అడిగాము కూడా. కానీ ఆయన గారి దగ్గరనుంచి సమాధానం లేదు.  అది ఇలా సాగింది.  


“అలసిపోయాను ధైర్యం పూర్తిగా మరుగునపడింది 

అధఃపాతాళంకి దిగజారిన ఆలోచనా స్రవంతి 

జీవితంలో బుస్సుమని పొంగి పొర్లిన ధారాపాతం 

నేలపాలయి బురద బురద చేసి కకావికలైంది 

బురదపాలైన కాళ్ళు కడుగుదామంటే నీరింకిపాయే 

ఎన్నాళ్లీ ఇష్టంలేని ప్రయాణం ఇక ఆగిపోతే బాగుండు”

చివరి వాక్యం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏమిటి ఈ నిర్వేదం అనిపించింది.

ఆయన రాసుకున్నట్టే  ఆయనకు ఇష్టం లేని ప్రయాణం ఈరోజు అంటే  మే 25 మధ్యాన్నం  నిజంగానే ఆగిపోయింది.

1975 లో నేను ఆలిండియా రేడియోలో చేరినప్పుడు నాకు తారసపడిన మొదటి ప్రభుత్వ అధికారి ఏమ్వీఎస్ గారు. అప్పుడు ఆయన SFDA (Small Farmers Development Agency) కి ఆయన అధికారి. ఎమర్జెన్సీ లో కావాల్సినవి డెవలప్ మెంట్ వార్తలే కాబట్టి ఆయన్ని కలిసాను. అలా అప్పుడు ఏర్పడ్డ  పరిచయం ఇప్పటిదాకా కొనసాగింది. ఆయన ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చాలా కీలకమైన పదవులు నిర్వహించారు. టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్, జీఏడి సెక్రెటరి  ఇలా ఎన్నో. కానీ ఎక్కడా తన మంచి పేరు చెడగొట్టుకోలేదు. రిటైర్ అయిన తర్వాత తన ఇంటి పేరుతొ మేళ్లచెరువు ఫౌందేసన్ స్థాపించి అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన స్వగ్రామం కూడా మేళ్లచెరువు (ప్రకాశం జిల్లా). కనిపినప్పుడు లేదా ఫోన్ చేసినప్పుడు మా దేవాలయం ఒకసారి వచ్చి చూడండి అనేవారు. ఇక అలాంటి ఆహ్వానం ఆయన నుంచి రాదు.  

Madhavi Kolli కొల్లి మాధవి గారు కొంతసేపటి క్రితం ఫేస్ బుక్ లో ఈ సమాచారం ఇచ్చినప్పుడు నా సమాధానం UNBELIEVABLE. గబాగబా అన్ని ఛానల్స్ తిప్పాను. ఎక్కడా ఈ వార్త జాడలేదు.  

చాలా వార్తలు తర్వాత నిజం కాదని  తేలిపోతాయి. కానీ ఇది అలా కాదే! 

బహుశా ఎల్లుండి అంత్యక్రియలు జరగొచ్చని ఏమ్వీఎస్ గారి అబ్బాయి ద్వారా తెలిసిందని  ఇప్పుడే పాత్రికేయ మిత్రుడు చిర్రావూరి కృష్ణా రావు  మెసేజ్ పెట్టాడు.



(Shri M>V>S>Prasad, IAS)


(25-05-2023)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి