16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఆయారాం గయారాం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 16-04-2023, SUNDAY, today)

 

జరుగుతున్న కధలు చూస్తుంటే జరిగిన కధలు గుర్తొస్తుంటాయి ఒక్కోసారి.

‘జనత పార్టీ’ ప్రయోగం విఫలం అయిన తర్వాత, 1980 లో ఇందిరాగాంధీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే, ఆనాటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ రాత్రికి రాత్రే పార్టీ మార్చి, ‘సహేంద్ర తక్షకాయస్వాహా’ మాదిరిగా తన కేబినేట్ మంత్రులు, తన పార్టీ ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయారు. ఆ  సందర్భంలో, నాటి మరాఠా రాజకీయ నాయకుడు ఎస్.బీ. చవాన్, ఈ తరహా ‘రాజకీయ కప్పదాట్ల’కు కొత్తగా చేసిన నామకరణమే ఈ ‘ఆయారాం గయారాం’. అప్పటినుంచి ఈ రాజకీయ విషసంస్కృతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొత్త రెమ్మలు తొడుగుతూనే వస్తోంది. 

ఏ రంగంలోనూ కానరాని ఈ అభివృద్ధి రేటు ఈ రంగంలో చూసి దేశంలోని  రాజకీయ పార్టీలే విస్తుపోతున్నాయి. కోడి మనదే, కోడిని ఉంచిన గంప మనదే అనే ధైర్యం సన్నగిల్లి పోతోంది. గంప గంప లాగానే వుంది. కోళ్ళు మాత్రం మాయం అవుతున్నాయి. అందుకే కాబోలు పార్టీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్ళు తమ కట్టు దాటిపోకుండా అనేక ఎత్తులు వేస్తున్నాయి. ‘ఆయారాం గయారాం’ బెడద తప్పించుకోవడానికి మేఘాలయ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ‘యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ’ చాలా ఏళ్ళ కిందటే  ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే ‘నయా రాం’. దీనికింద పార్టీ టిక్కెట్టు ఇచ్చేముందే అభ్యర్ధులతో, ఇండియన్ కాంట్రాక్ట్ ఆక్ట్ కింద బాండు మీద సంతకం చేయించుకుంటారు, అయిదేళ్ళ వరకు పార్టీ ఒదిలి వెళ్ళమని. కానీ రాజకీయాలను ‘స్కాచి’ వడబొసిన ధిగ్గనాధీరులు, యేరు దాటగానే బోడి మల్లయ్య’ అనడం నేర్చిన వాళ్ళు, ఈ బాండ్లు, సంతకాలు లక్ష్యపెడతారనుకోవడం అమాయకత్వం. 1972 లో అస్సాం నుంచి విడిపడి ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో గత అయిదు దశాబ్దాల కాలంలో పాతిక ముప్పయికి పైగా ప్రభుత్వాలు ‘ఆయారాం గయారాం’ సంస్కృతి కారణంగా మారిపోయాయి. మరికొన్నిసార్లు రాష్ట్రపతి పాలన అదనం. 

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఈ కబుర్లు. 

ఈ పార్టీ ఆ పార్టీ అనికాదు, అందరిదీ ఈ విషయంలో ఒకే మాట, ఒకే బాట.  అనుకూలంగా వున్నప్పుడు ఒక మాటా, ప్రతికూలంగా వున్నప్పుడు మరో మాటా చెబుతూ వచ్చే ఇటువంటి రెండు నాలుకల ధోరణి కారణంగానే రాజకీయ నాయకుల మాటల పట్ల  ప్రజలకు విశ్వాసం కొరవడుతోంది.  


పార్టీ ఫిరాయింపులకు మొదటి బీజం పడింది, స్వతంత్ర భారతంలో 1967 లో జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికల  అనంతరం.  ఆ విత్తనం   యెంత బలంగా పడిందంటే,  ఈ ఫిరాయింపుల ఫలితంగా 1967 - 1973  మధ్య ఆరేళ్ళ కాలంలో పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలచేత ఎన్నికయిన  మొత్తం రెండువేల ఏడువందలమంది ప్రజా ప్రతినిధులు,  తాము ఎన్నుకున్న వోటర్ల ప్రమేయం లేకుండా  వేరే పార్టీల్లో చేరిపోయారు. 1967  నుంచి మూడేళ్ళలో ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలలో ఒకరు పార్టీ మారారంటే, ఫిరాయింపులు యెంత తీవ్రంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ప్రతిఫలం లేకుండా ఈ గోడ దూకడాలు జరగవు అనే నమ్మకానికి ఊతం ఇవ్వడానికా అన్నట్టు  అలా దూకిన వాళ్ళలో పదిహేనుమంది ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. 212 మంది మంత్రులు కాగలిగారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న బాపతు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ వికృత పోకడలకు మొదటి అడ్డుకట్ట వేయడానికి మన రాజకీయ నాయకులకు దాదాపు పదిహేడేళ్ళు పట్టింది.

1984  డిసెంబర్  29 వ తేదీన కర్ణాటకలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం   28 స్థానాలకుగాను నాటి పాలకపక్షం అయిన జనతా పార్టీని  మట్టి కరిపించి, ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని తన సత్తా ప్రదర్శించింది. ఆనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి  రామకృష్ణ హెగ్డే  ఓటమికి నైతిక బాధ్యత వహించి గవర్నర్ కు మంత్రివర్గం తరపున రాజీనామా పత్రం సమర్పించారు. మామూలుగా అయితే అటువంటి పరిస్తితుల్లో గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు.  ఒకటి  జనతా పార్టీనుంచి  ఫిరాయింపులు ప్రోత్సహించి  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. లేదా, రాష్ట్రపతి పాలన  విధించడం.  అంతకుముందు  శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలకు అలవాటు పడిన వారందరూ యువనేత రాజీవ్ గాంధీ కూడా తల్లి బాటలోనే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అనుకున్నారు. అయితే రాజీవ్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీ రద్దు చేయడానికి వీలుగా గవర్నర్ కు స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు రాజీవ్ యెంత వ్యతిరేకం అన్నది ఈ ఒక్క ఉదంతంతో తేటతెల్లమయింది. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన రెండోవారంలోనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్లమెంటులో తమ పార్టీకి వున్న తిరుగులేని  ఆధిక్యతను ఆసరాగా చేసుకుని   52 వ రాజ్యంగ  సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ఈ దశగా తొలి అడుగు వేసారు. కానీ ఏం జరిగింది? ఏం జరుగుతోంది?  ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిందో, అదే పార్టీ కాలక్రమంలో ఫిరాయింపులకు పుట్టిల్లుగా మారింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో పార్టీ మారిన వారి సంఖ్యను లెక్కవేయాలంటే అది చేతివేళ్ళతో సాధ్యం అయ్యే పనికాదు, కాలిక్యులేటర్లు కావాలి. ఈ లెక్కలు చూస్తే ఈ చట్టం ఉద్దేశ్యం నెరవేరిందా లేక ఫిరాయింపులకు చట్టబద్ధమైన మార్గాన్ని ఏర్పరిచిందా అనే సందేహం కలుగుతోంది. అయితే ఈ విషయంలో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి పార్టీ తన స్వప్రయోజనాలకోసం ఈ చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తూ రావడం మరో విషాదం.

పార్టీ ఫిరాయింపులను దొంగతనంతో సమానంగా పరిగణించాలని ఫిరాయింపుల తాకిడితో తల్లడిల్లే పార్టీలు కోరుతుంటాయి.

నిజమే. ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయిన వారిని మరో పార్టీలోకి తీసుకోవడం అంటే ఒక రకంగా అది దొంగతనమే. మరొకరి సొత్తును అపహరించడమే. కానీ 'నేను చేస్తే ఒప్పు నువ్వు చేస్తే తప్పు' అనే ద్వంద్వ వైఖరే ఈ వాదానికి బలంలేకుండా నిర్వీర్యం చేస్తోంది.  

గతంలో ఎన్నికలకు ముందూ, లేదా ఎన్నికలు ముగిసిన తరువాత కొద్దికాలం పాటు ఈ ఫిరాయింపులు నడిచేవి. మారుతున్న కాలానికి, పరిస్తితులకు  అనుగుణంగా ఇప్పుడవి నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఎవ్వరు కారణం అంటే అన్ని పార్టీలకూ ఇందులో అంతో ఇంతో భాగం వుంది. ఈ సంస్కృతి ప్రబలడానికి అందరూ ఎంతో కొంత పాత్ర పోషించబట్టే గట్టిగా తమ వైఖరిని సమర్ధించుకోవడానికి అదే అడ్డం పడుతోంది. ఫిరాయింపులను పోత్సహించేవారు, ఫిరాయింపులవల్ల నష్టపోయేవారిని ఉద్దేశించి 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అని ఎద్దేవా చేయడానికి వీలు కల్పిస్తోంది. 


జూలియస్ సీజర్ నాటకంలో బ్రూటస్ అనే పాత్ర వుంటుంది. సీజర్ కు అతడు ఆరోప్రాణం. సీజర్ అంటే ప్రాణం ఇచ్చే తత్వం బ్రూటస్ ది. చివరికి ఏమైంది. సీజర్ ని అంతమొందించే కుట్రలో అతడూ పాలుపంచుకుంటాడు. ప్రత్యర్ధులు కత్తులు దూసి తనను పొడుస్తుంటే చలించని సీజర్, బ్రూటస్ తనను చంపడానికి కత్తి ఎత్తినప్పుడు మాత్రం అతడి మొహం వివర్ణమౌతుంది. ‘యూ టూ బ్రూటస్’ (బ్రూటస్ !నువ్వు కూడానా) అంటూ ఆశ్చర్యంగా అతడివైపు చూస్తూ ప్రాణాలు వదులుతాడు. 

రాజకీయాల్లో ఇవన్నీ సహజమని సరిపుచ్చుకోక తప్పని పరిస్తితి. ఎందుకంటే ఈనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అనేకమందికి ఇలాంటి అనుభవాలతో కూడిన గతమే వుంది. 


ఉపశృతి:

తమ పార్టీ వాళ్ళు సొంత పార్టీ ఒదిలి బయటకు పరిగెడుతున్నా, పార్టీ అధినాయకులు మాత్రం మొక్కుబడిగా చేసే వ్యాఖ్య ఒకటుంది.’ ఇలా ఎందరు పోయినా మా పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు’

నిజమే వారికోసమే సినారె పాట రాసివుంటారు. 

“ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి, నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి”



1 కామెంట్‌: