(Published in Andhra Prabha today, 26-03-2023, SUNDAY)
ఈ ప్రశ్న వేసింది సామాన్యులు కాదు, ఏకంగా దేశ సర్వోన్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు ధర్మాసనం.
గత మంగళవారం వారం అంటే మార్చి 21 న ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీ.ఎస్. నరసింహంలతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం గురించి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
మరణ శిక్ష పడిన దోషులకు నొప్పి తెలియకుండా చనిపోయే అవకాశం కల్పించాలని అర్థిస్తూ దాఖలైన పిల్ దీనికి ప్రాతిపదిక.
దీనిపై స్పందిస్తూ మెడకు ఉరితాడు బిగించి చంపేసే క్రూరమైన పద్దతి కాకుండా తక్కువ నొప్పితో మరణ దండన అమలుచేసే ఇతర విధానాలపై వివరాలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
దీనికి ఓ నేపధ్యం వుంది.
చాలా సంవత్సరాల క్రితం మరణ శిక్షను రద్దు చేయాలనే ప్రతిపాదన గురించి లా కమిషన్ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించింది.
ఉరిశిక్ష స్థానంలో, తుపాకీతో కాల్చడం, విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, ఎలక్ట్రిక్ కుర్చీలో కూర్చోబెట్టి విద్యుత్ఘాతం లేదా గ్యాస్ ఛాంబర్ లో వుంచి ప్రాణం తీయడం వంటి ప్రత్యామ్నాయ శిక్షలను ఆ నివేదికలో పొందుపరిచారు. అనేక ఇతర దేశాల్లో ఉరి వేసి చంపే పద్దతికి క్రమంగా స్వస్తి చెబుతున్న విషయాన్ని లా కమిషన్ గుర్తు చేసింది.
స్పందించిన ధర్మాసనం ఈ అంశాలతో ఏకీభవించలేదు. తక్కువ నొప్పి అనేది ఇక్కడ ప్రశ్నే కాదని అంటూ, సైన్స్ ఏం చెబుతోంది అన్నదే ప్రధానం అని పేర్కొన్నది. విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, తుపాకీతో కాల్చడం కూడా క్రూరమైన చర్యే అని చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ అభిప్రాయపడ్డారు. మరణ దండన ఏ పద్దతిలో అమలు చేయాలనేది తాము ప్రభుత్వానికి చెప్పలేమని అన్నారు. ఉరివేసి చంపడం వల్ల కలిగే ప్రభావాలపై ఏదైనా శాస్త్రీయ అధ్యయనం వుంటే దాన్ని తీసుకు రావాలని అటార్నీ జనరల్ ను ఆదేశించారు. ఈ విషయంలో నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని విచారణను వాయిదా వేశారు.
మరణ దండనలను ఏ రూపంలో విధించినా వాటిని అమలు చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అని, మరణ శిక్షలను రద్దు చేయాలని ఒక వర్గం నుంచి ఒత్తిడి చాలాకాలంగా వుంది. దీనిపై అనేక వ్యాసాలే కాదు, నవలలు, సినిమాలు కూడా వచ్చాయి.
ప్రాణం తీయడం ఎంత పాపమో, ప్రాణం తీసుకోవడం కూడా మహాపాపం అనే భావం సాధారణ ప్రజల్లో వుంది. ఆత్మహత్య మహాపాతకం అని శాస్త్రాలు చెబుతాయి. ఆత్మహత్యకు ప్రయత్నించడం శిక్షార్హమైన నేరంగా చట్టం కూడా పేర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఉరిశిక్షవిధించే విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది.
సరే! ఇది కేవలం సిఫారసు మాత్రమే కాబట్టి ఇది చట్ట రూపం దాల్చి, మరణ దండనకు నూకలు చెల్లడానికి మరి కొంత కాలం పట్టే అవకాశం వుంది. ఈ సిఫారసులపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల కారణంగా మరింత ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు.
ఈ సందర్భంలో గతాన్ని నెమరు వేసుకోవడం అవసరమే.
ఎనిమిదేళ్ల క్రితం అనుకుంటాను ఇదే అత్యున్నత న్యాయస్థానం మరో కేసులో ఒక సంచలన నిర్ణయం వెలువరించింది. తమ మతాచారం ప్రకారం ప్రాయోపవేశ దీక్ష స్వీకరించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా మరణం కోసం నిరీక్షించే పద్దతి, ఖచ్చితంగా ఆత్మహత్య కిందికే వస్తుందని రాజస్థాన్ హైకోర్టు నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ, కొందరు జైనమత విశ్వాసులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు తమ మత విశ్వాసుల ప్రాధమిక హక్కులను ఉల్లంఘించేదిగా వుందని, రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలకు విరుద్ధంగా వుందని పిటీషనర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు విని, రాజస్థాన్ హైకోర్టు తీర్పు అమలు కాకుండా నిలుపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఉరిశిక్ష పడ్డ నేరస్తులు కూడా ఏదో ఒకవిధంగా ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అలాటిది జైన మతస్తులు తమ మతాచారం ప్రకారం స్వచ్చంద మరణం కోరుకోవడమే కాకుండా దాన్ని ఒక హక్కుగా భావించడం ఆ మతం గురించి అవగాహన లేనివారికి కొంత విడ్డూరంగానే అనిపిస్తుంది. జైనుల జీవన విధానంలో అహింసను పరమధర్మంగా భావిస్తారు. ఉపవాస దీక్ష ద్వారా మరణం పొందడం జైన మతంలో ఒక సాంప్రదాయం. దాన్ని ‘సంథారా’ అంటారు. రాజస్థాన్ హైకోర్టు ఈ సాంప్రదాయాన్ని నేరపూరిత చర్యగా పరిగణించడం సరికాదన్న అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఈ నిర్ధారణకు వచ్చేముందు జైన మత గురువులు, మత పెద్దల అభిప్రాయం తీసుకుని వుండాల్సిందని పేర్కొన్నది. ఒక మతాచారం కనుక సర్వోన్నత న్యాయ స్థానం ఈ విషయంలో ఇటువంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఒక పక్క లా కమిషన్ మరణశిక్షను రద్దు చేయాలని సిఫారసు చేస్తే మరోపక్క స్వచ్చంద మరణాలకు మతాచారం ప్రాతిపదికగా సుప్రీం పచ్చ జెండా ఊపడం ఒకే రోజున జరగడం కాకతాళీయం కావచ్చు.
ఈ స్వచ్చంద మరణాలు మనకు భీష్ముడి కాలంనుంచి ఎరుకే. పూర్వం యుద్ధాల్లో రాజపుత్ర సంతతికి చెందిన రాజులు వీరమరణం చెందినప్పుడు, రాణీవాసపు స్త్రీలు పరాయి మూకల చెరలో చిక్కకుండా చితి పేర్పించుకుని ఆత్మాహుతి చేసుకున్న సందర్భాలు చరిత్ర పుటల్లో కానవస్తాయి. ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సంఘటనలు రోమన్ చరిత్రలో కూడా వున్నాయి. యుద్ధంలో మరణం అనివార్యం అని భావించినప్పుడు రోమన్ సైనికులు తమకు తాముగా ప్రాణాలు తీసుకునే వాళ్ళు.
జపాన్ లో ఓ సాంప్రదాయం వుండేది. దాన్ని ‘హరకిరి’ అంటారు. ‘హరాకిరీ’ అనేవాళ్ళు కూడా వున్నారు. సమాజంలో కులీన కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజాగ్రహానికి గురై, మరణశిక్ష పడ్డప్పుడు, ఆ అవమాన భారం భరించ లేక, తమకు తామే ఈ శిక్ష విధించుకుని ప్రాణాలు తీసుకునేవారు. జపానీయుల భాషలో ’హర’ అంటే ‘పొట్ట’. ‘కిరి’ అంటే కోసుకోవడం. పేగులు చీల్చుకునేలా పొట్టను కోసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘హర కిరి’ అంటారు. కాలక్రమంలో ఈ పదాలకు అర్ధం మారిపోయింది. ఆత్మహననాలకు, ఆత్మహత్యలకు ఇప్పుడిది పర్యాయపదం అయింది.
విదేశాల్లో కొన్ని క్రైస్తవ మఠాలకు సంబంధించిన సన్యాసులు నేల మాళిగల్లో వుండిపోయి సమాధి స్తితికి చేరుకునేవారు.
ఈ రకంగా ప్రాణాలు తీసుకోవడం అనేది మన దేశంలో పూర్వం నుంచి మహా పాపంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అకాల మరణం లేని దీర్ఘాయువు కోరుకోవడం ‘చమకం’ లో వుంది. ‘జీవంతు శరదాం శతం’ అంటే వందేళ్ళు బతకాలని కోరుకునే వారు. ఆశీర్వచనాల్లో కూడా ‘ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు’ అంటూ ఆయువుకే మొదటి పీట.
బలవంతంగా ప్రాణం తీసుకున్న సంఘటనలు విన్నప్పుడు మనస్సు చివుక్కు మంటుంది. ప్రాణం ఉన్నంతవరకు జీవించాలి కాని, ప్రాణం తీసుకుని ఉసురు తీసుకోవడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదనిపిస్తుంది.
నిజానికి ప్రాణత్యాగం అనేది మామూలు విషయం కాదు. అందుకే శత్రువులనుచి రహస్యాలు రాబట్టేవారు అంతిమంగా ‘ప్రాణాలు దక్కవంటూ’ హెచ్చరించడం అనేక సినిమాల్లో సాధారణం.
లక్ష్యం యెంత ఉన్నతమైనదైనా దాన్ని సాధించి తీరడానికి బతికి వుండాలి కాని, ఆ క్రమంలో నిండు ప్రాణాలు తీసుకోవడం వల్ల ఆ లక్ష్య సాధనను కళ్ళారా చూసే మహత్తర అవకాశాన్ని చేజేతులా కోల్పోతారు.
కాబట్టి ఆత్మహత్య అనేది తుట్టతుది మార్గం కూడా కాదు. అసలది మార్గమే కాదు.
తోకటపా: ఎల్లాగు ఇందులో జైనుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారికి సంబంధించిన ఒక అంశంతో దీన్ని ముగిస్తాను.
పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో రాసుకునే ప్రతి ఉత్తరం ‘తప్పులున్న క్షమించగలరు’ అనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీగా అనేక పర్యాయాలు ‘సారీ’ అనే పదాన్ని ఉదారంగా వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ‘ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు. అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం కలిగివుండడం భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇదీ కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే, కాలు తొక్కి ‘సారీ’ చెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి, చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి, క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.
క్షమాపణలు అర్దించే ఒక విధానం జైన మతంలో కూడా వుంది. దీని వాళ్లు ‘మిచ్చామి దుఖఃడం’ అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. ‘మిచ్చామి దుఖఃడం’ అనేది ప్రాకృతంలో ఒక పదబంధం.
'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
'దుఖఃడం' అంటే దుష్కృత్యాలు. చేసిన చెడ్డ పనులు అని తాత్పర్యం.
జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున, భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు ‘నేను చేసిన తప్పులను మన్నించండి’ అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.
మంచి ఆచారం కదా!
చక్కటి వ్యాసం, ఆలోచింపజేసింది.
రిప్లయితొలగించండిమీరు ఏదైనా ప్రత్యామ్న్యాయం చెబుతారేమో అని ఆశించాను. జర్నలిస్టులు ఆలోచింపచేయాలి (అదే.. కెలకాలి) కాని ప్రత్యామ్న్యాయాలు చెప్పకూడదని నిబంధన ఏదైనా వుందెమొ, తెలియదు.
అతి హేయమైన నేరాలు చేసిన బ్రతుకులు బ్రతికి ఏం ప్రయోజనం? పన్ను కట్టే వారికి మేపే భారం తప్ప? కడతేర్చాల్సిందే అనుకుంటా. అయితే మరుజన్మలో వారికి సద్గతి పొందే అర్హత కోర్టు వారు అవకాశం కల్పించడం న్యాయం. ఉదాహరణకు.. కిడ్నీలు, ఎముకలోని మజ్జ, కళ్ళు, చర్మం లాంటివి వేరొకరికి దానం చేసుకునే అవకాశం ఇవ్వాలి, ఎందుకూ కొరగాని శరీర భాగాలని ఏ జంతుశాలకో, పార్శిగుట్టకో తరలించాలని ఘనత వహించిన కోర్టు వారిని, చట్టాలు చేసే సచ్చీలురైన ప్రజా ప్రతినిధులను (40% నేరస్థులైన ప్రజాప్రతినిధులు పోగా, తక్కిన వారిని) వేడుకోవటం తప్ప ఏం చేయగలం?
ప్రత్యామ్నాయం చూపడం, ఒక స్టాండ్ తీసుకోవడం అటుంచి స్వీయ అభిప్రాయం ఈ బ్లాగులో చూడలేదు.
తొలగించండిఅయితే వ్యాసం ఆసక్తికరం గా వ్రాశారు.
అతి క్రూరమైన క్షమార్హం కాని నేరాలు చేసినవారికి మరణ శిక్ష విధించడం సరైనదే.
ఏదో సబ్జెక్ట్ రాయబోయి మరేదో రాసి పడేసినట్టున్నారు :)
రిప్లయితొలగించండి