27, ఫిబ్రవరి 2023, సోమవారం

మై హూ నా! – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha daily on 26-02-2023, SUNDAY)


ఎవరి పరిపాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులకు రోజువారీ జీవితం హాయిగా

గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.


మూడు దశాబ్దాలకు పూర్వం మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే అవకాశం నాకు లభించింది. 1990 లో ఓ సెలవు రోజున ఢిల్లీ నుంచి మాస్కో  వస్తున్న ఓ మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి భార్యా పిల్లలతో కలిసి మాస్కో నగర పొలిమేరల్లో వున్న షెర్మేతోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి టాక్సీలో బయలుదేరాను. విపరీతంగా మంచు కురుస్తోంది. మార్గమధ్యంలో వుండగా కారు టైర్లు మంచులో  జారిపోయి ఓ పక్కకు వెళ్లిపోయింది. ఏం జరిగిందా అని ఆందోళన మొదలయ్యేలోగా, మంచు తెర కమ్మిన కారు కిటికీ అద్దం వెనుక ఆరున్నర అడుగుల భారీ శరీరం కనిపించింది. నల్లటి యూనిఫారం చూడగానే అతడు ట్రాఫిక్ పోలీసు అని గుర్తు పట్టాను. ఇంత  మంచువర్షంలో హఠాత్తుగా ఇతడెలా ప్రత్యక్షం అయ్యాడో అర్ధం కాలేదు. ఇప్పుడీ కేసు తేలేదాకా రోడ్డు మీద అవస్థలు తప్పవేమో అని భయపడుతున్న సమయంలో, ఆ పోలీసు రెండు కాళ్ళు నేల మీద గట్టిగా చరిచి, ఫుల్ సెల్యూట్ చేయడంతో మా మొహాల్లో  భయం తగ్గిపోయి ఆశ్చర్యం ఆవరించింది. పౌరులకు అక్కడి పోలీసులు ఇచ్చే మర్యాద అని తరువాత తెలిసింది. అతడు ఆ మంచులో కారు దిగవద్దని మాకు  సైగలు చేస్తూ, వాకీ టాకీలో  మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాల్లో మరో టాక్సీ వచ్చి ఆగింది. అందులోకి మమ్మల్ని ఎక్కించిన తర్వాతనే అతడు ట్రాఫిక్ కేసు విషయం చూసుకోవడం మొదలు పెట్టాడు. కేసు విచారణ పేరుతొ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించని అతడి తీరు మమ్మల్ని ఎంతగానో  విస్మయపరచింది. చాణక్యుడు చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. 


యాభయ్ ఏళ్ళ క్రితం 

ఒకసారి మా వూరికి  పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. 

ప్రోగ్రాం ప్రకారం  ఆయన మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో దూరంగా  జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది, మంత్రిగారు  వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. ఊరి పోలిమేరల్లోకి వచ్చి ఊరిలోకి వెళ్ళే  దారి తెలియక చాలాసేపు ఇబ్బంది పడిన విషయం ఆయన చెప్పేదాకా తెలియదు. అంత అధ్వాన్నంగా ఉండేవి ఆరోజుల్లో  రహదారి సౌకర్యాలు. మా ఊరికి అయితే బండ్ల బాట మినహా వేరే దారిలేదు. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి మంత్రిగారు  నిష్క్రమించారు. 

సరైన రోడ్డు సదుపాయం లేక  ఆ ప్రాంతపు ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అనుభవం లోకి రావడం వల్లనెమో, ఢిల్లీ వెళ్ళగానే ఆ విషయంపై దృష్టి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక  గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. స్తంభాలు, కంకర, సిమెంటు వగైరా ప్రభుత్వం ఇస్తుంది.

కే ఎల్ రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ గ్రామాల ప్రజలు ఆ రోడ్డుని కేఎల్ రావు గారి రోడ్డనే పిలుస్తారు.

ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చేది చాణక్యుడి సూక్తే.   

గత కొన్నేళ్లుగా  జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. 

అయినా కానీ, ప్రజలకు కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేము.

అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలకు కూడా ఈ అవస్థలు తప్పడం లేదు

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పౌరుడికి ఒక సమస్య ఎదురయినప్పుడు

దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెడతాడు. స్పందించే అధికారి వుంటే చాలు

సగం సమస్య తీరిపోయినట్టుగా అతడు భావిస్తాడు. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం 

అంటూ వుంటుంది. కొన్నిటికి తక్షణ ఉపశమనం లభిస్తే మరి కొన్ని నిదానంగా

పరిష్కారమవుతాయి.

మేము ఉంటున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో కోతలు లేవు. కానీ అంతరాయాలు

వున్నాయి. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు

సాంఘిక మాధ్యమాలు అందుబాటులో వున్నాయి. 

నాకు తెలిసిన విషయాలను

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం చేస్తూ వస్తున్నాను. గతంలో కూడా మా

ప్రాంతవాసుల సమస్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే మునిసిపల్ అధికారులు

తక్షణం స్పందించారు. అలాగే మరో అనుభవం.

ఒకరోజు రాత్రి కాసేపు కరెంటు పోయింది. లిఫ్ట్ లో ఒక పెద్దావిడ చిక్కుకు పోయింది.

కాసేపటికి కరెంటు వచ్చింది. ఆ పెద్దావిడ మా అపార్ట్ మెంటులో ఎవరినో

చూడడానికి వచ్చింది. లిఫ్ట్ ఇబ్బంది పెట్టడంతో గాభరా పడిపోయింది. ఇది

చూసి రాత్రి పొద్దుపోయిన తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టాను.

“వేసవికాలం ప్రవేశించింది. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో పౌరుల

ప్రేమయాత్ర ముగిసింది అనుకోవాలా!  అటక ఎక్కించిన పవర్ ఇన్వర్టర్లను, జెనరేటర్లను

మళ్ళీ కిందికి దింపాలేమో! ఇలా చెప్పడానికి కాసింత  సిగ్గుపడుతున్నాను”

కఠినంగా రాశానేమో అని నాకే తరువాత అనిపించి ఆ పోస్ట్ తీసివేశాను.

ఆవిషయం మరచిపోయాను.

మరునాడు మధ్యాన్నం కాబోలు అయిదారుగురు మా ఇంటికి వచ్చారు.

“పొద్దున్న చైర్మన్ ప్రభాకర రావు గారు ఫోన్ చేశారు”

వారిలో ఒకరు ఈ మాట అంటూ, తనని తాను పరిచయం చేసుకున్నారు.

ఆయన గారి పేరు ఆనంద్.ట్రాన్స్ కోలో  సూపర్ ఇన్ టె౦డింగ్ ఇంజినీరు.

మిగిలినవాళ్ళు ఏడీయీలు, ఏఈలు.

సమస్య ఏమిటని అడిగారు. నేను చెప్పింది విన్నారు. అప్పటికే ఆశ్చర్యంలో

మునిగిపోయి ఉన్న నాకు ఆయన తన సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన కొన్ని విషయాలు

చెప్పారు. అది వింటుంటే నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. 

మా ప్రాంతంలో ఈ నెలలో అయిదు సార్లు కరెంటు పోయిందని చెబుతూ,  కరెంటు పోయిన

టైమును, మళ్ళీ వచ్చిన సమయాన్ని వివరాలతో సహా చూపించారు. నాలుగుసార్లు ఈ

ఎల్ (ఎర్త్ లీకేజీ), ఒకసారి ఓఎల్ (ఓవర్ లోడ్) వల్ల సరఫరాకు అంతరాయం

కలిగినట్టు రికార్డులలో వుంది.

ఎస్ ఈ గారి అధీనంలో మొత్తం 38 సబ్ స్టేషన్లు వుంటాయిట. ప్రతిరోజూ ఆ

ఏరియాల్లో ఎక్కడ, ఎన్నిసార్లు కరెంటు పోయిందనే వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్

అవుతాయట. ఆ సమాచారం ఆధారంగా వెనువెంటనే సరఫరా పునరుద్ధరణకు రాత్రీ పగలూ

ఇరవై నాలుగు గంటలు సిబ్బంది సిద్ధంగా వుంటారట.

సాధారణంగా చెట్ల కొమ్మలు నరికే సమయాలను ముందుగానే ఆయా వినియోగదారులకు

ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేస్తారట.

ఎంత ప్రయత్నం చేస్తున్నా తమ చేతిలో లేని కారణాల వల్ల సరఫరాలో ఆటంకాలు

కలుగుతున్న మాట నిజమే అని చెబుతూ, వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించడానికే

తాము, తమ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్పారు.

మా ప్రాంతంలో కరెంటు సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి చేయవలసినది

చేస్తామని హామీ ఇచ్చారు.

ముందే చెప్పినట్టు సమస్య పరిష్కారం ముఖ్యమే కావచ్చు కానీ, సమస్యను విని,

‘నేనున్నాను కదా!’ అని భరోసా ఇచ్చేవాళ్ళు కూడా అంతే ముఖ్యం. అప్పుడే

ప్రభుత్వం పనిచేస్తోందని జనం అనుకుంటారు. పనిచేసే ప్రభుత్వం అని

మెచ్చుకుంటారు.

మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత చాణక్యుడి సూక్తి మరోమారు స్పురణకు వచ్చింది.

ప్రభుత్వ ప్రమేయం లేని సాధారణ జన జీవితం. వినడానికి బాగానే వుంది.

ఇలా అడపా దడపా కాకుండా చాణక్యుడి సూక్తి అనుదినం గుర్తుకు వచ్చే బంగారు రోజులు వస్తే ఎంత బాగుంటుందో!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి