ఛార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హోత్చంద్
భావ్నాని ఎవరో తెలుసా అంటే ఉహు అనే జవాబు వస్తుంది.
అదే ఛార్లెస్ శోభరాజ్ అంటే?
1970
ప్రాంతాల్లో ప్రాయంలో ఉన్న నాలాంటి వాళ్ళు అందరూ ‘తెలియకేం అతడో సీరియల్ కిల్లర్
అనేస్తారు. అంతే కాదు, శోభరాజ్ ఓ గజదొంగ, మోసగాడు, కామపిశాచి, తడిగుడ్డతో
గొంతుకోసే రకం అని కూడా అంటారు. కమల్ హసన్ నటించిన ఎర్రగులాబీ సినిమాలో హీరోయిక్
విలన్ మాదిరిగా ఆడవాళ్ళను అనుభవించి కడతేర్చే టైప్ అన్నమాట. కమల్ ఆ సినిమాలో పెట్టుకున్న టోపీ కూడా
ఛార్లెస్ మోడల్ టోపీనే.
1944
లో వియత్నాం లోని సైగాన్ లో జన్మించాడు. తండ్రి భారతీయుడు. తల్లి వియత్నాం దేశస్తురాలు.
తర్వాత ఆవిడ భర్తనుంచి విడిపోయి ఓ ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లాడింది. ఈ నేపధ్యంలో
పెరిగిన శోభరాజ్ భావి జీవితంలో మంచితనం మచ్చుకు కూడా కానరాని కర్కోటకుడిగా మారాడు.
1963
పారిస్ లో దొంగతనం చేసి పట్టుబడి జైలు ఊచలు లెక్కబెట్టడంతో ఇతడి నేర చరిత్రకు
అంకురార్పణ జరిగింది. దానితో జైలు అంటే భయం లేకుండా పోయింది.
ఆడపిల్లలను కట్టిపడేసే అందాన్ని అడ్డుపెట్టుకుని,
తేనె పూసిన కత్తిలా ఎందరెందరో పర్యాటక అతివలను
ఆకట్టుకుని అనంతరం వారిని హతమార్చేవాడు. అందుకే బికినీ కిల్లర్ అనే పేరు కూడా
సంపాదించుకున్నాడు.
దక్షిణాసియా,
ఆగ్నేయాసియా దేశాల్లో కనీసం ఇరవైమంది పర్యాటకులను హత్య చేసినట్టు ఇతడిపై అభియోగాలు వున్నాయి. ఒక్క
థాయ్ లాండ్ లోనే పద్నాలుగుమందిని హతమార్చాడట. అతడు నేరాలకు పూనుకున్న దేశాలను
వేళ్ళమీద లెక్కించడం కష్టం. ఫ్రాన్స్,
గ్రీసు,
టర్కీ,
ఇరాన్,
ఆఫ్ఘనిస్థాన్,
పాకిస్తాన్,
నేపాల్,
ఇండియా,
థాయ్ లాండ్,
మలేసియా మొదలయిన దేశాల్లో ఇతడి నేర సామ్రాజ్యం విస్తరించింది. దొరికినట్టే దొరికి
తప్పించుకుని పోయే ఒడుపు తెలిసిన శోభరాజ్ కి సర్పెంట్ (నాగుపాము) అనే మారుపేరు
వుంది. ఆ పేరుతో ఎంతటి ప్రాచుర్యం పొందాడు అంటే ది సర్పెంట్ అనే పేరుతొ బీబీసీలో (నెట్ ఫ్లిక్స్) ఏకంగా ఒక టీవీ సీరియల్
వచ్చింది. ఇతడి జీవిత కధ ఆధారంగా పుస్తకాలు, డాక్యుమెంటరీలు,
మై ఔర్ ఛార్లెస్ అనే సినిమా కూడా వచ్చాయి.
ఇండియన్ పోలీసులకు చిక్కి 1976 నుంచి 1997
వరకు జైల్లో గడిపాడు. తర్వాత పారిస్ కు వెళ్లి 2003
లో నేపాల్ చేరుకున్నాడు. అక్కడ అరెస్టు అయి కోర్టు విచారణ ఎదుర్కుని జీవితకాల ఖైదు శిక్షకు గురయ్యాడు. ఇరవై ఏళ్ళ జీవిత ఖైదు శిక్షలో ఇంకా ఒక ఏడాది
మిగిలి వుంది అనగా,
నేపాల్ సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఒకటో తేదీన, 78 ఏళ్ళ వయసులో అతడిని విడుదల చేస్తూ తీర్పు
ఇచ్చింది. దరిమిలా అతడిని డిసెంబరు ఇరవై మూడున ఫ్రాన్సుకు తిరిగి పంపారు.
కొసమెరుపు :
ఛార్లెస్ శోభరాజ్ గురించిన ఒక
ఆసక్తికర విశేషాన్ని ఇండియా టుడే వంటి ప్రసిద్ధ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసిన ప్రముఖ పాత్రికేయులు ఎస్. వెంకట నారాయణ గారు
తెలియచేసారు. ఆయన మాటల్లోనే
సంక్షిప్తంగా:
“ఇది జరిగి రెండు దశాబ్దాలకు పై
మాటే. అరెస్టు చేసిన ఛార్లెస్ ని పోలీసులు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు తీసుకువచ్చారు.
ఎవరినో కలవడానికి వెళ్ళిన నాకు అక్కడ ఛార్లెస్ తారసపడ్డాడు. ఇంటర్వ్యూ అడిగాను. వెంటనే
ఒప్పుకున్నాడు కానీ,
కొన్ని షరతులు పెట్టాడు. నేను అడిగే ప్రశ్నలను లిఖితపూర్వకంగా ఆయన న్యాయవాదికి ఇవ్వాలి. వాటికి జవాబులు రాసి
తన లాయర్ కి ఇస్తాడు. అదీ ఒప్పందం.
“ఆ ఇంటర్వ్యూ అనేక జాతీయ పత్రికల్లో వచ్చింది. దాని తెలుగు
అనువాదాన్ని స్వాతి తెలుగు వారపత్రికలో కూడా విపులంగా ప్రచురించారు. తర్వాత ఓ నెల
రోజులకి నేను మళ్ళీ ఛార్లెస్ ని కలిసాను. నన్ను చూడగానే థాంక్స్ నారాయణ గారూ
అన్నాడు. నాకు అర్ధం కాలేదు. అదే అడిగాను.
“స్వాతి తెలుగు వార పత్రికలో నాతో మీరు చేసిన ఇంటర్వ్యూ చదివి నన్ను పెళ్ళాడాలని
వుందని ఆ తెలుగు రాష్ట్రం నుంచి వంద ఉత్తరాలు వచ్చాయి. ఒక్కసారి నేను జైలు నుంచి
బయట పడనివ్వండి. వాళ్ళలో ఒకరిని పెళ్ళాడుతాను. భారతీయ పౌరసత్వం తీసుకుంటాను. ఈ దేశంలో హాయిగా శేష జీవితం గడుపుతాను’
“ఇదీ ఛార్లెస్ సమాధానం. నేను నవ్వి
గుడ్ లక్ చెప్పేసి వచ్చేశాను.
“అదే ఆఖరిసారి నేను ఛార్లెస్ శోభరాజ్
ని చూడడం. తర్వాత అతడ్ని నేపాల్ పోలీసులు
అరెస్ట్ చేసినట్టు పత్రికల్లో చదివాను. ఛార్లెస్
ని పెళ్ళాడుతామని ఉత్తరాలు రాసిన యువతులు, ఈ పాటికి పెళ్ళిళ్ళు చేసుకుని,
అమ్మలై, బామ్మలై హాయిగా జీవితాలు గడుపుతూ వుంటారు.
“అలాంటి వాళ్ళలో ఎవరైనా తటస్థపడితే
ఒక ప్రశ్న అడగాలని వుంది. ‘ ఇప్పుడు ఛార్లెస్ విడుదల అయ్యాడు. మరి ఛార్లెస్
గురించి ఏమనుకుంటున్నారు?’ (పెళ్ళాడే ఉద్దేశం అలాగే వుందా?
మారిపోయిందా?)
ముగించారు నారాయణగారు.
కింది ఫోటో:
జైలు నుంచి విడుదలై ఫ్రాన్స్ వెడుతున్న ఛార్లెస్ శోభరాజు
(24-12-2022)
మీ రేమిటి ఇంకా 2020 లోనే లాక్ అయిపోయినట్టున్నారు ? ఈ మధ్య వచ్చే పోస్ట్లకు ఇయర్ 2020 వేస్తున్నారు చివరాఖర్లో ? :)
రిప్లయితొలగించండిచార్లెస్ కోసం ఫ్రాంస్ లో చాలా మంది క్యూ కట్టి వెయిట్ చేస్తున్నారంట ఆల్రెడీ :(
ఇటువంటి వ్యక్తులను (ఆంగ్లంలో dregs of society అనవచ్చు) ఇంత గ్లామరైజ్ చెయ్యడం అవసరమా? దీనికి పూర్తి బాధ్యత పాత్రికేయులే వహించాలి అంటాను.
రిప్లయితొలగించండిఅన్నిటికీ పాత్రికేయులే కారణమనటం ఈ మధ్య కాలం లో ఫేషన్ అయిపోయింది
తొలగించండిజనాలకు బుద్ధి ఉన్నట్టా లేనట్టా ?
మీడియాదే పూర్తి బాధ్యత అని చెప్పలేము.
తొలగించండిఇప్పుడు ఉన్న వికృత ఛానెళ్లు, గాసిప్ వెబ్ సైట్లు, ఉన్మాద యూ ట్యూబ్ ఛానెల్స్ అప్పుట్లో లేవు.