3, డిసెంబర్ 2022, శనివారం

ఆగిపోయిన దరహాసం – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు  శనివారం ఉదయం ఎప్పటిలాగే ఇంటి ముందు వరండాలో (మామూలుగా అపార్ట్ మెంట్ కల్చర్ లో వరండాకు వీలుండదు, కానీ ఏరికోరి ఆ ఏర్పాటు చేసుకున్నాడు) కుర్చీలో కూర్చుని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు మా మేనల్లుడు కౌటూరి దుర్గా ప్రసాద్. అలా మాట్లాడుతూనే ఓ పక్కకు ఒరిగిపోయాడు. దగ్గరలో ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు కానీ ఫలితం దక్కలేదు. ఏకాదశి పుణ్య తిధినాడు అనాయాసంగా కన్ను మూశాడు నా మేనల్లుడు, ఆప్త మిత్రుడు పెద్దబాబు. పెద్ద బాబు ఇక లేడు అనే వార్తతో ఇంటిల్లిపాదీ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.

నాకంటే వయసులో చాలా చిన్న. కానీ ఆ చిన్నవయసులోనే ఒక మనిషి సాధారణ  జీవితంలో ఏమి సాధించవచ్చో అన్నీ సాధించే ప్రయత్నం చేశాడు.

డిగ్రీ పాసవుతూనే ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం, ఏడాది తిరగకుండానే ఖమ్మం నాగార్జున గ్రామీణ బ్యాంకులో ఆఫీసరు కొలువు, అది వదిలేసి ప్లీడరు ప్రాక్టీసు, ఆ పిదప రాజకీయ రంగ ప్రవేశం, జలగం వెంగళరావుకు అత్యంత ఆత్మీయుడుగా మారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరో అవతారం, ఢిల్లీ దాకా వెళ్లి నానా ప్రయాస పడినా అసాధ్యం అనుకునే  కాంగ్రెస్ టిక్కెట్టు, అదీ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇంటికే వచ్చి వొళ్ళో పడడం, రాజకీయం రంగూ రుచీ వాసనా తెలియని వయసులో అసెంబ్లీకి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం  అలా అన్నీ పాతిక ముప్పయి వయసు లోపలే జరిగిపోయాయి.

ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి దుర్గాప్రసాద్  ప్రత్యక్ష సాక్షి. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.  

ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ ఓ) లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?

ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది.


(కౌటూరి దుర్గాప్రసాద్)


 

రాజకీయాల్లో ఆటుపోట్లన్నీ తట్టుకుని నిబ్బరంగా నిలబడ్డాడు. అందులో పైకి రాలేకపోయినా మొత్తం కుటుంబానికి మంచీచెడూ కనుక్కునే పెద్ద దిక్కుగా మారాడు.  

తనపై తనకు అంతులేని ఆత్మ విశ్వాసం, దాన్ని వ్యక్తీకరిస్తున్నట్టు ఎన్నడూ చెరగని దరహాసం. పెద్దబాబును చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేసేది, ఒక్కోసారి భయం వేసేది. చాలాసార్లు  ధైర్యం కలిగేది.

ఎవరు ఏ సమస్యలో వున్నా సరే, అదో సమస్యా అని తేలిగ్గా అంటూ మనసుల్ని తేలిపరిచేవాడు. తనకు చేతనైన సాయం అడగకుండానే చేసేవాడు. తన సమస్యలను ఎవరి వద్దా ప్రస్తావించేవాడు కాదు.

1992 లో వివాహ రజతోత్సవం నాడు, ఖమ్మం నుంచి హైదరాబాదుకు ఓ గజమాలతో వచ్చి, దండలు లేని పెళ్లి చేసుకున్నానని అదే పనిగా గొప్పలు చెబుతుంటావు కదా! ఈరోజు మీ పెళ్లి నేను దగ్గర వుండి జరిపిస్తాను” అన్న పెద్దబాబును మరచిపోవడం సాధ్యం అయ్యే పనికాదు, వాడి మాటల్ని పదేపదే గుర్తు చేసుకోవడం తప్ప.

“అనాయాసేన మరణం, వినా ధైన్యేన జీవనం” ఈ సూక్తికి పెద్దబాబే పెద్ద ఉదాహరణ.

(03-12-2022)

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి