నెల అంటే ముప్పయి
రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ
అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు
ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ
రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ
అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్
మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో
పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో
వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ
మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ
మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’
ఏంటో చూద్దాం.
కొన్నేళ్ళ క్రితం ఒక
ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని
తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా
సాగుతుంది.
‘హల్లో! ఎలా
వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
‘మా ఆవిడా! ఓకేరా!’
‘ఏమిటీ జస్ట్
ఓకేనా! అంతేనా!’
‘..........’
‘చాలా ఆశ్చర్యంగా
వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే
ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ
సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు
తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన
రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి.
ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు
తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా
మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం
వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు.
పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు
చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ
సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా
తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక.
ఆయ్!!’
కాబట్టి మొగుడు
మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష
పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే
అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి.
ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక
కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ
కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి
నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం
కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.
ప్రయత్నం చేస్తే
పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.
(NOTE: Image
Courtesy: RotteneCARDS)
😡
రిప్లయితొలగించండిఇదేదో రివర్స్ లో ఉండాలేమో కదా? మొగుడ్ని ఆ ఒక్కరోజు పొగిడి, మిగిలిన 364 రోజులూ (లీపు సంవత్సరంలో మరొక రోజు బోనస్) అనరాని మాటలూ అంటూ గడపడం - ఆడవారి జన్మహక్కు గదా?
రిప్లయితొలగించండి(మరి ఈవిడెందుకు కళ్ళెర్ర జేస్తున్నారు 🤔🤔).
@Vnr గారు,
తొలగించండిమీరు ఫోటో లో మేటర్ చదవలేదు.😡
చదివానండి, క్షుణ్ణంగా చదివాను. అందుకే నా మాటకు “కట్టుబడి” ఉంటున్నాను (రాజకీయ నాయకుల్లాగా) ☝️.
తొలగించండి“ఫొటోలో మేటర్” ఏమంటోంది? ఆల్కహాల్ సహాయంతో మగవాడు చేసే పనులను ఆడవారు ఆల్కహాల్ అవసరం లేకుండానే సునాయాసంగా చెయ్యగలరు అంటోంది. అంటే ఆడవారి సహజ టాలెంట్ ని మెచ్చుకుంటోంది అన్నమాట.
సంతోషించక కన్నెర్ర చేస్తారేం?
😁😁