31, ఆగస్టు 2022, బుధవారం

మిహాయిల్ గోర్భచెవ్ ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

 


తారాజువ్వలా దూసుకుపోయి చాలా తక్కువ సమయంలో విశ్వవ్యాప్త ప్రచారం పొందడంలోనూ, అలాగే నేలకు రాలిపోయి, జీవించి వుండగానే దుర్భరమైన నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యే దారుణ పరిస్తితికి చేరుకునే విషయంలోనూ మాజీ సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గీవిచ్ గోర్భచేవ్ తో పోల్చదగిన మరో రాజకీయవేత్త ఇటీవలి కాలంలో మరొకరు కానరారు.
1985 లో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరి గా నియమితులయినప్పుడు నుదిటికి కొంచెం ఎగువన లేత ఊదా రంగు పుట్టుమచ్చ కలిగిన ఈ బట్టతల పెద్ద మనిషి ఎవరన్న సందేహాలు స్వదేశంలోనే తలెత్తాయి. అప్పటికి ఆయన వయసు యాభయ్ నాలుగు సంవత్సరాలు మాత్రమె. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయనకు పూర్వం ఈ పదవిని అలంకరించిన వయసుడిగిన నాయకులతో పోలిస్తే ఆయన చాలా చిన్నవయసులోనే ఈ అత్యున్నత పదవికి చేరుకున్నట్టు లెక్క. పొలిటిబ్యూరోలో గోర్భచేవ్ తో అతి సన్నిహితంగా మెలిగే తలనెరిసిన పెద్ద తలకాయలు ఎవ్వరూ రానున్న ఆరేళ్ళ కాలంలో సోవియట్ యూనియన్ భవితవ్యం ఆయన నాయకత్వంలో ఊహాతీతమైన మార్పులకు గురవుతుందని పసికట్టలేకపోయారు. పదవిలోకి వచ్చీరాగానే ఏమాత్రం కాలయాపన చేయకుండా వరసగా అనేక సంస్కరణలకు గోర్భచేవ్ శ్రీకారం చుట్టారు. మానవతాకోణం కలిగిన సోషలిజం నిర్మాణం దిశగా, పాశ్చాత్య ప్రపంచంతో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, ప్రచ్చన్నయుద్ధానికి ముగింపు పలుకుతూ విశ్వశాంతి లక్ష్యంగా తలపెట్టిన ఆ సంస్కరణల వేగం చూసి సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులే ముక్కున వేలేసుకునే పరిస్తితి. ఒక్క నికితా కృశ్చెవ్ హయాములో మినహాయిస్తే, సోవియట్ యూనియన్ కి ఇది సరి కొత్త అనుభవం.
తాను తలపెట్టిన సమూల సంస్కరణలకు మరింత ఊతం కల్పించే ఉద్దేశ్యంతో గోర్భచేవ్ ‘పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), గ్లాస్ నోస్త్ (దాపరికం లేని పాలన)’ అనే ముద్దు పేర్లతో రెండు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఆనతి కాలంలోనే ఇవి రెండూ అత్యంత ప్రజాదరణకు నోచుకున్నాయి. గోర్భచేవ్ భావించినట్టే ఆయన ఈ వ్యూహం మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చింది.
వాటిని గురించి దేశ వ్యాప్తంగా గోర్భచేవ్ ఇస్తూవచ్చిన ప్రసంగాల టేపులకు అపరిమితమైన గిరాకీ ఏర్పడింది. వాటిని నల్లబజారులో అధిక ధరలకు, అంటే అయిదువందల రూబుళ్ళు పెట్టి విరగబడి కొనే పరిస్తితులు జనంలో నానాటికీ పెరుగుతున్న అభిమానానికి కొలమానాలుగా మారాయి అని గోర్భచేవ్ జీవిత చరిత్ర రాసిన విలియం టాబ్ మాన్ పేర్కొన్నారు.
నేను 1987 నుంచి వరకు దాదాపు అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేశాను. ఆ రోజుల్లో మిహాయిల్ గోర్భచేవ్ పేరు మొత్తం సోవియట్ యూనియన్ లోనే కాదు యావత్ ప్రపంచదేశాల్లో మారుమోగుతూ వుండేది. అప్పటికి రెండేళ్ళ క్రితమే లో గోర్భచేవ్ సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అంటే ఆ దేశంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించగలిగే అధికారం ఉన్న ఏకైక పదవి. అంతటి ఎదురులేని అధికారం గుప్పెట్లో ఉందనే ధైర్యమే కాబోలు వారి చేత ఎక్కువ మాట్లాడిస్తుంది. ఈ విషయంలో గోర్భచేవ్ ఒక నాలుగాకులు ఎక్కువ చదివారని అనుకోవచ్చు. మాస్కోలోనే కాదు, యావత్ దేశంలో ఏ మూల టీవీ పెట్టినా, రేడియో పెట్టినా ఆయన ఏదో మాట్లాడుతూ కనిపించేవారు. గంటలు గంటలు ప్రసంగించినా సోవియట్ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వుండేది. ఆయనకు కూడా పత్రికలంటే ప్రాణం. ఏం చేసినా ఏం మాట్లాడినా అది నలుగురికీ తెలియడం అవసరమనే భావన ఆయనది. అధికారం పోయిన తర్వాత కూడా గోర్భచేవ్ ఈ అలవాటును వదులుకోలేదని అయన తర్వాత అధికార పగ్గాలు స్వీకరించిన బోరిస్ ఎల్త్ సిన్ దగ్గర ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన వ్యాచెస్లావ్ కోస్తికొవ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నారు.
కోమ్సమాలొస్కయా ప్రావ్దా అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్భచెవ్ ఒకసారి బోరిస్ ఎల్త్సిన్ విధానాలను తూర్పారబట్టారు. ఆ ఇంటర్వ్యూ చేసింది దిమిత్రీ మురతోవ్. ఆ విలేకరి అంటే గోర్భచెవ్ కు చాలా ఇష్టం. సోవియట్ అధినేతగా రాజీనామా చేసిన తర్వాత గోర్భచెవ్ మురతోవ్ కి ఫోన్ చేసి ఆ పత్రికలో తాను కూడా నెలకోమారు ఒక ఫీచర్ రాస్తానని అడిగారు. అప్పటికే ఆ పత్రిక యాజమాన్య బృందం గ్రూపులుగా విడిపోయి, వాళ్ళలో వాళ్ళు విబేధించుకుంటూ వుండడం వల్ల గోర్భచెవ్ కోరిక నెరవేరలేదు. గోర్భచెవ్ ఆ పత్రికను ఎంచుకోవడానికి కారణం దానికి పాఠకుల్లో ఉన్న ఆదరణ. 1990 ప్రాంతాల్లోనే ఆ పత్రిక సర్క్యులేషన్ రెండుకోట్ల ముప్పయి లక్షలు. అయినా ఆ పత్రికలో పనిచేసేవారిలో ఏర్పడ్డ లుకలుకల కారణంగా క్రమంగా మురతోవ్ వంటి జర్నలిస్టులు ఆ పత్రికను వదిలేశారు. వదిలేసి నొవయా గజేత (న్యూ గెజిట్) అనే పేరుతొ ఒక కొత్త పత్రికను ప్రారంభించారు. పత్రిక అయితే పెట్టారు కానీ దాన్ని నిలబెట్టే ఆర్ధిక స్థోమత వారికి లేదు. సాయం చేసే వారికోసం వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్న సమయమది.
అధ్యక్ష పదవిని వీడిన తర్వాత, గోర్భచెవ్ తన ప్రసంగాలు, రచనల ద్వారా సంపాదిస్తున్న సొమ్ముతో ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గోర్భచెవ్ కు ఆయన స్వదేశంలో మాట ఎలా వున్నా అంతర్జాతీయంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు వున్నాయి. 1991లో ఆయనకు నోబుల్ శాంతి పురస్కారం లభించింది. ఆయన తన అనుభవాలతో రాసిన ఒక గ్రంధం దాదాపు ఎనభై ప్రపంచ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. కోట్ల సంఖ్యలో ఆ పుస్తకాలు అమ్ముడు పోయాయి. అమెరికాకి పోటీగా నిలచిన సోవియట్ యూనియన్ ఆయన హయాములోనే అంగవంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నం కావడం, రెండు జర్మనీల ఏకీకరణ జరగడం, అణ్వాయుధాల సంఖ్యను భారిగా కుదించడంలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేకానేక కారణాల వల్ల గోర్భచెవ్ కు విశ్వ విఖ్యాతి లభించింది. అంచేత ఆయన అధికారం చేజారిపోయినా భార్య రైసాతో కలసి నిరాడంబరంగా జీవిస్తూ, విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేస్తూ, రచనావ్యాసంగం సాగిస్తూ కాలక్షేపం చేస్తున్న రోజులవి. అయినా ఏదో విధంగా మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలనే కాంక్ష ఆయనలో చావలేదని, అందుకే టీవీలు, పత్రికల ద్వారా (ప్రభుత్వ నిర్వహణలో నుంచి రష్యన్ టెలివిజన్, రేడియోలు బయట పడ్డాయి) తనకు జనంలో ఉన్న ఆదరణను మరింత పెంచుకుని మరోసారి అధికార పీఠం చేజిక్కించుకోవాలనే కోరిక ఆయనలో పాతుకుపోయి వుందని, అందువల్లే పత్రికలను ప్రోత్సహించే పని పెట్టుకున్నారని కూడా గోర్భచెవ్ మీద అపనిందలు వచ్చాయి.
“ఏం చెయ్యాలి, పత్రికను ఎలా నడపాలి అని మేము మల్లగుల్లాలు పడుతున్న సమయంలో 20 IBM 286-x కంప్యూటర్లు మా ఆఫీసుకు వచ్చాయి” అని చెప్పాడు మురతోవ్ ఆనందంగా. 1993 నాటికి ఆ కంప్యూటర్లు అత్యంత ఆధునికమైనవి. గోర్భచెవ్ పంపిన ఆ కంప్యూటర్లతోనే మేము పత్రికను నడపడం ప్రారంభించాము. అంతేకాదు, గోర్భచెవ్ స్వయంగా నొవయ గజిత పత్రికలో మూడు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టారు”అని మురతోవ్ చెప్పారు. అలాగే మరోసారి డబ్బు అవసరం పడ్డప్పుడు లక్ష డాలర్లు మా పత్రిక బ్యాంకు ఖాతాకు జమ చేసారని కూడా ఆయన వెల్లడించారు.
“1995లో రష్యాలో సెల్ ఫోన్లు చాలా అరుదు. ఒకసారి గోర్భచెవ్ దంపతులను కలవడానికి వారింటికి వెళ్లాను. మాటామంతీ అయిన తర్వాత రైసా గోర్భచెవా ఒక అందమైన పెట్టెను నా చేతిలో పెట్టారు. తెరిచి చూస్తే అందులో మొబైల్ ఫోను వుంది. అవసరమైన సందర్భాలలో లాండ్ లైన్ కి ఫోను చేసి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటోందని అంచేత మొబైల్ ఫోను వుంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని గోర్భచెవ్ మీతో చెప్పమన్నారు” అందావిడ నాతొ. నాపట్ల ఆయన చూపించిన వాత్సల్యం మరవలేను” అని చెప్పుకొచ్చారు మురతోవ్.
“ఇప్పటికీ ఆ మొబైల్ ఫోను మా పత్రికాఫీసులో మ్యూజియంలో వుంది” అన్నారాయన.
“పత్రికల్లో పనిచేసేవారన్నా కూడా గోర్భచెవ్ ఎంతో ఆదరణ చూపేవారు. ఒక రిపోర్టర్ ఆఉపత్రిలొ వుంటేయాభయ్ వేల డాలర్లు ఆర్ధిక సయం చేసి ఆదుకున్నారు. ఆయన ఇలాంటి సాయాలు జర్నలిస్టులకి అనేకం చేస్తుండేవారు” అని మురతోవ్ చెప్పారు కృతజ్ఞతగా.
గోర్భచెవ్ అరెస్టు
1991, ఆగస్టు 18.
క్రిమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్ భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్ వ్లాదిమిర్ కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. వెంటనే ఒకనాటి సోవియట్ అధినేత నికితా కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్ యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త ఒప్పందంపై ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్న బృందం ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆరోజు ప్రెసిడెంట్ గోర్భచెవ్ వేసవి విడిదిలో ఏమి జరిగింది అనే విషయంలో కూడా విభిన్న కధనాలు వున్నాయి. తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్ కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం. అయితే అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమిత పడ్డట్టు కనిపించింది. ఆ తరువాత వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి తిరస్కరించారు.
“మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదు” అంటూ హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత ఫోరొస్ విడిదిలోనే గోర్భచేవ్ దంపతులు గృహ నిర్బంధంలో వుండిపోయారు. తరువాత రైసా గోర్భచేవ్ మరణించారు. గృహంలో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా బాహ్యం భయంగా రోజులు గడిపారు. ఏది తిందామన్నా భయమే. దేంట్లో విషం కలిపారో తెలవదు ని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు , ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ సెలవులో వున్నారు’ అని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం, చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారు” అని ఆయన చెప్పారు.
ఆ రోజు ఆ విడిది లో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి ఇలా అన్నారు. “పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి”
అలా అనేక ఉద్దానపతనాలు చూసిన మిహాయిల్ గోర్భచేవ్, ప్రచ్చన్న యుద్ధ శకానికి చరమగీతం పాడిన తుట్టతుది సోవియట్ నాయకుడు మిహాయిల్ గోర్భచేవ్ తన తొంభయి ఒకటవ ఏట రాత్రి కన్ను మూశారు. (31-08-2022)

2 కామెంట్‌లు:

  1. నమస్కారం సర్ నేను blogger లొ చేరావచ్చా ,ఏ nish పైన వర్క్ చేయాలి ఎప్పుడు adsence వస్తుంది
    free blogger లొ adsence వస్తుందా సర్ చెప్పండి

    రిప్లయితొలగించండి
  2. Unknown: నిజానికి ఇవి నాకూ తెలియని విషయాలే. నేను బ్లాగు మొదలు పెట్టి పుష్కరం కాలం, పది లక్షల ఇట్లు దాటిన తర్వాత ఈ బ్లాగు లోకంలో ఓ మిత్రుడి సలహాపై ఇవన్నీ చేశా. నిజానికి అతడే చేసిపెట్టాడు. నేను నిమిత్త మాత్రుడిని. నాకు సాంకేతిక పరిజ్ఞానం సున్నా. రాయడం పోస్టు చేయడం తప్ప.

    రిప్లయితొలగించండి