28, ఆగస్టు 2022, ఆదివారం

రసరమ్య పుస్తకం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today, 28-08-2022, Sunday)


చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ, పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే  పాతసంగతులు గుర్తుచేసుకునే చాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నావాటిని  విన్న జనం మొహానే నవ్వుతారు. అయితే,   చిన్నతనంలో ఏ గాలి  తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ,  సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే, చిన్నప్పటి చిల్లర జీవితానికి కూడా  ‘గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే  వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకుంటే అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా, రివ్యూలు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. కాకపొతే, ఈ మధ్య  వీటిని కూడా “రాయించి, వేయించు కోవాల్సి” వస్తోందని కొందరు గిట్టనివాళ్ళంటున్నారు. అందుకే ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత కధలూ లేదా బయోగ్రఫీలూ, ఆటోబయోగ్రఫీలు, అనబడే, కొద్దోగొప్పో ఇచ్చి రాయించుకునే ‘జీవిత చరిత్రల’కు  ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా  ముచ్చటపడే రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టి , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ, పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు కాదు కాబట్టీ, వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే, అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో రసరమ్య ఘట్టాలు’ వుండే వుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను  తమ కల్పనాచాతుర్యంతో  సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ  సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతేకాదు, ఆ సన్నివేశాలకు తగిన మసాలాను  దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను  గ్రంధ ప్రచురణకు ముందుగానే, ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి,  పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు. 

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు  కూడా విస్తరిస్తున్నాయి. 

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి  టోనీ బ్లెయిర్, తన జీవితంలోని కొన్ని ఘట్టాలతో “ప్రయాణం” పేరుతొ  ఒక పుస్తకం రాసారు. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని  ‘సన్’ పత్రిక ప్రారంభించింది.  ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక  ఆసక్తికరమయిన  విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు, బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో,  ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై  మరులుపెంచుకున్న టోనీకి  ఆ వ్యామోహంనుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

“ఆలోచించడం మానుకో, ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు, భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి  ప్రధానమంత్రి కాగలడని  ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

‘సన్’ పత్రికలో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం,  మొత్తానికి ఈ చిట్కా పనిచేసింది.

 ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం  హాటు కేకుల్లా ఎగరేసుకు పోయారుట. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని  ప్రేమాయణం కాబట్టి  పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ ప్రయాణం  పుస్తకాన్ని ఫ్రెంచి భాషలో సయితం  ప్రచురించారు.

 ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా! యిరవై నాలుగు పౌండ్లు మీవి  కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది.  

“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984, అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసివచ్చింది (ట) దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో కనబడిన ఓ అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని, అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక గాంధి వయస్సు కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!) 

ఇవన్నీ అక్షర సత్యాలు అవునో కాదో తెలియదు. కానీ ఈ సంగతులన్నీ, శ్రీమతి గాంధి అంతరంగికుడు  ఎం.ఎల్ ఫోతేదార్ రాసిన ఒక పుస్తకంలో అక్షరబద్ధం అయ్యాయి.

పెద్ద పెద్ద వ్యక్తులు రాసే ఆత్మకధలు అటుంచి, వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు రాసే పుస్తకాల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. అంచేతే పుస్తక ప్రచురణకర్తలు కూడా ఇటువంటి వారు రాసే ఆత్మకధలకు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురిస్తున్నారు. వాటిల్లో ఇటువంటి కొన్ని సంచలన విషయాలకు మీడియా ద్వారా ముందుగానే  ప్రాచుర్యం కల్పించి సొంత పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు కూడా వారిపై వుంది. 

ప్రముఖులు జీవించి వున్నకాలంలో, వారితో సన్నిహితంగా మెలిగేవారికి ఆ ప్రసిద్దుల జీవితాల్లో, జనాలకు తెలియని కొన్ని ఆసక్తికర అంశాలను గమనించగలిగే అవకాశం వుంటుంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని, వారు మరణించిన తరువాత వారికి సంబంధించిన విషయాలను ఇలా ఆత్మకధల ద్వారా బయట పెట్టడంలో నైతికత ఏమిటన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉండడంలేదు.

ఉపశృతి: జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి. అంతేకాని, అమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి. 






(28-08-2022)

2 కామెంట్‌లు:

  1. మీరూ ఇట్లాంటి పుస్తకాన్ని రాయాలి గురువుగారు.

    రిప్లయితొలగించండి
  2. కొన్ని సినిమాటిక్ ఘటనలు కలిపి వ్రాస్తే జీవిత చరిత్ర పుస్తకాల అమ్మకాలు బాగుంటాయి. ఉప్మా లో జీడిపప్పు లాగా facts కు తోడుగా fiction కలిస్తే
    చదవబిలిటీ పెరుగుతుంది.

    రిప్లయితొలగించండి