15, ఆగస్టు 2022, సోమవారం

ఏం సాధించాం! – భండారు శ్రీనివాసరావు


స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు సరే, ఇన్నేళ్ళలో ఏం సాధించాం?

ఇలాంటి సాధింపులు ఈ పండగ పూట పక్కన బెట్టి, సాధించిన వాటిని గురించి ముచ్చటించుకుందాం. మనసుకు బాగుంటుంది.
గడచిన డెబ్బయ్ అయిదేళ్ళ కాలంలో ప్రపంచం గర్వించదగిన గొప్ప లక్షణాలను, విజయాలను స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మనదేశంతో పాటే స్వేచ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఈ డెబ్బయి అయిదేళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి, నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా, ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.
జనాభాలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'వోటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం.
అక్షర జ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' మనవారి ఆస్తి.
గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర మన వారిది.
అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు, 'మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా ఇంకా 'మైలు'రాళ్ళ దగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు పనికిరాని వాళ్ళనీ ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లు, దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత ఒకే బాలట్ పేపరుపై ముద్రించిన అనేక పార్టీల గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే గుర్తుపట్టి వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.
'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం' అనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగా, ప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.
'చందమామ రావే' అంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్' వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగలిగాము.
ఏ ఇంగ్లీష్ వారితో తలపడి, అహింసా మార్గంలో వారితో పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామో, ఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని, దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.
ఇలాంటి విజయాలను ఈనాడు మనం చెప్పుకోవాలి. ఇలాంటి ఘనతలను గురించి మనం ఈనాడు ఘనంగా చెప్పుకోవాలి.
ఇంకా ఏమైనా చెప్పుకోవాలి అని వుంటే వాటికి మరో రోజు కేటాయించండి.
ఈరోజు మాత్రం ఇలాగే గడపండి.
(15-08-2022)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి