విషయం ఒక్కటే. కానీ చూసే ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే, వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్న' తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.
ఎవరయినా తాము చదివే పత్రిక, చూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి, ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!
అసలు 24 గంటల వార్తాఛానెళ్ళకు అనుమతినిచ్చిన వారిని అనాలి. 24 గంటలూ ఏం వార్తలుంటాయయ్యా అని మొదట్లోనే తుంచేసి, రోజులో కొన్ని గంటల పాటు మాత్రం నడపండి, మాక్జిమమ్ రాత్రి 10 గంటలకల్లా మూసెయ్యాలి అని నిబంధన విధించినట్లయితే ఇంత అధ్వాన్నంగా తయారయ్యేవి కావేమో?
రిప్లయితొలగించండిఇప్పుడు ముంచుకుపోయిందేమీ లేదు లెండి పెద్దగా. పలు వార్తాఛానళ్ళు సగం సమయం సినిమాఛానెళ్ళ లాగా తయారయ్యాయి. ఇంకా హెల్త్ కార్యక్రమాలు, అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా సమయం, చర్చలు (పొద్దున్నే కూడా) ఆక్రమించుకుంటున్నాయి. అందువల్ల ప్రేక్షకుడికి వార్తాఛానల్ చూస్తున్నాను అనే ఫీలింగ్ పెద్దగా కలగడం లేదు.
అయినా ఆ తెర ఎలా చూడగలుగుతాం అండీ బాబూ? పైనించి మొదలుపెట్టి ఐదారు లైన్లలో వేరేవేరే స్క్రోలింగులు పరుగెడుతుంటాయి (పాతిక ముప్ఫై శాతం దాదాపు స్థిరంగా ఉండే అడ్వర్టైజ్మెంట్లతో నిండిపోగా మిగిలిన తెర భాగం సంగతే నేను మాట్లాడేది). అయినా అన్ని లైన్ల స్క్రోలింగులు, మధ్యలో బొమ్మ - వీటన్నిటినీ ఏకకాలంలో ఎలా చూడగలుగుతాం, చూసినా ఏం బుర్రకెక్కుతుంది?
ఒకటే మాట చెప్పుకోవాలి - అంతా వ్యాపారమయం అని.
అవును సర్, మీడియా అంటే టీవీ అనే అర్థం స్ధిరపడిపోయిందా? వార్తాపత్రికలు మీడియా అనే నిర్వచనంలోకి రావా? నాకు తెలియక అడుగుతున్నాను.