21, జులై 2022, గురువారం

కూర్చుని చదవాల్సిన పుస్తకం జీవన గానం – భండారు శ్రీనివాసరావు

  

ఈ పుస్తకం ఇంటికి చేరి అనేక రోజులు గడిచిపోయాయి. అయినా పూర్తి చేయడం ఒక పట్టాన కుదరలేదంటే దీనికి ప్రధాన కారణం నా సహజ బద్ధకం. దానికో కారణం వుంది. అదే  ద్వితీయ ప్రధాన కారణం. ఇది కూర్చుని చదవాల్సిన పుస్తకం. అంటే ఇది చదవాలి అంటే వ్యాసపీఠం కావాలి. అంత పెద్ద పుస్తకం అన్నమాట.

పడుకునో, జారగిలబడో చదువుకోవాలి అనిపిస్తే కుదరదు. అంచేత ఈ కసరత్తు చేయడానికి కొంత వ్యవధానం పట్టింది. 

ఈలోపల మరో ఇబ్బంది వచ్చి పడింది. ఈ పుస్తకం నా వద్ద వుందని తెలియగానే మా చుట్టపక్కాలు చాలామంది ఫోన్లు చేసి, ఒకసారి చదివి ఇస్తాం ఇస్తారా అని అడగడం మొదలు పెట్టారు. అల్లా బయటకు పొతే ఇక చదవడం అనేది అసాధ్యం అనిపించి వ్యాసపీఠం లేకుండానే చదవడం మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఆ పుస్తకమే నన్ను చివరికంటా చదివించింది.

రచయిత గోపాలకృష్ణ గారు  నాకు రేడియోలో సహోద్యోగి. అంతకు మించి మితృలు. 

ఈయన ఎస్పీ గారి జీవిత చరిత్ర రాసారా లేక బాల సుబ్రహ్మణ్యం గారే స్వయంగా తన జీవిత కధాగానం  చేసారా అనిపించేలా కధనం సాగింది. పీ ఎస్. గోపాల కృష్ణ కలం బలం నాకు తెలిసిన విషయమే అయినా, ఆయనకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు అన్న విషయం ఈ పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. అంతగా బాలు గారితో  మమేకం అయి, బాలు గారి జీవిత విశేషాలను, సంఘటనలను హృద్యంగా, రమ్యంగా, నిజాయితీగా చాలా గొప్పగా అక్షరబద్ధం చేశారు. తనకు ఒప్పచేప్పిన బాధ్యతకు నూటికి నూటొక్క పాళ్ళు న్యాయం చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో  వదాన్యులు వరప్రసాదరెడ్డి గారు చెప్పినట్టు, ఒక్క గోపాల కృష్ణ గారే ఈ రచన చేయగలరు. చేసి చూపించారు కూడా.  

బంగారు పిచిక సినిమా రిలీజ్ సమయంలో బాపూ రమణలు పత్రికలకు ఇచ్చిన చిన్నపాటి ప్రకటనల్లో ఇలా పేర్కొనేవారు.

‘ఇందులో కళ్ళు మిరుమిట్లు కొలిపే సెట్టింగులు లేవు. భారీ తారాగణం లేదు’

అలాగే ఈ నాలుగువందల యాభయ్  పైచిలుకు పేజీల పుస్తకంలో ఉత్ప్రేక్షలు లేవు, రంగులద్దిన కల్పనలు లేవు, నిజాలు దాచడం లేదు, నిజాల పేరుతొ సంచలనాలు లేవు.

అలా హాయిగా, తీయగా  బాలుగారి పాటలా సాగిపోతుంది రచన.

అంచేతనే,  బాలుగారి ఈ జీవన గానాన్ని గోపాల కృష్ణ గారిచే రాయించారు కాబోలు.




శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జీవన గానం,  రచన: డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ, ప్రచురణకర్త: డాక్టర్ కె.ఈ. వరప్రసాదరెడ్డి, హాసం ప్రచురణలు, ధర: Rs. 500/-, For copies: Navodaya Book House, Kachiguda, Hyderabad – 500049, PHONE: 040- 23047638

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి