15, జులై 2022, శుక్రవారం

కొండంత వాత్సల్యం – భండారు శ్రీనివాసరావు

 రాయడానికి తీరిక ఒక్కటే కాదు, ఓపిక కూడా కావాలి.

దూరదర్సన్ లో నా సహోద్యోగి హనుమంతరావు గారికి రెండోది పుష్కలం. మొదటిది రిటైర్ అయినప్పటి నుంచి ఆయనకు పుష్కలంగా దొరుకుతోంది. ఉద్యోగం చేసే రోజుల్లో  పొద్దున్న ఆఫీసుకు వస్తే మళ్ళీ రాత్రికే ఇంటికి చేరడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పద్దులు రాస్తూ కూర్చొనే ఉద్యోగం  కాదది. సృజనాత్మకతతో  కార్యక్రమాలు రూపొందించే బాధ్యత కలిగిన దూరదర్సన్ కొలువాయే.

అలా పనిచేసిన అనుభవాల సమాహారమే ఈ గోరంత అనుభవం పుస్తకం.

ఉద్యోగ విరమణ అనంతరం దొరికిన తీరికతో, సహజసిద్ధంగా లభించిన ఓపికతో, అప్పుడెప్పుడో ఉద్యోగపర్వంలో కూడబెట్టుకున్న డబ్బులతో మొత్తానికి ఈ గోరంత పుస్తకాన్ని కొండంత శ్రమతో వెలుగులోకి తెచ్చారు.

ఇదంతా ఒక ఎత్తు. అచ్చు వత్తించిన పుస్తకాలను తెలిసిన వారికి స్వయంగా తీసుకువెళ్లి వాళ్ళ ఇంటి వద్దనే అందించాలనే ప్రయత్నం ఎందుకో నాకూ ముందు అర్ధం కాలేదు.

ఇవ్వాళ పుస్తకం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు అదే అడిగాను.

ఆయన సమాధానం నాకు బాగా నచ్చింది.

ఆయన ఏమన్నారంటే! ఆయన మాటల్లోనే:

“కరోనాకు ముందు అందరం ఏదో ఒక విధంగా కలుస్తూ వుండేవాళ్ళం. కరోనా వచ్చిన తరవాత ఈ రాకపోకలు బాగా తగ్గిపోయాయి. ఇక కలుసుకోవడాలకు జనం స్వస్తి చెబుతారేమో అనే భయం కూడా కలుగుతూ వుండేది. అంచేత కలవడానికి ఒక సమాధానం వెతుక్కున్నాను. అదే ఈ పుస్తకం. పుస్తకం ఇవ్వాలనే పేరుతొ ఇలా నలుగురినీ కలుసుకుంటున్నాను. పుస్తకం ఇవ్వగానే పోమ్మనరు కదా!  కాసేపు కూర్చొంటాము. కబుర్లు చెప్పుకుంటాము. పాత సంగతులు నెమరు వేసుకుంటాము. మనసుకు హాయిగా వుంటుంది. పుస్తకం ఒక మిష మాత్రమే. అసలు సంగతి ఇది”

ఎంత గొప్పగా చెప్పారు అనిపించింది. హనుమంతరావు గారి స్నేహ వాత్సల్యపు రుచి అలాంటిది మరి.

అన్నట్టే, ఉన్న కాసేపట్లో  ఆయన కబుర్లు చెప్పారు. నా కబుర్లు విన్నారు. కంప్యూటర్ కు సంబంధించి ఆయన వారి పిల్లవాడి నుంచి, అచ్చంగా తెలుగు భావరాజు పద్మిని గారి నుంచి నేర్చుకున్న మెలకువలను నాకు బోధించారు. ఫేస్ బుక్ లో  తెలుగులో రాయడం ఎలా అని చాలా మంది మధన పడుతుంటారు. వారికి పనికొచ్చే పాఠాలు (చిట్కాలు) ఆయన దగ్గర బోలెడు వున్నాయి.



(15-07-2022)    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి