31, జులై 2022, ఆదివారం

ఇచ్చుటలో వున్న హాయీ! – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Prabha on 31-07-2022, SUNDAY today)

 

ఇచ్చుటలో ఎంతో హాయి వుందని బాపూ రమణలు తమ సినిమాల ద్వారా  ఎన్నోసార్లు చెప్పారు. 

ఆ ఇవ్వడానికి కూడా ఓ తరీఖా వుందంటున్నారు, ఇవ్వడం తెలిసినవాళ్ళు. 

అపాత్రదానం చేయకూడదు అనేది అలాంటివాళ్ళు చెప్పే గోల్డెన్ రూల్.  ఏది ఇవ్వాలన్నా కొన్ని ప్రశ్నలకు ముందు జవాబు వెతుక్కున్న తర్వాతే దానాలు, ధర్మాలు వగైరా వగైరా చేయాలనేది వాళ్ళమాట.

ఆ ప్రశ్నలు ఏమిటంటే:

ఎంత ఇవ్వాలి ? ఎప్పుడు ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? 

మరో చివరాఖరి  ప్రశ్న మరోటి వుంది. అయితే, ముందు ఈ నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్న తర్వాత ఆ చిట్ట చివరి ప్రశ్న విషయం  చివర్లో చెప్పుకుందాం.

మొదటి ప్రశ్న ఎప్పుడు ఇవ్వాలి?

పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ, ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరతాడు. ధర్మరాజు తన ధ్యాసలో వుండి, ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మంటాడు. ఆ పక్కనే కూర్చుని గదకు మెరుగులు దిద్దుకుంటున్న సోదరుడు భీమసేనుడు, అన్న ధర్మజుడు నుడివిన మాటవిని ఎంతో సంతోషించాడట. ఎందుకటా!

ఎందుకంటే, వాక్శుద్ధి కలిగిన  ధర్మరాజు తన తొందరలో వుండి ఆ భిక్షకుడిని మరునాడు రమ్మని చెప్పాడంటే మరుసటి రోజువరకు అగ్రజుడు బతికే వుంటాడని  ఆ కండల వీరుడు సంబరపడ్డాడట. 

అయితే, ఈ క్షణంవరకు  ప్రాణాలతో వున్న మనిషి మరునిమిషం దాకా జీవించివుంటాడో లేదో తెలియని  అశాశ్వతమైన బతుకులు మానవులవి. అలాటిది తక్షణం చేయదలచుకున్న దానాన్ని మరో క్షణం వరకు వాయిదా వేయడం మంచిది కాదన్న పెద్దనీతి ఈ చిన్ని కధలో వుంది.

ఒకరికి ఇవ్వడం,  అది దానం అనండి, మరోటి అనండి అది ఏమయినా సరే వాయిదా వేస్తే క్షణభంగుర జీవితంలో అది నెరవేరే  వీలుండక పోవచ్చు కూడా. అందుకే ఒకరికి ఏదయినా ఇవ్వాలన్న ఆలోచన కలగగానే దాన్ని తక్షణమే ఆచరణలో పెట్టడం మంచిది.

ఇక ఎంత ఇవ్వాలి అనేది రెండో ప్రశ్న.

చరిత్రలో ఒక సంఘటన చెప్పుకుందాం.

రాణా ప్రతాప్ మహా యోధుడు. కానీ మొఘల్ చక్రవర్తులతో చేసిన ఒక యుద్ధంలో దారుణ పరాజయం పాలవుతాడు.  ఒక్క ప్రాణాలు తప్ప సర్వస్వం కోల్పోతాడు. సైన్యం తుడిచి పెట్టుకు పోతుంది. రాజ్యం చేజారి పోతుంది. ఈ పరిస్థితుల్లో   అడవుల్లో ఒంటరిగా సంచరిస్తూ విచారిస్తుంటాడు. ఈ దశలో  రాణా ప్రతాప్ కు స్నేహితుడు, ఒకప్పటి మంత్రి అయిన భామాషా ఆదుకుంటాడు.  తన సర్వ సంపదలను ఆయన అధీనంలో వుంచుతాడు. మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని తిరిగి  యుద్ధానికి సిద్ధం కాగల ధనసాయం చేస్తాడు. ఈ విషయంలో ఇంతా అంతా అని చూడకుండా భామషా చేసిన సాయంతో రాణా ప్రతాప్ తెప్పరిల్లుకుంటాడు. తిరిగి పోరాటం చేసి పోగొట్టుకున్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. 

ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇవ్వగలిగినంత పూర్తిగా ఇవ్వాలి. అప్పుడే ఇచ్చిన దానివల్ల ప్రయోజనం వుంటుంది.  

ఇవ్వాలి సరే! ఏమి ఇవ్వాలి అనేది మరో ప్రశ్న.

ఇవ్వడం అంటే అర్ధం డబ్బు ఒక్కటే కాదు. ఇతరులని సంతోషపెట్టగలిగేది ఏమి ఇచ్చినా మంచిదే.  పువ్వుతో సంతోషపెట్ట వచ్చు, చిరునవ్వుతో కూడా ఇతరులను ఆనందపెట్టవచ్చు. వారి ముక్కూ మొహం మీకు తెలియకపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తి వైపు ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వు నవ్వండి. అతడు  మిమ్మల్ని కొన్ని రోజులపాటు గుర్తుపెట్టుకుంటాడు.

పువ్వు ఇస్తారా! చిరునవ్వు ఇస్తారా! అది మీ ఇష్టం. కాకపోతే ఇచ్చేది మనసారా ఇవ్వండి. మనస్పూర్తిగా ఇవ్వండి.  బదులు కోరకుండా ఇవ్వండి. ఇది చాలా చాలా ముఖ్యం.    

 

‘నదుల్లో నీళ్ళు పుష్కలంగా వుంటాయి. కానీ నది దాహం వేసినప్పుడు తనలో పారే నీళ్ళను ఎప్పుడూ తాగదు. అలాగే చెట్టుకు యెంత ఆకలేసినా తనకు కాసిన పళ్ళను తినదు. అంటే ఏమిటి. ఏదయినా ఇతరులకి ఇవ్వడం అన్నదే ప్రకృతి ధర్మం. 

ఇక ఎలా ఇవ్వాలి అనేది ఇంకో ప్రశ్న.

దీనికి జవాబు చాలా సింపుల్. మీరు ఇచ్చేదానితో అతడు సిగ్గుపడకూడదు. అలాగే  ఇస్తున్నాను కదా అని మీరు గర్వపడకూడదు. 

సరే! దానమో, ధర్మమూ, చేయంగల సాయమూ చేసేస్తారు. అప్పుడు మీ ఆలోచనలు ఎలా వుండాలి? అచ్చు మన పురాణ కధల్లోని  ఏకలవ్యుడి తీరుగా వుండాలి. 

గురువు ద్రోణుడి కోరిక మేరకు అతడు ఏమాత్రం సంకోచించకుండా తన కుడి చేతి బొటన వేలిని కోసి గురుదక్షిణగా సమర్పిస్తాడు. ఈ పనిచేసినందుకు అతడు ఎప్పుడూ విచారించలేదు. అయితే ప్రక్షిప్తమూ ఏమో తెలియదు కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి చెబుతారు. అలా ముందూ వెనకా ఆలోచించకుండా బొటన వేలు కోసి ఇవ్వకుండా బాగుండేదని అతడు విచారించిన సన్నివేశం ఒకటి వుందని అంటారు.

జీవితం చరమ దశలో  ఏకలవ్యుడు ఒకే ఒకసారి తానుచేసిన పనికి విచారిస్తాడుట అది ఎప్పుడు?

ఎందుకోసం? 

అశ్వద్ధామ హతః అని ధర్మజుడితో చెప్పించి, ఆ మాట నిజమే అని నమ్మిన ద్రోణాచార్యుడు విల్లంబులు పారేసి కొడుకు మరణించాడు అని దుఃఖిస్తున్న సమయంలో పాండవులు  ఆయనని వధించిన తీరు ఏకలవ్యుడికి సుతారమూ నచ్చదు.  అప్పుడు ఇలా  అనుకుంటాడుట.

‘ఆరోజు గురుదక్షిణగా నా కుడి చేతి బొటన వేలు త్యాగం చేసి పొరబాటు చేశాను. అలా చేయని పక్షంలో,  పాండవులు ఎవరు కూడా తన గురుదేవుడిని చంపే సాహసానికి పూనుకుని వుండేవారు కాదు, నా గురువుని నేను కాపాడుకోగలిగేవాడిని’

పొతే ఇంతవరకు చెప్పంది, అతి ముఖ్యమైనది అయిన చివరి ప్రశ్న. 

మన వారసులకు ఏమి ఇచ్చి మనం ఈ లోకం నుంచి సెలవు తీసుకోవాలి అనేది ఆ ప్రశ్న.

ప్రపంచం మొత్తంలో  అతి పెద్ద సంపన్నుడు, అతి గొప్ప దాన కర్ణ్డుడు అయిన వారెన్ బఫెట్ ఈ ప్రశ్నకు ఇలా  జవాబు చెప్పాడు.

“మీ సంతానం ఏమి చేద్దామని అనుకున్నా సరే, అందుకు సరిపోయేంత సొమ్ము, సంపద వారికి మారుమాట్లాడకుండా ఇచ్చేయండి. అయితే, ఏమి చేయకుండా ఉంటాము అని వారంటే మాత్రం వారికి ఏమీ ఇవ్వకండి”

నిజానికి ఇవ్వడం అనేది ఓ కళ.

సంత్ కబీర్ చెప్పిన మాటలు ఈ వ్యాసానికి సరయిన ముగింపు అనుకుంటున్నాను.

‘మనం ప్రయాణిస్తున్న పడవలో నీళ్ళు నిండినప్పుడు ఏమి చేస్తాము? రెండు చేతులతో ఆ నీళ్ళు తోడి బయట పోస్తాము. అలాగే మన ఇల్లు సమస్త భోగభాగ్యాలతో, సిరి సంపదలతో  నిండిపోయినప్పుడు కూడా అదే పని చేయాలి”



(31-07-2022)

30, జులై 2022, శనివారం

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

 ( ఇంగ్లీష్ తేదీల ప్రకారం ఈరోజు మా అమ్మగారి పుణ్య తిధి)


“ మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“ మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
“అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
“కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.
“1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది. చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది. మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.
“మూడో రోజు ఉదయం, అస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. చిన్న అల్లుడు, భారతి అక్కయ్య మొగుడు తుర్లపాటి పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది. అమ్మ అపర కర్మలు యావత్తు సమీప బంధు జన సమక్షంలో కాశీలో జరగడం ఓ విశేషం ”

కింది ఫోటో:  1987లో  నేను మాస్కో వెళ్లేముందు మా అమ్మగారు జీవించి వున్నప్పుడు కొందరు కుటుంబ సభ్యులతో తీసిన ఫోటో 



29, జులై 2022, శుక్రవారం

కాటికైనా, కాన్పుకైనా – భండారు శ్రీనివాసరావు

 చాలా చిన్నతనం. బామ్మ దిండు కింద ఓ రోజు చిన్న మూట కనబడింది. అందులో ఏముంది?

తెలుసుకోవాలని ఆత్రుత.

ఒకరోజు ఆమెనే అడిగేశాను ‘ఈ ముల్లెలో ఏముంది బామ్మా’ అని.

దానిమీదపడ్డాయి ఏమిట్రా నీ కళ్ళు. అందులో ఏముందిరా అప్పుడప్పుడూ పోగేసుకున్న నాలుగు రాళ్ళుతప్ప’

రాళ్ళా! రాళ్ళను దిండు కింద ఎందుకు పెట్టుకున్నట్టు’

నా మనసులో మాట కనుక్కున్నట్టు౦ది.

రాళ్లంటే గులక రాళ్ళు కాదురా సన్యాసీ. డబ్బులు’

డబ్బులా నీకెందుకు? సినిమాకు పోతావా షికార్లు పోతావా. చాక్లెట్లు బిస్కెట్లు నీకక్కరలేదు కదా!’

ఇవి వాటికి కాదు లేరా! కాటికి పోవడానికి’

కాటికా! అంటే ఏదైనా గుడా”

గుడిలాంటిదే. చివరికి ఎవరైనా ఆ గుడికి వెళ్ళాల్సిందే’

గుడికి ఇన్ని డబ్బులెందుకే’

నీకెలాచెబితే అర్ధం అవుతుందిరా ఈ వయసులో. కాటికి పోవడం అంటే చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళే చోటు. బతికుండగా మనం ఎవరినైనా అడిగితే డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర వుంటే. అదే ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత అడిగితే, వాళ్ళ దగ్గర వున్నా ఇవ్వరు. దహన సంస్కారాలకు ఎవ్వరూ డబ్బు సర్దరు. అలా చేస్తే కీడు అని నమ్మకం. అందుకని ముందుగానే ఈ ముల్లెలో ఆ డబ్బులు దాచుకున్నాను’

బామ్మ మాటలు అప్పుడు అర్ధం కాలేదు.

ఇప్పుడు అర్ధం అయింది. కానీ బామ్మ ఆరోజుల్లో ముల్లెలో దాచుకున్న డబ్బులు ఈరోజుల్లో ఆ కార్యక్రమాలకు ఏ మూలకూ సరిపోవు అని కూడా అర్ధం అయింది.

ఇప్పుడు పుట్టినా, గిట్టినా అన్నీ లక్షల్లోనే.

(2019)

సమర్ధత, సచ్చీలతలకు చిరునామా జైపాల్ రెడ్డి

 (ఈరోజు ఆయన వర్ధంతి)

ప్రభుత్వాలను కార్పొరేట్లు శాసిస్తాయనే అపవాదు ఒకటి వుంది. కార్పొరేట్లను అదుపుచేయాలని చూసే కేంద్ర మంత్రుల అడ్డు తొలగించుకునే శక్తి సామర్ధ్యాలు వాటికి పుష్కలం అని చెప్పుకోవడం కద్దు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న శ్రీ ఎస్. జైపాల్ రెడ్డికి కూడా ఈ బెడద తప్పలేదు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ వచ్చిన జైపాల్ రెడ్డి అప్పుడు పెట్రోలియం మంత్రిగా వున్నారు.
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే, ఉత్తరాది మీడియా బాంబు లాంటి వార్త పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని.
పెట్రోలియం ఉత్పత్తుల వ్యాపారంలో అగ్రగామిగా వున్న రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యానికి అనుకూలమయిన నిర్ణయాలు తీసుకోవడంలో జైపాల్ రెడ్డి విముఖత ప్రదర్శిస్తూ వుండడమే దానికి కారణమని కొన్ని పత్రికలు ముక్తాయింపు కూడా ఇచ్చాయి.
మీడియా వూహాగానాలను నిజం చేస్తూ జైపాల్ రెడ్డి శాఖ మారింది. చాలా చిన్న శాఖగా పరిగణించే శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను జైపాల్ రెడ్డి వంటి సీనియర్ కు వొప్పగించిన తీరు చూసి నివ్వెర పోవడం అందరి వంతు అయింది. ఆయన మాత్రం నిబ్బరం కోల్పోలేదు. ‘పెట్రోలియం శాఖ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తికి గురయ్యాను. కాని ఇప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ కేటాయించినప్పుడు ఎలాటి అసంతృప్తి లేద’ని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పండిపోయిన మనిషి. యెలా స్పందించాలో ఆ మాత్రం తెలియని వ్యక్తి కాదు కదా. కానీ ఆ అవకాశాన్ని కేజ్రీవాల్ అందిపుచ్చుకున్నారు. ఆయన అప్పటికి ఇంకా పేరుపెట్టని ఓ కొత్త పార్టీ పెట్టి, అన్ని పార్టీలకు చెందిన అగ్ర నాయకులపై అవినీతి ఆరోపణాస్త్రాలు గుప్పిస్తూ మీడియాలో వెలిగిపోతున్న రోజులవి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు కదా!
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు ప్రభుత్వం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, ఇందులో భాగంగానే జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని కేజ్రీ వాల్ ఆరోపణ.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనకు విరుద్ధంగా రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేసి ధర పెంచాలని అడ్డదారిలో వొత్తిడి తెస్తోందని అంటూ, సరకును దాచి పెట్టి కృత్రిమంగా రేట్లు పెంచాలని చూసే చిల్లర వ్యాపారుల నైజంతో రిలయన్స్ దిగ్గజం వ్యవహారాన్ని కేజ్రీ వాల్ పోల్చారు.
ముఖేష్ అంబానీ డిమాండ్లను అంగీకరిస్తే రిలయన్స్ సంస్థకు 43 వేల కోట్ల రూపాయల అదనపు లాభం రాగలదని., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై 53 వేల కోట్లు అదనపు భారం పడగలదని జైపాల్ రెడ్డి తయారుచేసిన నోట్ లో పేర్కొన్నారని కేజ్రీ వాల్ వెల్లడించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ అన్వేషణ విషయంలో ప్రభుత్వంపై అధిక భారం పడగల అనేక రాయితీలను గతంలో బీజేపీ సారధ్యంలోని ఎన్ డీ యే ప్రభుత్వం కూడా సమకూర్చి పెట్టిందని ఆయన గుర్తుచేశారు.
కేజ్రీవాల్ ఆరోపణలు ఎలావున్నా, వాటిపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ హయాములో న్యూఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ జరిగినప్పటి మాట. ఇందులో కూడా జైపాల్ రెడ్డి సమర్ధతతకు అద్దంపట్టే ఓ ఉదంతం వుంది. ఈ క్రీడలు ప్రారంభం కాకమునుపే అనుమానపు మబ్బులు కమ్ముకున్నాయి.
ఈ క్రీడలు మొదలు కావడానికి రెండు రోజులు ముందువరకు కూడా అందరి మనసుల్లో నూటొక్క సందేహాలు. నిర్వాహకుల నిర్వాకంపై వేయిన్నొక్క అనుమానాలు.
అవినీతి పునాదులపై స్టేడియాల నిర్మాణం జరిగిందనీ, అతిధులకూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకూ సరయిన వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ,
భద్రతా ఏర్పాట్ల పట్ల శ్రద్ధ కరువయిందనీ,
ఉగ్రవాదులనుంచి పెను ముప్పు పొంచివుందనీ,
ఇలా ఎన్నో ఆరోపణలు.
ఎన్నెన్నో విమర్శలు.
ఈ నేపధ్యంలో –
దేశ ప్రతిష్ట మసకబారబోతోందనే దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చక చకా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలకు కేంద్ర బిందువయిన క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అనుదిన జోక్యంపై అంటకత్తెర వేసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన బాధ్యతలన్నీ అప్పగించింది. ప్రారంభ సంరంభానికి పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేని స్తితిలో, పరిస్తితులను చక్కదిద్దే భారాన్ని జై పాల్ రెడ్డి బృందం భుజస్కందాలపై మోపింది.
పనులు ఓ గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో క్రీడోత్సవ నిర్వహణలో భాగంగా నిర్మిస్తున్న ఒక వంతెన హఠాత్తుగా కూలిపోవడంతో విమర్శల జడివాన మళ్ళీ మొదలయింది. అయితే, జైపాల్ రెడ్డి పూనికతో ప్రధాని కల్పించుకుని సైన్యాన్ని రంగం లోకి దింపి, వంతెన నిర్మాణాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేయించడంతో ఆరోపణల కారు మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి.

https://www.andhrajyothy.com/telugunews/special-story-about-jaipal-reddy-political-carrer-in-the-memory-of-his-death-anniversary-hsn-mrgs-telangana-1822072811521232?fbclid=IwAR3tA4pr3171uJPzmEr9n-PJ41TaFRkWqDVnn3Z1tAbEkUo_3lIqmfeT36k
(28-07-2022)

27, జులై 2022, బుధవారం

అప్పులు ప్రమాదకరమే కానీ .........

 అప్పు  చేయకుండా   రోజు గడిచే పరిస్తితి  ప్రభుత్వాలకు  వుందా!

26, జులై 2022, మంగళవారం

గెలుపుకు కోరిక వుంటే చాలదు, పట్టుదల కూడా కావాలి

2024లో గెలవాలి అంటే గెలిచి తీరుతా అనే విశ్వాసం పెంచుకోవాలి. 2019 లో జగన్ చేసింది అదే! సాధించిన విజయం చివరిది అనుకున్న వాడే మరో విజయాన్ని కైవసం చేసుకోగలుగుతాడు.


నన్ను మన్నించు! నన్ను క్షమించు!

 


గత మూడేళ్ళుగా ఈ మాటలు నాలోనేను ఎన్ని లక్షలసార్లు అనుకుని ఉంటానో, ఇంకా అనుకుంటూనే వున్నానో లెక్క లేదు. ఇప్పడు ఎన్ని అనుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నా ఏమిలాభం, వినే మనిషి మనుషుల్లో లేకుండా పోయిన తర్వాత.  

భద్రాద్రి రాముడిని ప్రస్తుతిస్తూ రచించిన  దాశరధి శతకంలో కంచర్ల గోపన్న ఇలా అంటాడు.

“సిరిగల నాడు మైమరచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్

పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలి చిచ్చుపై

గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త

త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ!”

శరీరానికి ముసలితనం వచ్చిన తరవాత, ఇప్పటి వరకు పుణ్యమైన పనులను ఏమీచేయలేకపోయానే అని ఎంత బాధపడినప్పటికీ ప్రయోజనం ఉండదు. అందువలన ఓపికగా ఉన్న రోజులలోనే భగవంతుడి మీద భక్తితో పుణ్యకార్యాలను చేయాలి. లేకపోతే బాధపడవలసి వస్తుంది  అనేది తాత్పర్యం.

భార్యాభర్తల్లో ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరూ చెప్పలేరు. అంచేత జీవించి ఉన్నప్పుడే ఒకరినొకరిని  బాధ పెట్టే పనులు చేయకుండా, మనసును నొప్పించే మాటలు అనకుండా వుంటే తర్వాత బాధ పడాల్సిన అవసరం వుండదు.

అలా అని మా ఆవిడని నేనేదో నానా  బాధలు పెట్టానని కాదు, ఆమె జీవించి వుండగా  ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదేమో అని, ఆదరంగా పలకాల్సిన పలుకులు పలకలేదేమో అని మనసు మూలల్లో ఓ బాధ.

ఇది తీరేది కాదు.

ఆగస్టు మాసం వస్తోంది అంటే ఇది మరింత సెల వేస్తుంది.



(26-07-2022)  

 

షిర్డీ సాయిరాం

 1997 అంటే 25 ఏళ్ళ కిందట షిర్డీలో దిగిన ఫొటో. ఆ రోజుల్లో షిర్డీసాయి దేవాలయంలో మూల విరాట్ ముందు నిలబడి ఫొటోలు తీసుకోనిచ్చేవాళ్ళు. అంచేత ఈ ఫొటో మాకు ఒక అపురూపమైన కానుకగా మిగిలింది. నా పక్కన వున్నది మా రెండో అన్నయ్య కుమారుడు లాల్ భండారు.




పుట్టింట్లో కొన్ని ఘడియలు

 

ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొందురు గాని, ఓమారు దయచేయండి అని పుట్టిల్లు ఆకాశవాణి నుంచి పిలుపు. ఎగిరి గంతేసా. రిటైర్ అయి పదిహేడేళ్లు. చాలాకాలం తర్వాత వెళ్ళే అవకాశం.
ఇంటర్వ్యూ చేయాల్సింది ఎవర్ని. బ్రిగేడియర్ శ్రీరాములు గారిని. మరో గంతు వేసా.
ఎందుకంటే ఆయన ఎవరో కాదు, ఎస్సారార్ కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకున్నాం. కాకపొతే ఆయన ఎంపీసీ. నేను కామర్స్.
ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఇద్దరం వెళ్లాం. ఆయన సైనిక పురి నుంచి, నేను ఎల్లారెడ్డి గూడా నుంచి. బ్రిగేడియర్ కి సాంప్రదాయక మర్యాదలు, నాకు ఆత్మీయతతో కూడిన పలకరింపులు. కొన్ని పరామర్శలు కూడా.
ఆయన నేనూ కాలేజీలో ఎన్సీసీ వాళ్ళమే. నేనేమో బూట్లు, యూనిఫారం కోసం, ఆయనేమో చిత్తశుద్ధిగా చేరిన బాపతు. 1971 ఇండో పాక్ యుద్ధంలో సైనికాధికారిగా పాల్గొని వీరోచితంగా పాల్గొని ఆయన ప్రసంశలు, పతకాలు సాధిస్తే, అదే సమయంలో నేనేమో బెజవాడ ఆంధ్రజ్యోతిలో నైట్ డ్యూటీలు చేస్తూ అదే యుద్ధ వార్తలు అనువాదం చేస్తూ ఉండేవాడిని.
బ్రిగేడియర్ చాలా విషయాలు చెప్పారు. ఎక్కడో హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో, నిశిలో అయినవారికి దూరంగా మృత్యువు నీడలో సంచరిస్తూ, శత్రుసైనికుల కదలికలను గమనిస్తూ భారత సైనికులు తమ ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న విధానాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
మిలిటరీలో జవాన్ నుంచి జనరల్ వరకు సైన్యంలో చేరిన రోజే వీలునామా రాయించి తీసుకుంటారట. ఎప్పుడు ఏ క్షణంలో మృత్యువు పంజా విసురుతుందో తెలియని ఆ ఉద్యోగంలో ఎందుకైనా మంచిదని ఆ ఏర్పాటు. ఆంధ్రజ్యోతిలో చేరడానికి వెళ్ళిన రోజు, ఎడిటర్ నార్ల గారు, నీ రాజీనామా ఏదీ అని అడిగిన సంఘటన జనపకం వచ్చింది. బలవంతపు రాతలు రాయడం ఇష్టం లేకపోతె, ఉద్యోగం నుంచి స్వచ్చందంగా తప్పుకుని ఆత్మ గౌరవం వ్యక్తిత్వం కాపాడుకోవడానికి ప్రతి జర్నలిస్టు రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని నార్లగారి ఉవాచ.
త్రివిధ సైనిక దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటిలోనే ఒక సైనికాధికారిని రేడియోలో ఇంటర్వ్యూ చేయడం కాకతాళీయమే అయినా గొప్ప సంతృప్తిని కలిగించింది.
ప్రోగ్రాం పూర్తయింది. పెళ్లి చూపుల తతంగం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి ఏ సంగతి కబురు చేస్తాం అని మగ పెళ్లివాళ్ళు అన్నట్టు, ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అయ్యేది తర్వాత చెబుతాం అన్నారు రేడియో అధికారులు.
సరే! ఏదైతేనేం! ఏదో ఒక పేరుతో పుట్టిల్లు చూడడం, పుట్టింటి వారితో మాట్లాడడం అనే ఒక పని పూర్తయింది.
పదిహేడేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తు పట్టి పాత రోజులు గుర్తుకు తెచ్చిన ఇంజినీరింగ్, ప్రోగ్రాం సిబ్బందికి మనః పూర్వక ధన్యవాదాలు. ఒకప్పుడు మా దగ్గర న్యూస్ యూనిట్ తలలో నాలుకలా మా దగ్గర పనిచేసి, ప్రస్తుతం స్టేషన్ డైరెక్టర్ పేషీలో పనిచేస్తున్న శైలజారంగాచారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఆవిడ చనిపోయిన మూడేళ్ల తర్వాత కూడా ఆ విషయం తలచుకుని ఇవ్వాళ కన్నీళ్లు పెట్టిన ఆమె పెద్ద మనసుకు జోహార్లు.
కింది ఫోటోలలో బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు, స్టేషన్ డైరెక్టర్ ఉదయ శంకర్, సరే ఎలాగు నేను.











(25-07-2022)

వార్తా వంటకాలు - భండారు శ్రీనివాసరావు

విషయం ఒక్కటే. కానీ చూసే ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే, వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్న' తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.

ఎవరయినా తాము చదివే పత్రిక, చూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి, ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!


24, జులై 2022, ఆదివారం

లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి

 

వేమూరి రాజేష్ గారిని నేను ఇంతవరకు చూడలేదు. కానీ నేను చూడాలని బలంగా కోరుకున్న వ్యక్తుల్లో రాజేష్ ఒకరు.

రాజేష్ వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే మనుచరిత్ర  కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.

ప్రవరాఖ్యుడి గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.

అరుణాస్పదపురం అనే  ఓ మారుమూల కుగ్రామంలో కాపురం చేసుకుంటూ, తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా  నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు ప్రవరుడు.  అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు. ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు చెప్పిన సంగతులు వింటూ, ఇంత చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,  సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు.

ఇదెందుకు చెప్పాను అంటే, ఈ కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని వారికి  వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,  సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.

మనుచరిత్రలోని  సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా  లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన పసరు  వుంది.  మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ  సంచి సర్దుకుని, నేనూ రెడీ అనే   చిన్నారి హన్ష్ ప్రోద్బలం వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు  తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి. ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ  వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.

ఇంతకీ దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.

శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.

“దంతంబుల్పడనప్పుడే తనవునం దారూడి యున్నప్పుడే

 కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే

విన్తల్మేన చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె

నీ పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”

ప్రతిపదార్ధం అవసరం అనుకోను. 

తిరగగలిగిన వయసులో తిరగకుండా, తిరగాలనే  కోరిక ఉన్నప్పటికీ   తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే ఆ పద్యం రాసారని అనిపించింది.

అయినా భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి మనకు, రాజేష్ పుస్తకం చేత వున్నవరకు.



23, జులై 2022, శనివారం

అసలేముంది రాజకీయంలో - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 24-07-2022, SUNDAY)

ఈ కింది సంభాషణలు చిత్తగించండి:

“ఐ.ఐ.టి. టాపర్ అయిన  మీరు ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”

“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని  అప్పట్లో  భావించాను”

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి  అయివుండి, ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”

“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”

“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”

“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

“దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చంద సంస్థలకు కోట్ల రూపాయలు  భూరివిరాళాలుగా  ఇస్తుంటారు. మరి  రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది”

“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”

“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. మీకు మీరే సాటి అనే పేరుంది. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మధన్యం  అనుకునే వీరాభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ వయసులో రాజకీయ అరంగేట్రం చేసి,  ఎండనకా, వాననకా ప్రజాసేవ అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”

“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే సరైన  మార్గం”   

“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ.గా వున్నారు.  వృత్తిపరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ ప్రవేశం ఎందుకు చేసినట్టు”

“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”

“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం. అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”

“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను” 

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!

చివరికి ప్రజాసేవ కూడా సోషలిజంలాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.

మరో అర్ధం కాని విషయం వుంది. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరూ డబ్బులు లేని వాళ్ళు కాదు. మరిన్ని ఎక్కువ సొమ్ములు సంపాదించేందుకు రాజకీయాల్లో చేరుతున్నారా అంటే అదీ కాదు. మరి ఎందుకోసం ఈ యావ!  

ఎందుకంటే రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికారచక్రం అలవోకగా  తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయనీటికి ఎగబడే చేపల చందంగా రాజకీయ కండువాలు కప్పుకోవడం కోసం తహతహలాడేది అందుకే.

ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం!

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. కానీ  బయటకు తెలియని విషయం ఒకటుంది. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క బీట్ కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు, షూటింగ్ పర్మిషన్  ఒక్కటే కాదు, కస్టడీలో ఉన్న మనిషికూడా దర్జాగా బయటకు వస్తాడు. ఇక మా ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోవాలి? అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ అనేది  ఓ ప్రముఖ సినీనటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు మరుక్షణంలో క్లియర్ అవుతాయి. కానీ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎంత గట్టి ఆఫీసర్లం అయినా సరే, పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా ఒక్కోసారి  మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసే బదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా, కాలం గడుస్తున్నకొద్దీ  తత్వం బోధపడి సర్దుకుపోవడమే మేలనే స్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో మనసు మూలల్లో  బాధ. ఇంత చదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మేము అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ అనేది  ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

“ఏళ్ళ తరబడి కష్టపడి సువిశాల వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాను. నెలకు లక్షలు లక్షలు జీతాలు తీసుకునే సిబ్బంది నా దగ్గర వేల మంది అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. వాటిని చుట్టి రావడానికి సొంత విమానాలు వున్నాయి. బస చేయడానికి ఏడు నక్షత్రాల హోటళ్ళకు ఏమాత్రం  తీసిపోని సొంత అతిథి గృహాలు అన్ని నగరాల్లో  లెక్కకు మిక్కిలిగా వున్నాయి. కానీ ఏం లాభం. గవర్నమెంటులో  ఒక్క చిన్న ఫైలు కదిలించడానికి మా సీనియర్ అధికారులు సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు హోటల్లో ఇచ్చే టిప్పు పాటి చేయని నెల జీతాలు తీసుకునే ప్రభుత్వ గుమాస్తాల ముందు చేతులు కట్టుకుని నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటారు. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడు కల్పించుకుని పై వాళ్లకు ఓ మాట చెబితే ఆ ఫైలు  ఆఘమేఘాల మీద కదిలి, అన్ని సంతకాలతో ఆమోద ముద్ర వేసుకుని బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురయినప్పుడు అనిపిస్తుంది, ఎందుకీ పనికిరాని వైభోగాలు, సిరి సంపదలు అని. అసలైన అధికారం మా దగ్గర లేదని తేలిపోయింది. ఎక్కడ ఉన్నదో కూడా తెలిసిపోయింది. అందుకే రాజకీయ రంగప్రవేశానికి అడుగులు వేస్తోంది” ఒక వ్యాపారవేత్త అంతరంగం.

“ఒక చిన్న వీధి రౌడీ దగ్గర కుడి భుజంగా చాలా కాలం వున్నాను. అతడు చెప్పిన పనల్లా చేస్తూ పోయాను. చాలాసార్లు  పోలీసులకు దొరికిపోయి నానా అవస్థలు పడ్డాను. వాళ్ళు నన్ను  నన్ను నడి బజారులో తన్నుకుంటూ స్టేషన్ కు తీసుకు వెడుతుంటే మిన్నకుండిపోయాను. ఇక ఎన్నాళ్ళీ కష్టాలు అని ఓ శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ నాయకుడి దగ్గర అనుచరుడి  అవతారం ఎత్తాను. కొంత పేరు వచ్చిన తర్వాత నన్ను అడిగేవాడే లేడు, అడ్డుకునే వాడే లేడు. నన్ను పట్టుకునే పోలీసు పుట్టలేదు, నన్ను పెట్టే జైలు కట్టలేదు అనే తరహాలో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాశం నాకీ కొత్త వృత్తి ఇచ్చింది” అని ఓ మాజీ గ్యాంగ్ లీడర్ తన  గోడు వెళ్ళబోసుకుంటాడు.

అంటే వీరందరినీ రాజకీయాల వైపు  బలంగా లాగుతోంది వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలి.  

తోకటపా:

ఇలా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పైకి చెప్పే ప్రజాసేవ అనేది ఒక పడికట్టు పదం మాత్రమే. అసలు కారణాలు మాత్రం  వేరే అనిపిస్తే తప్పేముంది!

నిజానికి ప్రజాసేవే చేయాలి అనుకుంటే అంటే రాజకీయ పదవులు అవసరమా!

ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకే వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.