నేనూ నా పాస్ పోర్ట్ - భండారు శ్రీనివాసరావు
నా మొదటి విదేశీ ప్రయాణం కౌలాలంపూర్ కు 1981 లో. మద్రాసులో నేనెక్కిన మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం ఏప్రిల్ పద్నాలుగు ఉదయం ఆరున్నరకు శ్రీలంక (సిలోన్) మీదుగా కౌలాలంపూర్ బయలుదేరింది. ఈ ప్రయాణానికి అవసరమైన పాస్ పోర్ట్ సరిగ్గా నాలుగు రోజుల ముందు ఏప్రిల్ పదో తేదీన జారీ అయింది. అప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు బర్కత్ పురాలో వుండేది. నాటి ముఖ్యమంత్రి శ్రీ టి. అంజయ్య గారి జోక్యంతో అంత త్వరగా పాస్ పోర్ట్ లభించింది. సీ.ఎం. ప్రైవేట్ సెక్రటరి నయీముద్దీన్ స్వయంగా నన్ను వెంటబెట్టుకు వెళ్లి పాస్ పోర్ట్ ఇప్పించారు. అయితే అది ఆరు మాసాలకు మాత్రమే పనికి వచ్చే తాత్కాలిక పాస్ పోర్టు.
ముఖ్యమంత్రి భద్రాచలంలో రాములవారి కళ్యాణ తలంబ్రాలు ఇవ్వాల్సిన కారణంగా ఆయన, ఆయన పరివారం ఒకరోజు ఆలస్యంగా బొంబాయి నుంచి కౌలాలంపూర్ బయలుదేరారు. కౌలాలంపూర్ లో కూడా ఆయన దిగిన హోటల్లోనే నాకూ వసతి సౌకర్యం కల్పించారు. అయాచిత వాహనయోగం కూడా పట్టడంతో చాలా ప్రదేశాలు ఉన్న కాస్త వ్యవధిలో చూడడం జరిగింది.
రెండో పాస్ పోర్టు అవసరం మాస్కో ప్రయాణం అప్పుడు కలిగింది. మెహదీపట్నానికి మారిన ఆఫీసుకు నేనూ, మా ఆవిడా ఇద్దరు పిల్లలతో వెళ్ళాను. ఆ రోజుల్లో ఒక ముస్లిం పెద్ద మనిషి పాస్ పోర్ట్ అధికారి. సత్యసాయిబాబాకు వీర భక్తుడు. ఆయన నన్ను చూడగానే పాస్ పోర్ట్ ధరకాస్తులు తీసుకుని వాటిని ఎవరికో అప్పగించి నాతొ పిచ్చాపాటీ మొదలు పెట్టారు. మా పిల్లలు చాలా చిన్నపిల్లలు. బయటకి పోదాం అంటూ సణుగుడు మొదలు పెట్టారు. దాంతో నేను కల్పించుకుని మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు కలెక్ట్ చేసుకోవడానికి అని అడిగాను. ఆయన దానికి నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు భలే వాళ్లండి. మీ ఫోటోలు అతికించిన జిగురు అయినా ఆరాలా లేదా! అలా తొందరపడితే ఎలా?’
అప్పుడు నాకు అర్ధం అయింది. నాతొ ముచ్చట్లు చెబుతూ మరోపక్క వాటిని నాకు అప్పటికప్పుడు ఇచ్చే ఏర్పాటు ఏదో చేస్తున్నారని. అలా 1987 అక్టోబర్ 5 న మా ఇంటిల్లిపాదికి గంటలో పాస్ పోర్టులు చేతికి వచ్చాయి.
మరో పాస్ పోర్ట్ అవసరం మాస్కోలో వచ్చింది. మా ఆవిడకి, పిల్లలకి వేలిడ్ పాస్ పోర్టులు వున్నాయి కానీ నాది ఎక్స్పైర్ అయింది. మాస్కోలో పనిచేసేవారికి ఓ సౌలభ్యం వుంది. అక్కడ ఎంబసీ నుంచి కొత్త పాస్ పోర్ట్ తీసుకోవచ్చు. ఆ విధంగా 1991 ఏప్రిల్ 23 న, మరో కొత్త పాస్ పోర్ట్ నాకు మాస్కోలో రెండోరోజే వచ్చింది.
అమెరికాలో పనిచేస్తున్న మా పెద్ద కుమారుడి ఆహ్వానంపై అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. 2002 ఆగస్టు 20 వ తేదీన నాకూ మా ఆవిడకి పాస్ పోర్టులు వచ్చాయి. పదేళ్ల అమెరికా వీసాలు కూడా చెన్నై ఎంబసీ వాళ్ళు ఎలాంటి పర్సనల్ ఇంటర్వ్యూ లేకుండా హైదరాబాదు చిరునామాకు పోస్టులో పంపారు. 2003 లో సతీసమేత అమెరికా ఆరు మాసాల యాత్ర పూర్తయింది. అదే పాస్ పోర్టు అదే వీసాపై 2009 లో మరోసారి అమెరికా వెళ్లి వచ్చాము.
ఆ పాస్ పోర్టుకు కూడా పదేళ్ల జీవిత కాలం ముగిసింది.
2012 సెప్టెంబరు 11 మళ్ళీ కొత్త పాస్ పోర్టులు. అప్పటికి టాటాలకు చెందిన టీ సీ ఎస్ వాళ్ళు పాస్ పోర్ట్ జారీ విషయంలో నూతన సాంకేతిక సదుపాయాలను ప్రవేశ పెట్టారు. భార్యాభర్తలం ఇద్దరం ఆన్ లైన్ లో అప్లయి చేసుకుని నిర్దేశించిన రోజున నిర్దేశిత సమయానికి వెళ్లి అలుపూ సొలుపూ లేకుండా పాస్ పోర్టులు సంపాదించు కున్నాం.
2019 మార్చిలో మా రెండోవాడి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఓసారి అమెరికా వెళ్లి వద్దామని అనుకున్నాం. వేలిడ్ పాస్ పోర్టులు, వీసాలు వున్నాయి కానీ, 2019 ఆగస్టులో మా ఆవిడ అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఇక ఆ ప్రయత్నానికి గండి పడింది. ఆ తర్వాత పిల్లలు అమెరికాకు రమ్మనే అభ్యర్ధనలు ఎక్కువ కావడంతో మరోసారి పదేళ్ల వీసా స్టాంప్ నా పాస్ పోర్ట్ పై పడింది. మధ్యలో కరోన. ఒంటరిగా వెళ్లి అక్కడ ఏం చేయాలి, ఎక్కడ తిరగాలి అనే ఆలోచనతో ప్రస్తుతానికి అమెరికా ప్రయాణం వాయిదా వేసుకున్నాను. వీసా 2029 దాకా వుంది కానీ పాస్ పోర్ట్ వెలిడిటి 2022 సెప్టంబర్ తో ముగుస్తుంది కనుక కొత్త పాస్ పోర్ట్ తీసుకోవడం మంచిదని పిల్లల సలహా.
పాటించి ఆన్ లైన్ లో అప్లయి చేశాను. జూన్ ఇరవై ఎనిమిది మధ్యాన్నం రెండు గంటలకు టైం స్లాట్ ఇస్తూ మెసేజ్ వచ్చింది. పావుగంట ముందే లోపలకు పంపారు. చక్కటి ఏర్పాట్లు. టైం ప్రకారం వచ్చారు వెళ్ళిన పక్షంలో , అప్లికెంట్ల సమస్త వివరాలు వారి కంప్యూటర్ల తెరపై కానవస్తాయి కనుక చకచకా కౌంటర్ తర్వాత కౌంటర్ కు వెడుతూ పని మొత్తం అరగంట కంటే తక్కువ వ్యవధిలో పూర్తి అవుతుంది. ఒక కౌంటర్ లో ఫోటోతో పాటు వేలిముద్రలు తీసుకున్నారు. అక్కడ ఉండగానే File No. so and so Granted అని మెసేజ్ వచ్చింది. అంటే approved అని అర్ధం కాబోలు.
తిరిగి వస్తుంటే ఒక అద్దాల క్యాబిన్ లో పనిచేసుకుంటూ ఒక టీసీఎస్ అధికారి కనిపించారు. కలిసి పని బాగా జరుగుతోందని చెప్పాలని అనిపించి డోరు తోసుకుని వెళ్లి నా
అభినందనలు
తెలిపాను. ఆయన, కూడా మిమ్మల్ని ఎక్కడో ఛూసినట్టుంది అంటూనే గుర్తుపట్టి పలకరించారు. వారి పేరు సి.హెచ్. లక్ష్మీనారాయణ గారు. రీజినల్ హెడ్. ఆయన దినేశ్ అనే మరో తోటి ఉద్యోగిని పరిచయం చేశారు. వారు ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలకు బాధ్యత వహించే అధికారి. గతంలో పాస్ పోర్టు ఆఫీసులో పనిచేసిన, జ్వాలా ద్వారా పరిచయం అయిన మిత్రుడు శిరీష్ తాను స్నేహితులమని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఎవరినీ కలవాల్సిన అవసరం రాకుండా అక్కడ పనులు జరుగుతున్న తీరు పట్ల నా సంతృప్తిని వ్యక్తం చేసి, టీసీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను.నా ఆరో పాస్ పోర్టు, బహుశా ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వస్తుంది.
కింది ఫోటో: నలభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి పాస్ పోర్టు పై నా ఫోటో
(28-06-2022)
(28-06-2022)
మీలాంటి వారికి అంతా క్షణాల్లో అయిపోతుందండి. ఆమ్ ఆద్మీ లకు ఇంత సుళువు గా చేస్తారంటారా ? ఓ నలభై మార్లు కొర్రీ వేయరు ?
రిప్లయితొలగించండిసుమారుగా నలభై ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన పూసగుచ్చనట్లు చెప్పారంటే మీ జ్ఞాపకశక్తికి నా జోహార్లు సార్.
రిప్లయితొలగించండి