19, జూన్ 2022, ఆదివారం

ఈ దేశం ఏమైపోతోంది? – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today Sunday, 19-06-2022)


కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి ఒక రోజల్లా, రెండు దఫాలుగా గంటలు గంటల పాటు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసు చుట్టూ తిరిగిన రాజకీయం చివరికి ఆ యువ నాయకుడిని ఈడీ ఆఫీసుకు రప్పించింది. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతూ ఈడీ ఆఫీసు వరకు కాంగ్రెస్ కార్యకర్తలు సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. మర్నాడు రెండో రోజు, ఆ మర్నాడు మూడో రోజున కూడా ఈ విచారణ గంటల తరబడి సుదీర్ఘంగా కొనసాగింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడీ చర్యను ఖండిస్తూ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమ పార్టీపై కక్ష కట్టి వ్యవహరిస్తోందని ఆరోపించడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. అయితే, మూడో రోజు విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ అధికార వర్గాలు కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండించాయి. రాహుల్ గాంధీపై అభియోగాలు మాత్రమే వున్నాయని, కేసు నమోదు చేయలేదని వెల్లడించాయి.
ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వ్యవహార శైలి పట్ల దేశంలో చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా సీబీఐ విషయంలో అన్నిరాజకీయ పార్టీలు ఏదో ఒక సమయంలో విమర్శలు గుప్పిస్తూనే వున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికారంలో వున్న పార్టీ అంటుంది. చట్టం అమలు చేయాల్సిన సంస్థలు ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసే పంజరంలోని చిలకలు అంటూ అధికారంలో లేని పార్టీలు వ్యాఖ్యలు చేయడం ఎన్నో ఏళ్ళుగా జనం వింటూనే వున్నారు.
ఈ నేపధ్యంలో దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల మరోమారు చర్చ మొదలయింది. వీటి పని తీరు, వాటిపై ప్రభుత్వ పెత్తనం గురించి దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వర్తమానాన్ని సమీక్షించుకునేందుకు గతాన్ని గుర్తుచేసుకోవడం కూడా అవసరం.
ఇందుకు ఉదాహరణలు కొల్లలు. ఇవన్నీ ఎప్పుడో క్రీస్తు పూర్వానికి ముందువి కాదు. కొంచెం గుర్తు చేసుకుంటే జ్ఞాపకం వచ్చే సంఘటనలే.
ఓ పుష్కర కాలం వెనక్కి వెడదాం.
నరేంద్రమోడీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. గోద్రా మారణహోమంగా ప్రాచుర్యం పొందిన గుజరాత్ అల్లర్లను పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఎదుట హాజరు కావాలని మోడీని కోరింది. గుజరాత్ రాజధాని గాంధినగర్ లోని సిట్ కార్యాలయానికి ఆయన వెళ్ళారు. ఆ రోజు సిట్ అధికారులు రెండు తడవలుగా మొత్తం పదిగంటలపాటు విచారణ జరిపారు. మధ్యాన్నం పన్నెండు గంటలనుంచి సాయంత్రం అయిదువరకు, మళ్ళీ రాత్రి తొమ్మిది నుంచి అర్ధరాత్రి ఒంటిగంట దాటేవరకూ సిట్ అధికారులు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ, సమాధానాలు రాబడుతూ పోయారు. భోజన విరామ సమయాన్ని కూడా మోడీ వాడుకోలేదు. తాను వెంట తెచ్చుకున్న సీసాలోని మంచి నీరు తాగుతూ సిట్ అధికారులు అడిగిన దాదాపు వంద ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పారు.
‘నామీద దుష్ప్రచారం చేస్తూ, నా గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న వాళ్లకు ఈనాటితో అయినా కళ్ళు తెరిపిళ్ళు పడతాయని నేను ఆశిస్తున్నాను’ అన్నారాయన తర్వాత తనను కలుసుకున్న విలేకరులతో.
‘మిమ్మల్ని ఏమని ప్రశ్నించారు ?’
విలేకరుల ఆరా!
‘ఆ సంగతులు మీతో పంచుకోలేను. ఎందుకంటే సిట్ తన నివేదికను నేరుగా సుప్రీం కోర్టుకు సమర్పిస్తుంది’
మూడేళ్ల తర్వాత సిట్ ఆయనకు ఆ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది.
ఆ నరేంద్రమోడీ ఇప్పుడు ప్రధానమంత్రి. సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంటాయని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. నిజానికి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మోడీ మహాశయులకు కూడా సీబీఐ పట్ల అచ్చు అలాంటి అభిప్రాయమే వుండేది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
కొన్నేళ్ళ క్రితం జరిగిన మరో ఉదంతం.
అప్పుడు సీబీఐ గురించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.
2016 లో ఉత్తరప్రదేశ్ లక్నో పొలిమేరల్లోని బిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధి ఇలా అన్నారు.
‘సమాజ్ వాది, బిఎస్పి లను అదుపు చేయడానికి, వాటిని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. దానిపేరే సీబీఐ’.
2013. సుప్రీంకోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.
జస్టిస్ ఆర్. ఎం. లోధా గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.
‘సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’
కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.
సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో, అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంచి ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
మళ్ళీ వెనక్కి వెడదాం
జోగీందర్ సింగ్. 1996 లో కేవలం పదకొండు మాసాల పాటు సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం ఒక సమావేశంలో మాట్లాడుతూ తన అనుభవాలు తెలియచేశారు.
“సీబీఐ అంటే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ అనే అభిప్రాయం వుంది. కానీ అది నిజం కాదు. ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మ మాత్రమే’
“ఐకే గుజ్రాల్ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్ళు ఉండేవి. చార్జ్ షీట్ వేయడంలో ఆలస్యం చేయాలనీ, అలాగే కొన్ని కేసుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలనీ పైనుంచి ఆదేశాలు వస్తుండేవి. పశువుల దాణా కుంభకోణం కేసులో ఇలాగే ఒత్తిళ్ళు వచ్చాయి. లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వండని స్పష్టంగా చెప్పాను. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా అనుకున్న విధంగానే చార్జ్ షీట్ దాఖలు చేశాను” అని చెప్పారు జోగీందర్.
ఈ క్రమంలో మరో ఉదంతం.
ఇది జరిగి ఎన్నో ఏళ్ళు కాలేదు. ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను ప్రధానమంత్రి మోడీ సీబీఐని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది నాయకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు. దర్యాప్తులో సహకరించేలా ఆ అధికారిని ఆదేశించాలని కోరుతూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోల్ కతా పోలీసు కమీషనర్ ని విచారించడానికి సుప్రీంకోర్టు సీబీఐని అనుమతించింది.
ఇవే అవస్థలు సామాన్యులకు ఎదురయితే, ఇన్ని వ్యవస్థలు అంత వడిగా స్పందించడం జరిగే విషయమేనా!
జనం నోళ్ళలో బాగా నలుగుతున్న సీబీఐకి ఈ విధమైన మరకలు పడిన చరిత్రే కాదు, గతంలో కూడగట్టుకున్న ఘనకీర్తి కూడా చాలా వుంది. దేశం మొత్తంలోనే ప్రముఖ దర్యాప్తు సంస్థగా పేరు గడించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ అనేది పాలకపక్షం చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తుంటాయి. కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా సరే, తక్షణం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ముందుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఆ పార్టీలే. కాకపొతే, కాలక్రమంలో అన్ని వ్యవస్థల మాదిరిగానే నిప్పులాంటి ఈ సంస్థకు కూడా చెదలు పట్టాయి. అయినా కానీ, సామాన్య ప్రజల్లో మాత్రం ఈ వ్యవస్థ పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం, నమ్మకం మిగిలే వున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సంస్థను వాడుకుంటున్నారని పాలకపక్షంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఎన్నికల్లో ప్రజలు తమ చేతికి అధికారం అప్పగించగానే తిరిగి అదే పని అవి చేస్తుంటాయి. ప్రతిపక్షంగా మారిన ఒకనాటి పాలకపక్షం నోటివెంట ఇవే చిలుక పలుకులు మళ్ళీ వినీ వినీ జనాలకు విసుగు పుడుతోంది.
ఇది మనదేశంలో చాలాకాలంగా సాగిపోతున్న ఒక వికృత రాజకీయ క్రీడ.
చట్టబద్ధ వ్యవస్థల నడుమ, ప్రజాస్వామికంగా ఎన్నికయిన వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసే ప్రభుత్వాల నడుమ ఘర్షణలు సహజం కావచ్చు. కానీ అవి యుద్ధాల స్థాయికి పెరగడం వాంఛనీయం కాదు.
మనం నివసిస్తున్న ఈ భూగోళంకంటే అనేక వేల రెట్లు పెద్దవి అయిన వేలాది గ్రహాలు అనంత విశ్వంలో సెకనుకు కొన్నివేల మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నాయి. ఈ అనంతవిశ్వపరిభ్రమణంలో లెక్కకు మిక్కిలిగా వున్నఆ గ్రహాలు, మిల్లిమీటరులో వెయ్యో వంతు తేడా వచ్చినా పరస్పరం డీకొనడం తధ్యం. అయినా కానీ, అనేక లక్షల కోట్ల సంవత్సరాల నుంచీ ఆ గ్రహరాశులు అన్నీ కూడా తమ పరిధులు అతిక్రమించకుండా తమ తమ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తున్నాయి.
అలాంటిది ఒక్క కేంద్ర ప్రభుత్వం, ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధులకు, పరిమితులకు లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేని పరిస్తితులు తలెత్తితే ఆ తప్పెవరిది?
ఆ తప్పు ఖచ్చితంగా ప్రజలది మాత్రం కాదు.
ప్రజాస్వామ్యం పేరుతొ, ప్రజల పేరుతొ తమ భవిష్యత్తును పదిలపరచుకోవడానికి అనుక్షణం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీలదంటారా! ఏమో కావచ్చు.




(19-06-2022)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి