16, జూన్ 2022, గురువారం

పిడికెడు బియ్యం – భండారు శ్రీనివాసరావు

 ఓ అరవై ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట రవిస్ కాలువ వంతెన దగ్గరలో అన్నదాన సమాజం అనే ఒక సంస్థ వుండేది. ఈ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు అన్నం వొండిపెట్టేవారు. ఆ అన్నం తిన్న వాళ్ళు తప్ప అన్నదాన సమాజం వారిని తలచుకునే ఇతరులు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటె చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప, చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు కదా!

ఇప్పుడది లేదని చెప్పడానికి అక్కడికి వెళ్లి చూడనక్కరలేదు. ప్రభుత్వాల దయాధర్మం వల్ల ఎదిగే సంస్థలు అయితే నాలుగు కాలాలు వర్దిల్లేవి, ఏ మంచి పనీ చేయకుండా, ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ.

కానీ అన్నదాన సమాజం ఆ బాపతు కాదు కదా!

కంచి పరమాచార్య కూడా ఈ పిడికెడు బియ్యం గురించే చెప్పారు.

స్వామి ఏమన్నారంటే:

"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అల్లా పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి