(ఈరోజు ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం అంటున్నారు)
అదేమిటో ఒకానొక కాలంలో ప్రతివాడికి ఒక తీరని కల వుండేది. జీవితంలో ఒకసారి అయినా సైకిల్ తొక్కాలని. ఆ కోరిక నాకూ వుండేది. అది తీరాలి అంటే ముందు రెండు వుండాలి. సైకిల్ వుండాలి. అది తొక్కడం రావాలి. ఆ రోజుల్లో మన ఎత్తు చూస్తే సైకిల్ లో సగం. అంచేత చాలా కాలం అది తీరని కోరిక గానే వుండి పోయింది. అది తీరడానికి హై స్కూలు చదువు దాకా వేచి ఉండాల్సి వచ్చింది.
ఖమ్మం రిక్కబజార్ స్కూల్లో చేరినప్పుడు దగ్గర్లో ట్రంక్ రోడ్డు మీద తాత కొట్టు వుండేది. అక్కడ జీళ్లు, నువ్వుండలు దొరికేవి. వాటికోసం వెళ్ళేవాళ్ళం. ఆ షాపు ముందు వరసగా కొన్ని సైకిళ్ళు ఉండేవి. తర్వాత తెలిసింది. అవి అద్దెకు ఇచ్చే సైకిళ్ళు అని. దాంతో జీళ్లు, రంగు సోడాల డబ్బులు మిగిల్చి ఒక సైకిల్ అద్దెకు తీసుకునే వాడిని. గంటకు అణా. అది తీసుకుని తోసుకుంటూ మామిళ్ళ గూడెంలోని పెవిలియన్ గ్రౌండ్ కు వెళ్ళే వాడిని. అయితే సైకిల్ తొక్కడం నేర్పేదెవరు? మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారిల్లు పక్కనే. అప్పుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అనుకుంటా. నమ్మరు కానీ ఆయన కుమారుడు జలగం ప్రసాద రావు ఈ విషయంలో చాలా సాయం చేశారు. కింద పడడం, మోచేతులు, మోకాళ్లు గీసుకోవడం ఇత్యాది కష్టాల తర్వాత రోడ్డు మీద సైకిల్ నడిపే సామర్ధ్యం వచ్చింది.
ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పీయూసీ చదివేటప్పుడు కాలేజీకి సైకిల్ మీద వెళ్ళే వాడిని. అది మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారిది. మామిళ్ళ గూడెం మొత్తంలో సొంత సైకిల్ వున్న మొనగాడు. ఆయన ఊళ్ళో లేనప్పుడు ఆ సైకిల్ తీసుకుని కాలేజీకి వెళ్ళేవాడిని. అది గుట్టల బజార్ అవతల వుండేది. ఆ దోవ అంతా నిటారుగా వుండేది. ఆ బాటలో సైకిల్ తొక్కలేక చేతితో తోసుకుంటూ పైకి వెళ్ళే వాడిని. నా కాలేజి రోజులలో ఒకే ఒక అమ్మాయి, అదీ నా క్లాసు మేట్, అరుణ అనుకుంటా సైకిల్ మీద వచ్చేది. ఎత్తు ఎక్కలేక సైకిల్ ని భారంగా తోసుకుంటూ గుట్ట ఎక్కుతున్న నన్ను చూసి ఆమె సైకిల్ మీద వెడుతూ విలాసంగా ఓ అరనవ్వు నవ్వింది.
అంతే! అప్పటి నుంచి సైకిల్ మీద యావ, ధ్యాస రెండూ పోయాయి.
(03-06-2022)
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా ….. “
రిప్లయితొలగించండిఅని పవన్ కళ్యాణుడి ఓ సినిమాలో పాట ఉంది లెండి. అలాగ ఆనందించక సైకిల్ సన్యాసం చేస్తే ఎలాగండీ ? 😄