30, మే 2022, సోమవారం

ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలన


2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మొదటి ఏడాది పాలన ముగియవచ్చిన సందర్భంలో, లోకసభలో నాటి ప్రతిపక్షనేత రాహుల్ గాంధి ఒక వ్యాఖ్య చేశారు, ‘ఈఏడాది కాలంలో మోడీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేద’ని. తన వ్యాఖ్యకు వత్తాసుగా రాహుల్ మరో మాటను జోడించారు. ‘మోడీ పాలనకు తాను సున్నా మార్కులు వేస్తున్న’ట్టు చెప్పారు. అదీ ‘ఉత్త సున్నా కాదు, గుండు సున్నా’ అని ఎద్దేవా కూడా చేసారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలను బీజేపీ నాయకులు సహజంగానే తిప్పికొట్టారు. ఇటువంటి విషయాల్లో నాలుక పదును బాగా వున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతివ్యాఖ్య చేస్తూ ఒకింత ఘాటుగానే స్పందించారు.
‘మోడీ ఏమీ చేయలేదంటున్న రాహుల్ గాంధీ, ‘తనను గెలిపించిన అమేథీ నియోజక వర్గానికి ఆ ఏడాది కాలంలో చేసింది సున్నా కంటే తక్కువ’ అనేశారు. అంతటితో ఆగకుండా, ‘పదేళ్ళ యూపీయే పాలన, ఏడాది రాహుల్ పార్లమెంటు సభ్యత్వకాలం పరిగణనలోకి తీసుకుంటే ‘సున్నకు సున్నా, హళ్లికి హళ్లి’ అంటూ కొట్టిపారేశారు.
ఇదలా ఉంచితే,
అప్పట్లో లండన్ వెస్ట్ మినిస్టర్ టౌన్ హాల్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు.
“ఈ దేశానికి ఇక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను. నాకు చరిత్రలో స్థానం అక్కర లేదు. నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, నూటపాతిక కోట్ల మంది ప్రజలు తప్ప..”
ఆయన ఈ మాట అంటున్నప్పుడు ప్రేక్షకులు విడవకుండా చేసిన కరతాళధ్వనులతో వెస్ట్ మినిస్టర్ హాల్ మారుమోగింది. అదో అపూర్వ దృశ్యం.
మరో ఏడాది గడిచింది.
“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన వ్యక్తి. పేరు సుహేల్ సేథ్.
ఈయనకు బహుముఖాలు వున్నాయి. ప్రచారకర్త, నటుడు, న్యూస్ టీవీ పండిట్, లాబీ ఇష్ట్, మార్కెటింగ్ గురు, ఇలా సొంతంగా తగిలించుకున్న విశేషణాలు అనేకం వున్నాయి. ఇవన్నీ పదేపదే చెప్పుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో, సుహేల్ సేథ్ గారి ఫేస్ బుక్ పేజీలో ఏకంగా ‘సర్వజ్ఞుడు’ అని సింపిల్ గా ఒకే పదంతో అయన తనను తాను అభివర్ణించుకున్నారు.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన మోడీ జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ కారణంగా భారత రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన రెండేళ్లకు ఆయన తన బాణీ మార్చుకుని ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే వుందని గొప్ప కితాబు ఇచ్చారు.
“మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.”
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్ మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. చూస్తుండగానే ఎనిమిదేళ్లు గతంలో కలిసి పోయాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు. రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?
మోడీకి మొండివాడనే పేరుంది. నిజానికి ఆ మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండితనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.
నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనది. ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మోడీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశప్రజలు మోడీ చొరవను మనసారా స్వాగతించారు. మోడీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ఈ నిర్ణయం దేశానికి ఏ మేరకు మేలు చేసింది అనే విషయంలో, ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెట్టినా, ఇప్పటికీ స్పష్టమైన అంచనా లేదు. అయితే మోడీ తీసుకున్న ఈ చర్యకు రెండోమారు ఘన విజయం కట్టబెట్టడం ద్వారా అధిక శాతం మంది ఆమోదముద్ర వేశారు.
ఇక ప్రస్తుతానికి వస్తే, 2019 లో జరిగిన ఎన్నికల్లో నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాధించిన ఘన విజయంతో నరేంద్ర మోడీ మరో మారు భారత ప్రధాన మంత్రిగా ఈరోజుకు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అప్పటి పరిస్థితులు ఛాయమాత్రంగా ప్రస్తావించడం ఇప్పటి పరిస్థితితో పోల్చుకోవడానికే.
ప్రతి పార్టీకి ముఖ్యంగా బీజేపీ వంటి జాతీయ భావాలు కలిగిన పార్టీలకు కొన్ని మూల సిద్ధాంతాలు వుంటాయి. మెజారిటీ ప్రజలు తమకు సమర్ధ ప్రభుత్వం కావాలనే ఆలోచనతో ఓట్లు వేసి గెలిపిస్తారు. అలాగని తమ మూల సిద్ధాంతాలకు కూడా వారు పట్టం కట్టినట్టు కాదు. కానీ అలాంటి వారిని తమ పాలనతో, విధానాలతో ఆకర్షించి మెల్లగా తమ సిద్ధాంతాల పట్ల వారిలో సానుకూలత పెరిగేలా చూసుకోవాలి. ఈ ప్రజాస్వామ్య ధర్మాన్నిపాటిస్తే ఏ చిక్కూ వుండదు. ఏది చెప్పినా సుద్దుల మాదిరిగా మృదువుగా నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి కానీ బలవంతాన రుద్దినట్టు ఉండరాదు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
(30-05-2022)



4 కామెంట్‌లు:

  1. గోడ మీది పిల్లివాటంగా మీరు భలే రాస్తారండి :)
    ఫ్లో మధ్యలో కట్ అయిన ఫీలింగ్ ఆఖరి పేరా చదువుతూంటే అనిపించింది.
    ఏమన్నా రాసి ఎందుకులే అని ఎడిట్ చేసేరా ?

    రిప్లయితొలగించండి
  2. హ్హ హ్హ. దీని ముందు పోస్టులో ఏపీలో పాలన గురించి కూడా ఇలాగే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  3. కేంద్రం తో సామరస్య ధోరణి లేకపొవడం వల్ల తెలంగాణా రాష్ట్రం ఈ ఎనిమిదేళ్లలో నష్టపోయింది.

    There is a bias against non BJP governments.

    రిప్లయితొలగించండి
  4. అసలు ఈయన ఏం చెప్పాలనుకున్నారు - కొత్తగా!?

    రిప్లయితొలగించండి