6, మే 2022, శుక్రవారం

బ్రేకింగ్ న్యూస్! – భండారు శ్రీనివాసరావు

 మీడియా మనిషిని అయివుండి ఆ మీడియా గురించి రాయాల్సి వస్తున్నప్పుడు బాధ వేస్తుంది.

మధ్యాన్నం కెమెరా పట్టుకుని వస్తారు. లేదా ఫోన్ చేసి ఇప్పుడు టీవీ తెరపై వస్తున్న స్క్రోలింగ్ గురించి ఫోన్ ఇన్ అడుగుతారు. నా సందేహం ఒక్కటే, తెరపై దొర్లుతున్న ఆ స్క్రోలింగులో వాస్తవం ఎంత? దాన్ని ఆధారం చేసుకుని నేనెలా వ్యాఖ్యానించగలను? పైగా అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు అది. కాదు, కుదరదు అనే  నా జవాబు వారికి రుచించదని నాకు తెలుసు. కానీ వారి తొందర వారిది. నా నిదానం నాది. వార్తకు ప్రాణం నిబద్ధత అనే విధానం నాది.

వార్త ఒక్కటే. ఒక్కో టీవీలో ఒక్కోరకం స్క్రోలింగ్.

ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా? వుండి వాడుకోవడం లేదా!

ఇరవై నాలుగ్గంటల న్యూస్  ఛానల్స్ చూసేవారికి అనుభవమే. ఉదయం ఒక వార్త స్క్రోలింగ్ రూపంలో గిరగిరా తిరుగుతుంది. మధ్యాన్నం అదే వార్త పూర్తిగా భిన్నమైన రూపంలో దర్శనం ఇస్తుంది. పొద్దున్న పొరబాటు చేసాం, సరిదిద్దుకుని ఈ వార్త ఇప్పుడు  ఇస్తున్నాం అనే ధోరణి శూన్యం. ఉదయం ఇచ్చిన వార్తతో మాకు  సంబంధం లేదు అన్నట్టుగా వుంటుంది. రెండుసార్లు  అదే వార్త విభిన్న రూపాల్లో చూసినవాళ్ళు దేనిని నమ్మాలి. ఆఖరికి అత్యంత ప్రధానమైన కోర్టు తీర్పుల విషయంలో కూడా నిబద్దత పాటిస్తున్న దాఖలా లేదు. ఇంతటి ఉదాసీనతను ఎలా అర్ధం చేసుకోవాలి. పాత్రికేయ ప్రమాణాలకు ఈ వైఖరి ఎంతవరకు పొసుగుతుంది?

రేడియో, అంటే ఆకాశవాణి సుమా, వార్తలు చదివే న్యూస్ రీడర్లు, పొరబాటున ఏదైనా  తప్పు దొర్లితే,  వెంటనే క్షమించాలి అని శ్రోతలను అభ్యర్ధించి ఆ వార్తను మళ్ళీ సరిగా చదివేవారు. ఇది గుర్తున్నవారికి ఈనాడు టీవీల్లో కనబడుతున్న ఈ ధోరణి వింతగా, విడ్డూరంగా కనబడితే ఆశ్చర్యం ఏముంది.

ఈనాటి టీవీ ఛానల్స్ లో పనిచేసేవారు కాలంతో సమానంగా పరిగెత్తాలి. తప్పదు. నిజం కూడా. కానీ ఆ తొందరలో తప్పులు తొక్కుకుంటూ పోవడం ఏరకంగా సమర్థనీయం?

నిజంగా ఇవి తప్పులా! లేక కావాలనే చేస్తున్నారా అని సామాన్యుడికి సందేహం కలిగితే మీరెలా తప్పు పట్టగలరు? చెప్పండి!

చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. ఆ రోజుల్లో రేడియోకి ఆ గౌరవం వుండేది. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం నా విధి. అది నేను పాటించాను. తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.

ఇలా ఉండేవి ఆ రోజులు. నిజంగా ఆ రోజులే వేరు.

ఆ రోజులు వేరే కానీ, అసలు ఏ తప్పూ చేయకుండా నా రేడియో రోజులు గడవ లేదు. నేనూ, నా వల్ల నా సహచరులు కొన్ని అలాంటి పొరబాట్లు చేశాము.

ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు, జగ్ జీవన్ రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో బెజవాడ రేడియో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత వచ్చే ఏడూ అయిదు ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల ఇంగ్లీష్  జాతీయ వార్తల్లోనూ ఈ మరణవార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం ఎంపీ శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ప్రశ్న రూపంలో పార్లమెంటులో  లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో దేశంలో ఏడు రేడియో స్టేషన్లు ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి తప్పు చేశాయని తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.

ఏది ఏమైనా ఈ ఉదంతంతో, మరణ వార్తల ప్రసారం విషయంలో రేడియో వార్తావిభాగం అధికారులు అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు.

తరువాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు (పీ.టి.ఐ., యు.ఎన్.ఐ.) సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.

కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. ఢిల్లీ విలేకరి వార్తను ధ్రువపరచాలి. ఆ సమయంలో ఎవరూ దొరకలేదు. కానీ చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.

మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. హైదరాబాదు నుంచి వార్త ఇచ్చినా, ఢిల్లీ విలేకరి ద్రువపరచాలి అనే నిబంధన పేరుతొ తీసుకోలేదు.

తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు.

ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో దొర్లాయి. లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త కూడా ఇదే మాదిరి. ధ్రువపరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక కరచుకోవడం జరిగింది.

ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి వుంది. నాకైతే తెలియదు.

Courtesy Image Owner





(06-05-2022)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి