21, మే 2022, శనివారం

డొక్కు జీపులో రాజీవ్ గాంధి – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు మే 21 రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రభలో ప్రచురితం)

ఒకరు,  సాక్షాత్తు దేశానికి ప్రధాన మంత్రి. మరొకరు జిల్లాస్తాయి యంత్రాంగంలో ఓ జీపు డ్రైవర్. వీరిద్దరూ కలసి భద్రాచలం అడవుల్లో ఓ డొక్కు జీపులో కలసి ప్రయాణం చేశారు. నమ్మదగని విషయంగా అనిపించినా ఇది అక్షర సత్యం. పైగా దానికి నేనే ప్రత్యక్షసాక్షిని.

గోదావరికి వరదలు రావడం మామూలే. కానీ వరద నష్టం పరిశీలించడానికి ప్రధాన మంత్రి స్వయంగా రావడం మామూలు విషయం కాదు. అందుకే ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరిగాయి. అందులోనూ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం, ఎన్ టీ రామారావు గారి ముఖ్యమంత్రిత్వంలో నడుస్తున్న రోజులాయె.

హెలికాఫ్టర్ లో భద్రాచలం చేరుకున్న రాజీవ్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలను వివరించే ఫోటో ప్రదర్శనని తిలకించిన అనంతరం, అనేక వాహనాలతో కూడిన ప్రధాన మంత్రి బృందం రోడ్డు మార్గంలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలను చూసేందుకు బయలుదేరింది. ప్రధాని వెంట ముఖ్య మంత్రి రామారావు, మాజీ ముఖ్య మంత్రి, అప్పటి కేంద్రమంత్రి జలగం వెంగళరావు, అధికారులు, అనధికారులు అంతా వున్నారు. ఆ రోజుల్లో రేడియో విలేకరికి కొద్దో గొప్పో ప్రాధాన్యత వుండడం మూలాన, హైదరాబాదు నుంచి వెళ్ళిన నాకు కూడా ప్రధాని కాన్వాయిలో ఒక జీపు కేటాయించారు. అప్పట్లో ఇప్పటిలా ఇన్ని టీవీ ఛానళ్ళు లేవు. టేపు రికార్డర్ చేతబట్టుకుని వీ ఐ పీ ల వెంట తిరగగలిగే వెసులుబాటు వుండేది. భద్రాచలం నుంచి చింతూరు వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రావాలన్నది అధికారుల ప్లాను. మార్గమధ్యంలో రాజీవ్ గాంధీ అనేక చోట్ల వాహనాన్ని నిలిపి, రోడ్డు దిగి కాలినడకన ఇసుక మేట వేసిన పొలాలలోకి వెళ్లి రైతులతో, కూలీలతో మాటా మంతీ కలపడం సాగించారు. కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ప్రజలకు, ప్రధానికి నడుమ దుబాసీగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల కాన్వాయి ఆపడం, చాలాదూరం నడుచుకుంటూ వెళ్లి స్తానికులతో మాట్లాడడం,  ఇదంతా యువకుడయిన రాజీవ్ గాంధీకి ఏమాత్రం అలసట కలిగించలేదు. కానీ, ఆ ఎర్రటి ఎండలో ఎగుడు దిగుడు పొలాల్లో వేగంగా అడుగులువేస్తూ వెడుతున్న రాజీవ్ గాంధీతో పాటు సమానంగా నడవడానికి మిగిలిన నాయకులు నానా హైరానా పడ్డారు. ఈ విధంగా సాగిపోతున్న ప్రధాని పర్యటన అనుకోని మలుపు తిరిగింది. ఆ మలుపు తిరిగేముందు ఓ పిట్టకధ చెప్పుకోవాలి.

నేను ఖమ్మంలో చదువుకునే రోజుల్లో వంటమ్మగారనే పేద వృద్ధురాలు వుండేది. నాలుగయిదు ఇళ్ళల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆమె మనవడికి చదువు వొంటపట్టకపోవడంతో వారినీ వీరినీ ప్రాధేయపడి ఏదో చిన్న ఉద్యోగం వేయించగలిగింది. అతను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఓ ప్రభుత్వ శాఖలో డ్రైవర్ గా స్థిరపడ్డాడు. రాజీవ్ గాంధీ కాన్వాయిలో నేనెక్కిన డొక్కు జీపుకు అతనే డ్రైవర్ కావడం కాకతాళీయం. ఇక వర్తమానం లోకి వస్తే,

మరి కాసేపటిలో చింతూరు చేరతామనగా ఓ మలుపు దగ్గర రాజీవ్ గాంధీ వాహనం ఆపించారు. ఆ మలుపులో రోడ్డుకు ఎడమ వైపున దిగువగా అడవిలోకి వెళ్ళే ఓ బాట వుంది.

రాజీవ్ గాంధీ,  కారు దిగి జేబులోనుంచి ఓ మ్యాప్ తీసి చూసుకుంటూ అడవి బాట పట్టారు. ఆ వెనుకే రామారావు, వెంగళరావు, ఒకరిద్దరు భద్రతాధికారులు, నేనూ, నామాదిరిగానే హైదరాబాదు నుంచి వచ్చిన పత్రికా విలేకరి సురేందర్( ప్రెస్ అకాడమీ మాజీ  చైర్మన్)  అంతా ఆయన్ని అనుసరించాము. రాజీవ్ గాంధీ పదే పదే రోడ్డు దిగిపోయి పొలాలవెంట తిరిగిరావడం గమనిస్తూ వచ్చిన పోలీసులూ, ఇతర అధికారులూ రోడ్డు మీదే వుండిపోయారు.

ఆ అడవి బాటలో కొద్ది దూరం వెళ్ళిన తరవాత, 'ఇక్కడికి దగ్గరలో పలానా పల్లెటూరు వుండాలి కదా' అని అడిగారు రాజీవ్ గాంధీ మరో సారి మ్యాప్ కేసి చూస్తూ. ఖమ్మం జిల్లా ఆనుపానులన్నీ తెలిసిన వెంగళరావుకు కూడా ఈ గ్రామం గురించి తెలిసినట్టు లేదు. 'పదండి పోదాం' అంటూ రాజీవ్ కదిలారు. దూరంగా రోడ్డుపై జీపు ఆపుకుని వున్న డ్రైవర్ అదే అమ్ముమ్మగారి మనవడు,  మేము ముందుకు కదలడం చూసి రివ్వున జీపు స్టార్ట్ చేసి మా దగ్గరకు వచ్చాడు. మ్యాప్ చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో, రామారావు,  వెంగళరావు,  సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కేసారు. నేనూ సురేందర్ పరిగెత్తుకుని వెళ్లి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము, సెక్యూరిటీ వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా. 

జీపు కదిలింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో రాజీవ్ గాంధీ, ఆయన వెనుక వెంగళ రావు, డ్రైవర్ వెనుక సీట్లో రామారావు, సెక్యూరిటీ వాళ్ళు, నేనూ, సురేందర్, అంత చిన్న జీపులో ఎలా ఇరుక్కుని వెళ్ళామో ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రాకముందు విమానాలు నడిపే పైలట్ గా పనిచేసారు. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం నడుపుతూ, రాడార్ సాయంతో దిగాల్సిన ప్రదేశాన్ని గుర్తించి, నడి రాత్రయినా, పట్టపగలయినా రన్ వేపై ఖచ్చితంగా దించగలిగిన అనుభవం ఆయనకు వుంది. ఎక్కడో భద్రాచలం దగ్గర మారుమూల అరణ్య ప్రాంతంలో మ్యాప్ చూసి గ్రామాలను గుర్తించగలిగిన దక్షతను ఆ అనుభవమే ఆయనకు నేర్పి వుంటుంది.

అడవి గాలికి జీపుకు వేళ్ళాడుతున్న పాత టార్పాలిన్ పట్టాలు టపటపా కొట్టుకుంటున్నాయి. నిటారుగా పెరిగిన చెట్ల కొమ్మలు రాపాడుకుంటూ చప్పుడు చేస్తున్నాయి. నక్సల్స్ సంచరించే ప్రాంతాలలో కొత్త వ్యక్తుల రాక గురించి వారికి తెలియచెయ్యడానికి వారి సానుభూతిపరులు చెట్ల కొమ్మలను ఒకదానికి మరొకటి తాటించి చప్పుడు చెయ్యడం ద్వారా సంకేతాలు పంపుతారని చెప్పుకునేవాళ్ళు. నక్సల్స్ కు పట్టు వున్న అడవుల్లో ఇలా సంచరించడం క్షేమం కాకపోయినా, రాజీవ్ గాంధీ మాత్రం ముందుకే పోవాల్సిందని డ్రైవర్ కు సైగ చేశారు. తన పక్కన కూర్చుని సూచనలిస్తున్నది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి అన్న విషయం తెలిసికూడా మా అమ్మమ్మగారి మనమడు మాత్రం ఏమాత్రం తొట్రుపడకుండా, నిబ్బరం కోల్పోకుండా, సుశిక్షితుడయిన సైనికుడి మాదిరిగా జీపు నడపడం చూసి నివ్వెరపోవడం మా వంతయింది.

రాజీవ్ ఊహించినట్టుగానే దగ్గరలోనే ఆ లంబాడాగూడెం తారసపడింది. తీరా చూస్తె పట్టుమని పది పూరిళ్లు కూడా లేవు. రాజీవ్ గాంధీ ఎలాంటి భేషజం లేకుండా ఓ చుట్టూ గుడిసె లోకి వెళ్లి ఆ పేద కుటుంబం స్తితిగతులను ఆరా తీసారు. ఓ మూలాన మూడు రాళ్ళ పొయ్యిపై వున్న మూకుడు మీద మూత తీసి, అన్నం మెతుకులను పట్టి చూసి,  ఆ పేదరాలి భుజంపై చేయి వేసి,  సాయం చేయడానికి సర్కారు ఉన్నదన్న భరోసా కలిగించారు. ఆ మిట్టమధ్యాన్నం వేళ తమ ఇంటికి వచ్చిన అతిథి, దేశ ప్రధాని అన్న సంగతి ఆమెకు తెలుసో లేదో! ఇప్పటి ప్రచార యుగంలో ఈ సంఘటన జరిగి ఉన్నట్టయితే ఎంతటి ప్రాచుర్యం లభించి ఉండేదో! తర్వాత షరా మామూలే.

రాజీవ్ గాంధీ మళ్ళీ మ్యాప్ సాయంతోనే మమ్మల్నందర్నీ చేరాల్సిన చోటికి చేర్చారు.

ఒక ప్రధాని, ఒక ముఖ్య మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి వెంట ఖమ్మం జిల్లా అడవుల్లో కలిసి తిరిగిన విశేషాలను మర్నాటి ఉదయం రేడియో వార్తల ద్వారా బయటి ప్రపంచానికి తెలియచెప్పడానికి, మట్టికొట్టుకుపోయిన దుస్తులతో తెల్లారేసరికల్లా భద్రాచలం చేరడం అదో కధ.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి