6, ఏప్రిల్ 2022, బుధవారం

నోబుల్

 “మిమ్మల్ని టీవీలో చూస్తూ వుంటాను”

ఎస్సారార్ కాలేజి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి బుక్ చేసుకున్న ఉబెర్ డ్రైవర్ బాల్ రెడ్డి , కారు ఎక్కిన వెంటనే,  ఈ మాట చెప్పాడు. కొంచెం ఆశ్చర్యం వేసింది. రాత్రీ పగలు తేడా లేకుండా రోడ్ల మీద తిరిగే వారికి టీవీ చూసే తీరిక ఎక్కడ వుంటుంది అనేది నా సందేహం.

“రోడ్ల మీదే జీవితం గడిచిపోతుంది. కొత్త బుకింగ్ వచ్చేవరకు రోడ్ల పక్కన చెట్ల నీడలో ఆగినప్పుడు మొబైల్ ఫోన్ లో చూస్తుంటాను” నా అనుమానాన్ని కనిపెట్టి చెప్పినట్టున్నాడు బాల్ రెడ్డి.

“ఇంకో మాట చెప్పనా! రోజు ఎంత మందిని చూస్తుంటాను. లొకేషన్ కు వచ్చి ఫోన్ చేసేదాకా వాళ్ళు రారు. మీరు మూడు నిమిషాలు ముందే వచ్చి రోడ్డు మీద నిలుచున్నారు’

‘రిటైర్ అయి  పనేమీ  లేకుండా వున్నాను. కానీ ఈ క్యాబ్ పొరబాటున తప్పిపోతే ఇంటికి చేరడం ఎల్లా అనే దూరాలోచనతో ముందుగా వచ్చి రోడ్డు మీద నిలబడ్డాను అనే నిజాన్ని అతడికి చెప్పలేదు.

“అది సరే! కారులో  నీ వెనక కదా! కూర్చున్నాను. నన్నెలా గుర్తు పట్టావు?

“దూరం నుంచే రోడ్డు మీద నిలబడి వున్న  మిమ్మల్ని చూశాను. మీరు కూడా  అందరిలా ఆఖరు నిమిషంలో వచ్చి ఎక్కితే ఏమో మరి”

తర్వాత ఏం మాట్లాడాలో నాకు తోచలేదు.

‘మళ్ళీ మీరు కనబడతారో లేదో, ఒక మాట ఇప్పుడే చెబుతాను. ఈ మధ్య మీరు టీవీల్లో కనబడడం లేదు. అప్పుడప్పుడు తప్ప. అప్పుడూ ఇప్పుడూ మీది ఒకే వరస.  మీరు అనుకున్నదే తప్ప  టీవీల వాళ్ళు కోరుకున్నట్టు చెప్పరు, అందుకే మిమ్మల్ని పిలవడం లేదేమో అనుకున్నాను. నిజానికి మీలా నిజాలు చెప్పేవాళ్ళు ఉంటేనే కదా జనాలకు నిజాలు తెలిసేది

మూడేళ్ల క్రితం నా భార్య చనిపోయిన తర్వాత టీవీ స్టూడియోలకు పోవడం పూర్తిగా తగ్గించానన్న విషయం  నేను అతడికి చెప్ప లేదు  కానీ, అతడు నాకిచ్చిన కితాబు మాత్రం  నోబుల్ పురస్కారం కన్నా మిన్న.

థాంక్స్ బాల్ రెడ్డి!

(06-04-2022)

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి