26, ఏప్రిల్ 2022, మంగళవారం

టీఆర్ఎస్ ప్లీనరీ

 {Published in Namaste Telangana Daily on 26-04-2022)

 

నూతన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, ఆ కొత్త రాష్ట్రానికి నూతన ప్రభుత్వ సారధిగా టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనాపగ్గాలు చేపట్టి మరో రెండుమాసాల్లో ఏడేళ్ళు పూర్తికావస్తున్న తరుణంలో, ఈ నెల ఇరవై ఏడో తేదీన  హైదరాబాదు నగరంలోని  హైటెక్స్ సమావేశ మందిరంలో జరగనున్న ప్లీనరీ చర్చలు, పార్టీ నాయకత్వానికీ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తూనే మరోపక్క చక్కని ఆత్మపరిశీలనకు అవకాశం కల్పిస్తాయని ఆశించవచ్చు.  ఈ ప్రతినిధుల సభలోనే కేసీఆర్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటించడం లాంఛనంగా జరిగే మరో ప్రక్రియ. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పార్టీ పగ్గాలు పూర్తిగా ఒప్పచెప్పి, యువ నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ వున్నట్టు సమాచారం.  కాకపొతే, ఈ ఊహాపోహలకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఆయన మనస్సులోని మాట ఆయన స్వయంగా బయట పెట్టేదాకా ఏ విషయం మూడో కంటికి తెలిసే అవకాశం లేని రాజకీయ చాణక్యం ఆయన సొంతం. కేసీఆర్ ఆలోచనా విధానమే విభిన్నం. పరిపాలనలో కావచ్చు, పార్టీ నడిపే తీరులో కావచ్చు ఆయనది ఒక అరుదయిన విలక్షణ శైలి అని అందుకే అందరు చెప్పుకుంటారు.

ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. సుమారు రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ ప్రస్థానాన్ని గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. ఈ  క్రమంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను ఓసారి సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.

తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే, పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే కేసీఆర్ తత్వం, తెలంగాణా ఉద్యమ స్పూర్తి ఏ దశలోనూ దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా చేయగలిగాయి. ఇందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహాల్లో పార్టీ ప్లీనరీలు ఒక భాగం. ఉద్యమ తీవ్రతలో హెచ్చుతగ్గులు వుండవచ్చేమో కానీ, త్రికరణశుద్ధిగా సాగించే ఉద్యమాలు, ఆందోళనలు వైఫల్యం చెందే ప్రశ్నే ఉండదని కేసీఆర్ నమ్మకం. ఈ పరిణామ క్రమంలో టీఆర్ ఎస్ పార్టీ ఎదుర్కున్న ఆర్ధిక ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా దశాబ్ద కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.

సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా నిభాయించుకోవడం మరో ఎత్తు. పార్టీని చీల్చయినా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసే శక్తులు పక్కనే పొంచివుంటాయి. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే శక్తులను ఆదిలోనే కట్టడి చేసిన విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.

తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే పుష్కర కాలంగా తన మెదడులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే పనికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణా చీకటి కూపం అవుతుందని వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించిన వారు చేసిన ఎద్దేవాలను గుర్తు పెట్టుకుని, పట్టుదలగా పనిచేసి అనేక సంవత్సరాలుగా జనాలు అలవాటుపడిన కరెంటు కోతల ఇబ్బందులను మంత్రం దండంతో మాయం చేసినట్టు మాయం చేశారు. రాష్ట్రం విడిపోగానే హైదరాబాదులోనూ, ఇతరత్రా తెలంగాణాలోనూ స్థిరపడ్డ ప్రాంతీయేతరులు తమ భవితవ్యంపై పెంచుకున్న భయాoదోళనలను అనతికాలంలోనే మటుమాయం చేశారు. భగీరధ, కాకతీయ వంటి పధకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణా దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

అయినా చేయాల్సినది అంతా చేయలేదేమో అనే నిరాశాపూరిత వ్యాఖ్యలు అప్పుడప్పుడూ వినబడుతూనే వున్నాయి. విపక్షాలు విమర్సించక ఏమి చేస్తాయి అని సరిపెట్టుకోవచ్చు, సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఆ నిరసనలు వెలువడుతున్నది విపక్షాల గొంతుకలో నుంచా, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారా అనేది జాగ్రత్తగా గమనించుకోవడం సమర్ధుడయిన పాలకుని ప్రధమ కర్తవ్యం.

ప్లీనరీ అందుకు తగిన వేదిక కాగలదని ఆశిద్దాం.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి