7, ఏప్రిల్ 2022, గురువారం

మంత్రివర్గాల రాజీనామాలు మూడు ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 

ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది!  మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి,  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.

అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా  నవ్వుతూ  ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.

ఇక ఇలాంటి మంత్రివర్గ క్షాళన మరోసారి జరిగింది. అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తున్నాను. ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు. ఇలాగే ఆయన కూడా ఒక రోజు హఠాత్తుగా ముప్పయి ఒక్కమంది మంత్రుల రాజీనామాలను అడిగి తీసుకుని ఆమోదం కోసం గవర్నర్ కు పంపారు. ఆమోద ముద్ర పడింది. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి వారం రోజులు అక్కడే వుండి, తర్వాత కానీ కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పుకున్నారు.

పొతే మూడోది. మంత్రివర్గం రాజీనామా కాదు. ఇది మరీ విచిత్రం. ముఖ్యమంత్రి  డాక్టర్  వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన దరిమిలా కాంగ్రెస్ అధిష్టానం వయసులో పెద్దవాడు అయిన ఆర్ధిక మంత్రి  శ్రీ కె. రోశయ్యను ఆ పదవికి ఎంపిక చేసింది. శ్రీ రోశయ్య పాత మంత్రులను అందర్నీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కనీసం వారి శాఖల్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేవరకు అదే మంత్రివర్గం.

ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి మండలిలోని ఇరవై నాలుగు మంది మంత్రుల రాజీనామాలు తీసుకున్నారు. కొత్త మంత్రివర్గం కూర్పు పనిలో వున్నారు.

తోక టపా : పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నరోజుల్లో  మొరార్జీ దేశాయ్ వంటి  సీనియర్ మంత్రులను తప్పించడానికి కామరాజ్ ప్లాన్ పేరుతొ మొత్తం మంత్రివర్గం చేత రాజీనామా చేయించారు.

(07-04-2022)   

 

2 కామెంట్‌లు: