2, ఏప్రిల్ 2022, శనివారం

పదవులు ఊరికే రావు – భండారు శ్రీనివాసరావు


“కొంత గ్యాసు నూనె కావాలె. మరేమీ అక్కరలేదు” అన్నారు బండారు దత్తాత్రేయ గారు ‘మీకింకా ఏమి కావాలి’ అని అడిగిన ఆనాటి మంత్రి మండలి వెంకటకృష్ణా రావు గారితో.
ఇది 1977 నాటి మాట. ఆ ఏడాది నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి విరుచుకు పడిన ఉప్పెన ధాటికి దివి సీమలో ఊళ్లకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయి. కాళరాత్రిగా మారిన ఆనాటి రాత్రి అకస్మాత్తుగా ముంచెత్తిన సముద్రపు అలల తాకిడికి దివి సీమ శవాల దిబ్బగా మారింది. రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామాలతో పాటే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని దారులు మూసుకు పోయాయి. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, విలేకరులు అతి కష్టం మీద కొన్ని రోజుల తర్వాత కానీ అక్కడికి చేరలేకపోయారు. వరద తీసిన తర్వాత పేరుకుపోయిన మట్టి మేటల్లో వందలాది మనుషుల శవాలు, పశువుల కళేబరాలు కూరుకు పోయాయి. నష్టం జరిగింది కానీ ఏమేరకు అని అంచనా వేయడానికి అడుగడుగునా అన్నీ ప్రతిబంధకాలే. ఇప్పటి మాదిరిగా కమ్యూనికేషన్ సదుపాయాలు ఆనాడు లేవు.
ఈ నేపధ్యంలో దత్తాత్రేయ గారు అన్నమాట అది, ‘మాకేమీ అక్కరలేదు, గ్యాసు నూనె చాలు’ అని.
బండారు దత్తాత్రేయ ఏమిటి గ్యాసు నూనె కావాలని అడగడం ఏమిటి ఈ రెంటికి అసలు ఎక్కడ సంబంధం అనుకోవచ్చు. ఒక ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా అనేకమంది తోటి సహచరులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దత్తాత్రేయ గారు దివి సీమకు వెళ్ళారు. వరద నీటిలో తేలుతూ ఉబ్బిపోయిన మనుషుల శవాలను ఒక్క చోటకు చేర్చి వాటికి అనాథ శవ సంస్కారం చేసే ఉత్కృష్టమైన బాధ్యతను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారు. ఈ పని చేయడానికి వారికి కిరోసిన్ అవసరం. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నది స్వయానా నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు. ఆయన కూడా రాత్రి పగలు, దారి డొంకా అని లేకుండా కాలి నడకన కలయ తిరుగుతూ ప్రాణాలతో బయట పడిన దివి సీమ వాసులకు ప్రభుత్వ పక్షాన ధైర్యం చెబుతూ, అధికారులతో మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తూ, కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ వుండడం చూసి హైదరాబాదు నుంచి వెళ్ళిన కొందరు వ్లిలేకరులకు ఆశ్చర్యం వేసింది. తెల్లటి ఖద్దరు దుస్తుల్లో హైదరాబాదులో చూసిన మనిషి, మట్టి కొట్టుకుపోయిన దుస్తుల్లో ఊరూ వాడా అనకుండా తిరుగుతూ వుండడం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది.
స్థానికంగా అన్నీ తానే అయి చూస్తున్న మండలి కృష్ణారావు గారిని దత్తాత్రేయ బృందం కలిసింది. ముందు దత్తాత్రేయ వేష భాషలు చూసి నాగపూర్ నుంచి వచ్చి ఉంటారని మంత్రి అనుకున్నారు. ఆంధ్రజ్యోతి తరపున పరాంకుశం దామోదర స్వామి, ఈనాడు తరపున పాశం యాదగిరి ప్రభ్రుతులకు కూడా దత్తాత్రేయ గారిని ఆనాడు చప్పున గుర్తు పట్టలేని పరిస్థితి.
గ్యాసు నూనె అంటున్నారు ఈయన గారిది హైదరాబాదు అయి వుంటుంది అనే అనుమానం కలిగింది.
పాశం యాదగిరిని చిన్నప్పటి నుంచి పండిత్ పొట్టా (బాల మేధావి) అనే వారు. చాలా విషయాలు గుర్తుంచుకునే ధారణ శక్తి పుష్కలం.
బండారు దత్తాత్రేయ ఎవరన్నది యాదగిరికి చప్పున జ్ఞాపకం వచ్చింది.
“ఖాఖీ నిక్కరు వేసుకుని, లాఠీ చేత పట్టుకుని, క్యా ఆలీఘడ్ క్యా గౌహ్వాటీ, అప్ నా దేశ్, అప్నా మాటీ” అంటూ గౌలీగూడాలో తమ ఇంటి మీదుగా వెళ్ళే ప్రభాత్ భేరీ బృందం యాదగిరి స్మృతిపధంలో లీలగా మెదిలింది. అందుకే అతడు యాదగిరి కాదు, యాద్ గిరి అని పిలుస్తాను నేను.
ఇక ఇద్దరికీ తాము ఎవరన్నది తెలిసిపోయింది.
“నువ్వు పాశం గోపయ్య బిడ్డవు కదా!” అన్నారు దత్తాత్రేయ.
యాదగిరి, దామోదరస్వామి దత్తాత్రేయ బృందంతో కలిసి దివిసీమపై పగబట్టిన ప్రకృతి ఆగ్రహంతో చేసిన విలయ తాండవం తాలూకు ఘోర దృశ్యాలను కళ్ళారా చూసారు. వరద పూర్తిగా తీసిన తర్వాత కొన్ని కొబ్బరి చెట్ల మట్టలలో చిక్కుకుని వున్న మానవ కళేబరాలను చూసినప్పుడు నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి సంభవించిన ఉప్పెనతో దివి సీమకు వాటిల్లిన ముప్పు తీవ్రత ఎంతటిదో వారికి అర్ధం అయింది. అంటే ఆ ఎత్తులో సముద్రపు కెరటాలు విరుచుకు పడ్డాయి అన్నమాట.
‘ఇంకేమీ అక్కరలేదు గ్యాసు నూనె చాలు’ అని నలభయ్ అయిదేళ్ళ నాడే అనాథ శవాల అంత్యక్రియలు చిత్తశుద్ధితో చేసిన బండారు దత్తాత్రేయ గారు ఈనాడు హర్యానా గవర్నర్.
పదవులు ఊరికే రావు.



(02-04-2022)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి