28, మార్చి 2022, సోమవారం

లోనారసి

(నమస్తే తెలంగాణా పత్రికలో ప్రచురితం)

ఒక పక్క యాదాద్రి అంటూ ఇదేమి తెలుగు అనుకుంటున్నారా! లేదు. ఇది అచ్చ తెలుగు పదం. దీని సంగతి తర్వాత చెప్పుకుందాం.
ఈరోజు నాకు తెలిసి తెలంగాణలో అన్ని లోగిళ్ళలో అందరి కళ్ళు టీవీల్లో చూపిస్తున్న యాదాద్రి వైభవం చుట్టూనే అల్లుకు పోయి వున్నాయని చెబితే అతిశయోక్తి కాదు.
తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు యాదగిరి గుట్ట దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో పునర్నిర్మించడానికి ఏ ముహూర్తం లో నిర్ణయించారో కానీ, ఆ సుమూహర్తం ఈనాటికి నిజమైంది. గతంలో ఆ గుడినీ, ఆ పరిసరాలను చూసిన వారు ఇప్పుడు కనిపిస్తున్న బ్రహ్మాండమైన కట్టడాలను, శిల్పాలను చూసి ఆశ్చర్యచకితులు కాక మానరు.
వేల కోట్ల ధనం, వందలాదిమంది శిల్పులు, అహరహం ప్రత్యక్ష పర్యవేక్షణలో తలమునకలయిన వందలాది అధికారులు, సిబ్బంది శ్రమ ఫలితం ఈనాడు మనం అక్కడ సుందర అద్భుత నిర్మాణాల రూపంలో చూస్తున్నాం. ఇదంతా కేవలం ఆరేళ్ల కాలంలో జరిగింది అంటే నమ్మశక్యం కాని సంగతి.
ఇందుకు కర్తా, కర్మా, క్రియా యావత్తు ముఖ్యమంత్రి కేసీఆరే. అనుమానం లేదు. ఆయన సంకల్ప బలం ఫలితమే ఈనాటి మహాకుంభ సంప్రోక్షణ క్రతువు.
ఆలయ పునర్నిర్మాణంలో సహకరించిన, కృషి చేసిన స్థపతులను, ఇతరులను ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు సముచిత రీతిన సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని టీవీలో లోనారసిగా వీక్షిస్తే (లోనారసి అనే పదాన్ని లోతుగా (లోతులకు వెళ్లి పరీక్షగా చూడడం) అనే అర్ధంలో వాడతారు) అప్పుడు కనబడ్డారు, ఓ పక్కగా అంతవరకూ కనబడని జి. కిషన్ రావు గారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్న యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆయన. ఈ బృహత్ కార్యానికి ముఖ్యమంత్రి సర్వస్వం అయితే, కిషన్ రావు మాత్రం నేపధ్యంలోనే ఉంటూ, ముఖ్యమంత్రి మనసులో యేమని అనుకుంటున్నారో అచ్చం ఆవిధంగానే ఆచరణలో చేసి చూపించారు. దండలో దారంలాగా ఈ పునర్నిర్మాణ క్రతువులో ఆయన నిర్వహించిన పాత్ర చిన్నదేమీ కాదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు శాలువా కప్పి తగిన రీతిన సత్కరించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఆయనకు సమీపంలో వుండాలని, ఫోటోల్లో పడాలని, టీవీల్లో కనబడాలని చోటా మోటా నాయకులు, చిన్నా పెద్దా అధికారులు తెగ తాపత్రయపడడం కొత్తేమీ కాదు. అయితే ఈనాడు జరిగిన యావత్ కార్యక్రమంలో కిషన్ రావు అలా ఎక్కడా కనబడలేదు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఈయన ఎక్కడికి పోయారు అని సందేహించిన వాళ్ళు వున్నారు. కానీ ఆయన తత్వం తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే ఆయన ప్రచారాలకు దూరం. అప్పగించిన కర్తవ్యమ్ తప్పిస్తే ఆయనకు ఏదీ పట్టదు.
కిషన్ రావు గారిని తెలియని జర్నలిష్టు ఉండడేమో. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యోగాలు అలాంటివి. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రులు అందరూ ఆయన సేవలను అడిగి మరీ ఉపయోగించుకున్నారు. ఆనాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాటి కేసీఆర్ వరకు ఇదే వరస. వయసు ఎనభయ్ దాటినా ఆయనలో ఆయనకు అలసట అనేది లేదు. పని లేకపోతె జ్వరం వచ్చినట్టు వుంటుంది అనే సీనియర్ ఐఏఎస్ అధికారి కిషన్ రావు గారు తన పెన్షన్ డబ్బులు తప్ప, రిటైర్ అయిన తర్వాత చేసిన, చేస్తున్న ఏ ఉద్యోగానికి జీతం తీసుకోరు.
కొత్తగా నిర్మించిన యాదాద్రి ఆలయం ఆ నారసింహుడు కిషన్ రావు గారికి ఇచ్చిన జీవన సాఫల్య పురస్కారం.
ఒకప్పుడు శిల్పారామం అంటే గుర్తుకు వచ్చే కిషన్ రావు గారి పేరు, యాదాద్రి వెళ్ళినప్పుడల్లా స్పురణకు రావడం ఖాయం.







(28-03-2022)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి