18, మార్చి 2022, శుక్రవారం

బ్రాహ్మణ సదస్సు – భండారు శ్రీనివాసరావు

 

ఇది నలభయ్ ఏళ్ళ నాటి మాట.

ఆ రోజుల్లో చిక్కడపల్లిలో ABCD ORGANISATION (All Brahmin Community Organization) అనే ఒక సంస్థ వుండేది. ఆ సంస్థ కార్యదర్శి, సమాజంలో వివిధ వర్గాలతో సన్నిహిత పరిచయాలు కలిగిన ఒక జర్నలిష్టుని కలిసి తమ సంస్థ కార్యకలాపాలలో సహకారం అర్ధించాడు. ఆయన వెంటనే లేచి నిలబడి, కులాల పేరుతొ సంస్థలు, సంఘాలు నిర్వహించడం తనకు సుతరామూ ఇష్టం లేదని మొహం మీదే అనేసి వెళ్లి రండంటూ పంపేశాడు.

మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అదే జర్నలిష్టు ఇటీవల హైదరాబాదులో బ్రాహ్మణ సదస్సు జరిగితే హాజరయి బ్రాహ్మణ సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ చేసిన తీర్మానానికి తన మద్దతు ప్రకటించారు. కాలం తెచ్చిన మార్పు అనుకోవాలి.

ఇప్పుడు ఒక నిజం చెబుతాను, ఆ జర్నలిష్టు ఎవ్వరో కాదు, నేనే!

అయిదేళ్ళ  క్రితం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా దాదాపు రెండేళ్ళు పనిచేసిన వెంకట్ చంగవల్లి గౌరవార్ధం జరిగిన సమావేశానికి వెళ్ళినప్పుడు నాకీ విషయం మరోమారు స్పురణకు వచ్చింది.

ఈ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్, మాజీ చీఫ్ సెక్రెటరీ ఐ.వై.ఆర్. కృష్ణారావు రావుగారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముక్తసరిగా మాట్లాడడం ఆయన తత్వం. కానీ కృష్ణారావుగారి నిన్నటి ప్రసంగం ఉద్విగ్నంగా సాగింది. ఆయనలో దాగున్న అద్భుతమైన వక్త వెలికి వచ్చారు. ప్రభుత్వ సర్వీసులో వున్నప్పుడు ఆయన్ని ఎన్నోసార్లు కలిశాను. ప్రత్యేకించి ఒక కులానికి ప్రయోజనం కలిగించే ధోరణిని ఎన్నడూ కనబరచలేదు. కానీ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్న తరువాత బ్రాహ్మణ సంక్షేమానికి ఎన్ని రకాల ఆలోచనలు చేస్తున్నదీ తేటతెల్లం అయింది. నిజానికి ఈ కార్పొరేషన్ పదవి ఆయన గతంలో చేసిన ఉద్యోగాలతో పోలిస్తే చాలా చాలా చిన్నది. చీఫ్ సెక్రెటరీగా వున్నప్పుడు డజన్ల సంఖ్యలో ఇలాంటి సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేసేవి. వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లు ఆయన ఆధ్వర్యంలో రూపు దిద్దుకునేవి. అంత పెద్ద హోదాలో పనిచేసిన పెద్ద మనిషి ఇంత చిన్న పోస్ట్ ఎందుకు ఒప్పుకున్నారో అప్పుడు నా బోంట్లకు అర్ధం కాలేదు కూడా. ఇప్పుడు తెలిసివచ్చింది, ఒక చిన్న సంస్థను కూడా పెద్ద ఎత్తున విస్తరించాలంటే ఇలాంటి వ్యక్తులే అవసరమని.

కార్పొరేషన్ అనుబంధ విభాగం బ్రాహ్మణ సహకార పరపతి సంస్థకు ఈ కొద్దికాలంలోనే ఆయన తన పలుకుబడితో అనేక హంగులు కల్పించారు. పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులకు సాఫ్ట్ వేర్ అందిస్తున్న ఒక సంస్థ నుంచి అదే రకమైన సాఫ్ట్ వేర్ ను, కాణీ ఖర్చులేకుండా ఉచితంగా పొందగలిగారు. దాని విలువ రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా ఇరవై కోట్లు. అంటే కార్పొరేషన్ కు ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సమానం అన్నమాట.

ఇక ఆ సాయంత్రం ప్రధాన అతిధి వెంకట్ చంగవల్లి తన సతీమణి పద్మగారితో కలిసి వచ్చారు. మామూలుగానే ఆయన సీరియస్ సమావేశాలు, సదస్సుల్లో కూడా నవ్వులు పూయిస్తారు. ఆ అలవాటుతో ఆయన తన ప్రసంగాన్ని ఒక పిట్టకధతో మొదలు పెట్టి అసలు అంశానికి జోడిస్తూ కొనసాగించారు.

ఒకావిడకు పుట్ట చెముడు. డాక్టరుకు చూపెట్టుకుంది. రకరకాల వినికిడి సాధనాలు చూపెట్టారు. ఒకటి చాలా ఖరీదు, ఒకటి చాలా చాల చౌక. ఖరీదుది పెట్టుకుంటే బాగా వినబడుతుంది. చౌకది తగిలించుకుంటే ఏమీ వినబడదు. కాకపోతే చెవిటి మిషన్ కనబడగానే ఆవిడ చెవిటిది అన్న విషయం బోధపడి ఎదుటి వాళ్ళే ఓపిక చేసుకుని బిగ్గరగా మాట్లాడతారు. అల్లాగే, వెంకట్ చంగవల్లి గతంలో ఈఎం ఆర్ ఐ (108 అంబులెన్స్) వంటి అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా ఆయన ఎవరన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా తనని నియమించగానే చెవిటి మిషన్ కధలోని అవ్వలాగా తానెవరన్నది అందరికీ తెలిసిపోయిందని చెప్పారు.

తెలంగాణ బ్రాహ్మణ పరిషద్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ భవాని శంకర్, ఇంకా అనేకమంది బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొని వెంకట్ చంగవల్లికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ఒక కొసమెరుపు:

లక్ష్మణ్ అనే ఒక పెద్దమనిషి ఒక చిన్న జ్ఞాపకాన్ని  సదస్యుల మీదికి ఒదిలారు. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో పనిచేసే లక్ష్మణ్ అనే ఓ పెద్దమనిషిని ఒక సదస్సుకి పిలిచారు. అధ్యక్షులవారు Now Mr. Lakshman will give his valuable address in brief’ అంటూ వేదిక మీదకు ఆహ్వానించారుట. లక్ష్మణ్ గారు నేరుగా మైకు తీసుకుని, లక్ష్మణ్, కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, ఎస్సారార్ కాలేజ్, విజయవాడ’ అనేసి చక్కా స్టేజ్ దిగి వచ్చేసారుట.

నేను చదివింది, అదే ఎస్సారార్ కాలేజీలో. అందుకే ఇది గుర్తు పెట్టుకున్నాను. (18-03-2017)

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి