16, మార్చి 2022, బుధవారం

మరు క్షణం మనది కాదు – భండారు శ్రీనివాసరావు

 క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|

యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||

అని నిర్మల్ అక్కరాజు  పోస్టు పెడితే ఒకరు ఏమిటి ఈ వైరాగ్యం అన్నారు.

నిజానికి నిర్మల్ కొటేషన్ కరక్టే.

అందుకు ఈరోజు జరిగిన కొన్ని సంఘటనలే సాక్ష్యం,

బుధవారం చాలా కలతగా గడిచింది. మొన్న నా పోస్టుకు వివరంగా చక్కటి కామెంటు పెట్టిన సి.హెచ్. కృష్ణ గారు, నేను ఆ కామెంటు చూసిన కాసేపటికే ఈ లోకం విడిచి వెళ్ళారు. సాయంత్రం అవుతూనే మరో దుర్వార్త. మిత్రుడు పాత్రికేయ సహచరుడు విద్యారణ్య గుండె పోటుతో మరణించాడు. చావు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా ఆవిడ మరణం. ఆలోచనలు అన్నీ అటు మళ్లాయి.

ఇదెలా ఉండగానే మితృలు ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేశారు. అవీ ఇవీ మాట్లాడుతూ వారికి బాగా పరిచయం వున్న, మంచి మనసున్న వ్యక్తి హఠాత్తుగా  చనిపోయాడని చెప్పారు. స్కూటరు మీద ఇంటికి తిరిగొచ్చిన ఆ నలభయ్ ఏళ్ళ మనిషి స్కూటర్ స్టాండ్ వేస్తూ ఓ పక్కకి ఒరిగిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఫలితం దక్కలేదు. తీసుకురావడానికి ముందే  ప్రాణం పోయిందన్న చావు కబురు చెవిన వేశారు. ఎంతో జీవితం ముందున్న మనిషి ముందే పోయాడు.

వాళ్ళ కాలనీలో ఓ బాలాజీ దేవాలయం వుంది. ఏవో  ఉత్సవాలు జరుగుతున్నాయి. దేవేరి సహిత దేవదేవుడిని కాలనీలో ఊరేగిస్తూ రావడం ఆనవాయితీ. ఇంటిముందు నిలబడిన పల్లకీలోని దేవదంపతులకు  హారతి ఇవ్వడం కృష్ణారావు దంపతుల ఆనవాయితీ. కానీ విధిగా రావాల్సిన ఊరేగింపు రాలేదు. ఆయన నడుచుకుంటూ వెళ్లి గుళ్ళో పూజారిని ఆరా తీశారు. ఆ గుడికి అధికారికంగా ధర్మకర్త కాకపోయినా సర్వం తన భుజాలకు ఎత్తుకుని అన్ని కార్యక్రమాలు చక్కబెట్టే ఓ పుణ్యాత్ముడు తన తొంభయ్ రెండో ఏట మరణించాడు.  అమెరికాలో ఉంటున్న ఆయన పిల్లలు  తండ్రికి అనారోగ్యం అని తెలిసి రెక్కలు కట్టుకుని హైదరాబాదులో వాలారు. పిల్లల్ని చూసిసరికి  పెద్దాయన కొంత తేరుకున్నాడు. తేరుకున్నాడని అనుకుని, ముందు నుంచి ఆయన్ని కనిపెట్టుకుని చూస్తున్న సహాయకుడికి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి  చేరారో లేదో ఇక్కడ ఈయన ప్రాణం పోయింది. 

కింది ఫోటో:

నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయిని ఇంటర్వ్యూ చేస్తున్న పాత్రికేయ మిత్రుడు విద్యారణ్య 


 

1 కామెంట్‌: