13, మార్చి 2022, ఆదివారం

అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు - భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు ఆదివారం 13-03-2022 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

పత్రికలకి, మీడియాకి మాత్రమే కాదు, అసెంబ్లీకి కూడా రిపోర్టర్లు వుంటారు. కాకపొతే ఇది ప్రభుత్వ ఉద్యోగం.

అసెంబ్లీ సమావేశ మందిరంలో స్పీకర్ స్థానానికి ముందు వరసలో అర్ధ చంద్రాకారంగా ఉన్న కుర్చీల వరుసలో శాసన సభ కార్యదర్శి, ఉన్నతోద్యోగులతో పాటు మరికొందరు ఉద్యోగులు కూర్చుని, సభ్యులు మాట్లాడే సంగతులను షార్ట్ హాండ్ లో రాసుకుంటూ వుంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వారి స్థానంలో మరికొందరు వచ్చి సభావ్యవహారాలను నోట్ చేస్తుంటారు. బయటకి వెళ్ళిన వాళ్ళు తాము అంతవరకూ షార్ట్ హాండ్ లో రాసుకున్న వివరాలను వివరంగా టైప్ చేసి వాటిని యధాతధంగా  సభ రికార్డులలోకి ఎక్కిస్తుంటారు. రేడియో ప్రతినిధిగా సందేహ నివృత్తి కోసం నేను కూడా అనేక సార్లు అసెంబ్లీ రిపోర్టర్లను సంప్రదించిన సందర్భాలు వున్నాయి.

సభలో ఏదైనా గందరగోళం జరిగి, ఏ సభ్యుడైనా సభా మర్యాదకు భంగం కలిగించే విధంగా మాట్లాడితే, సభాపతి అక్కడికక్కడే రికార్డుల తొలగించినట్టు ప్రకటిస్తారు. లేదా ఏదైనా సందేహం వుంటే రికార్డులను పరిశీలించి తొలగిస్తామని హామీ ఇచ్చి సభికులను సంతృప్తి పరుస్తుంటారు. రికార్డుల నుంచి తొలగించిన విషయాలను ఏ పత్రిక అయినా తొందరపడి ప్రచురిస్తే ఆ పత్రిక సంపాదకుడిపై సభాహక్కుల నిబంధనల కింద చర్య తీసుకునే అధికారం స్పీకర్ కు వుంటుంది.

పొతే, రికార్డులకి ఎక్కిన వివరాలను తరువాత ప్రభుత్వ ముద్రణాలయంలో ముద్రించి వాటిని సభ్యులకు పంపిణీ చేసి, కొన్నింటిని అసెంబ్లీ గ్రంథాలయంలో భద్రపరుస్తారు. ఇదంతా ఒకప్పటి కధ. ఇప్పుడు కూడా అదే విధానం వుంది. కానీ వాటిని కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాయి. వాటి పూర్వాపరాలు తెలియచేయడానికే ఈ ప్రయత్నం.

చాలా ఏళ్ళ క్రితం,

అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఒక రోజుముందు, 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో, ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు, ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాత కానీ ప్రసారం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన' కిందికి వస్తుందన్న భయం అనండి, ఇంకేదన్నా అనండి, అన్ని జాగ్రత్తలు తీసుకునేలా వారిని జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను శాసన సభలో, తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి రేడియో విలేకరిగా నా స్వానుభవం. విమర్శలు, ప్రతి విమర్శలు ఒక స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల, ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది.  శాసన సభ జరిగే  రోజుల్లో ఇప్పటికీ ఈ కార్యక్రమం ప్రసారం చేస్తూనే వున్నారు.

ఇక ప్రస్తుతానికి వస్తే,

ఉమ్మడి రాష్ట్రంలో  శాసన సభ మాజీ స్పీకర్, ప్రస్తుతం నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు అయిన శ్రీ యనమల రామకృష్ణుడు చట్ట సభల బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీ స్పీకర్ కు ఒక లేఖ రాస్తూ మండలి సమావేశాలను సయితం ప్రత్యక్ష ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమంజసమైన కోరికే. పైగా ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావించి ఆయన హయాములోనే వీటిని ప్రారంభించిన చరిత్ర కలిగిన  రాజకీయ నాయకుడిగా ఆయనకు ఈ విషయాల్లో సంపూర్ణ అవగాహన వుండి వుంటుంది. ఆ రోజుల్లో ఈ ప్రత్యక్ష ప్రసారాలకు చాలా ప్రజాదరణ వుండేది. ప్రభుత్వ పక్షంతో పాటు, ప్రతిపక్షాల వాణికి కూడా సముచిత ప్రాధాన్యం ఇచ్చేవారు. అంచేత సభలో జరిగే వాదోపవాదాలు, కొండొకచో గీత దాటినట్టు అనిపించినా, మొత్తం మీద ప్రేక్షకులను బాగా అలరించేవి. తమ రిపోర్టర్లు తెచ్చే వార్తలను సరిచూసుకోవడానికి డెస్క్ లో వున్న సీనియర్ జర్నలిస్టులు కూడా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేవారు.  ఈ ఖ్యాతి యనమల రామకృష్ణుడిదే అని చెప్పాలి. కాకపొతే, ప్రసారాలను ఎడిట్ చేయకుండా యధాతధంగా చూపించాలని కూడా ఆయన కోరారు. ఈ సూచన చేసే ముందు, గతంలో తాము అధికారంలో వున్నప్పుడు ఇదే విధానాన్ని అమలు చేసారా లేదా  అన్న విషయాన్ని రామకృష్ణుడు నిర్ధారణ చేసుకున్నారో లేదో తెలవదు.

టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో, ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసనసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు, ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని ఆశపడ్డారు. అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు. కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే,  ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి,  టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే, చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం.

చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్టసభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి ఓటర్లకు వున్న ఒకే ఒక అవకాశం ఈ ప్రత్యక్ష ప్రసారాలే అన్న అంశాన్ని మరువకూడదు.

అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దే సించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో పస లేని ఆరోపణలు చేస్తూ  సభాసమయం వృధా చేయని తత్వాన్ని అవి అలవరచుకోవాలి. అదే సమయంలో, సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాధ్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి, కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్యసౌధ పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.

తోక టపా:

వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ

2004 జులై 21 న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.

బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.

నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.

ఎప్పుడు వచ్చినా నువ్వుండవు. గానుగ పని మాత్రం నడుస్తూనే వుంటుంది. ఎలా’ అని.

ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను. మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటాను’ గానుగవాడు చెప్పాడు.

పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.

అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల శబ్దం వినబడుతుంది. కాని పని సాగదు. అప్పుడెలా?’ అడిగాడు.

నా ఎద్దు అలా చేయదు’ అన్నాడు గానుగ మనిషి.

అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి అడిగాడు పండితుడు.

ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి’

ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి.”



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి