7, ఫిబ్రవరి 2022, సోమవారం

ఒక తరం ఆపేక్షలు, అభిమానాలు

 కింద ఫోటోలో మా అన్నదమ్ముల మధ్యలో వున్నది ఎనభయ్ అయిదేళ్లు దాటిన యువకుడు. యువకుడు అని ఎందుకు అంటున్నాను అంటే ఈయన గారు ఎక్కడో నల్లకుంట నుంచి మెట్రో పట్టుకుని నాగోలులో దిగి, ఆటోలో రాత్రి మా పెద్దన్నయ్య  మనుమరాలు  శరణ్య పెళ్లి జరిగిన స్వాగత్ గ్రాండ్ హోటల్ కు చేరుకొని,  రెండో అంతస్తులోని పెళ్లి మంటపానికి ఒంటరిగా వచ్చేసారు.

ఈ వృద్ధ బాలకుడి పేరు ఆకురాతి వెంకటేశ్వర రావు గారు. మా అన్నయ్యకు బాల్య స్నేహితుడు కాదు కానీ ఆప్త మిత్రుడు. నేను కాలేజీలో చదువుకుండే రోజుల్లోనే ఆయన అమెరికా, ఆఫ్రికా వంటి అనేక దేశాలు చుట్టి వచ్చాడు. వయసు రీత్యా కొంత వినికిడి తగ్గింది కానీ స్వరం మాత్రం అప్పటిలా  కంచుకంఠం.

‘నా స్నేహితుడు పర్వతాల రావు గారి మనుమరాలి పెళ్ళికి నేను రాకుండా ఎలా వుంటాను?’  అంటారు ఆయన, ‘ఎలా వచ్చారు?’ అనే నా ప్రశ్నకు జవాబుగా.

వెంకటేశ్వర రావు గారి భార్య శ్రీమతి విజయలక్ష్మి ఎస్సారార్ కాలేజీలో లెక్చరర్. కొన్నేళ్ళ క్రితం ఆవిడ మరణించారు. అప్పటినుంచి ఆమెనే తలచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మనసును చిక్కబట్టుకోవడానికి ఇదిగో ఇలా పుస్తకాలు రాస్తున్నారు.

ఆకురాతి గారి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన ఇంగ్లీష్ పరిజ్ఞానం చాలా గొప్పది. ఆయన తుమ్మినా దగ్గినా ఇంగ్లీష్ లోనే అని చెప్పుకునే వారు. ఈ రామాయణం పుస్తకం కూడా వెంకటేశ్వర రావు గారు ఆ భాషలోనే రచించారు.

రాసిన పుస్తకం మా చేతిలో పెట్టి, ఓ చేతిలో ఓ చేతి సంచి, మరో చేతిలో ఓ చేతి కర్ర పట్టుకుని అలవోకగా లిఫ్ట్ దిగి వెళ్ళిపోయారు ముందు ఆటో, తర్వాత మెట్రో రైలు పట్టుకుని ఆ రాత్రి ఇంటికి చేరడానికి, కారులో పంపిస్తాం అనే మా మాట చెవిన పెట్టకుండా.

యు ఆర్ ఆల్వేస్ గ్రేట్ వెంకటేశ్వర రావు గారూ!  



07-02-2022  

1 కామెంట్‌:

  1. మా తండ్రి గారి స్నేహితుడొకాయన ఉండేవారు - ప్రముఖ పాత్రికేయుడు మద్దాలి సత్యం గారు - మీకు తెలిసే ఉండుంటారు. తొంభై యేళ్ళు పైబడిన వయసులో కూడా ఒక్కరే సిటీబస్ లో తిరిగేవారు - అసహాయశూరుడి లాగా.
    పైన మీరన్నట్లు “వృద్ధ బాలకుడు” 🙏.

    రిప్లయితొలగించండి