మా అమ్మానాన్నల పదకొండు మంది సంతానంలో ఆడపిల్లల్లో ఆమె చిన్నది. మగపిల్లల్లో నేను చిన్న వాడిని. అంతే అంతవరకే పోలిక. ఆమె వ్యక్తిత్వం ముందు నేనో పిపీలికాన్ని.
రేడియో డ్యూటీ మీద హైదరాబాద్ నుంచి
బెజవాడ వెళ్ళినప్పుడు, గాంధీ నగరంలోని వాళ్ళింట్లోనే వారాల
తరబడి నా ఆల్ మకాం.
పొద్దున్నే రేడియో స్టేషన్ కారు
వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలు, ఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట.
పక్కనే మా బావగారి పూజ గది. అప్పటికే
ఆమె లేచి ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన
సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి నాకు
కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో సంభాలించేది.
ఈ బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ
ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు.
కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ
పదానికి ఆమెకు అర్ధం తెలుసని నేను అనుకోను.
భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక గృహిణిగా, ఒక
భార్యగా, ఒక తల్లిగా ఇన్నేళ్ళుగా శరీరం
సహకరించినా లేకపోయినా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. అయినా కర్మ ఫలం తప్పదు.
విరిగిన
కాలుకే మళ్ళీ ఆపరేషన్. ఆపరేషన్ చేసిన ఆ కాలుకే మళ్ళీ ఫ్రాక్చర్. అదీ ఎప్పుడు?
డెబ్బయి అయిదేళ్లు దాటిన వయసులో.
ఆ
పిడికెడు గుండె అన్ని ఆపరేషన్లను తట్టుకుంది. ఎలా తట్టుకుందో ఆ గుండెకే తెలుసు.
మా
బావగారు పోయినప్పటి నుంచి ఆయన ఆలోచనలతోనే రోజులు గడిపింది. భార్యాభర్తల అనుబంధం అర్ధం కావాలి అంటే వారిలో ఎవరో ఒకరు పోవాల్సిందేనా!
ఎవరికీ
లేని అదృష్టం ఆమెది. అందరూ మగపిల్లలే. కోడళ్ళు అందరూ మంచివాళ్ళు. మంచాన పడిన
రోజులు తక్కువే అయినా, కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆదివారం వచ్చిందంటే
చాలు, పిల్లలూ,
కోడళ్ళూ, వాళ్ళ పిల్లలూ అందరూ ఆమె దగ్గర వాలిపోవాల్సిందే. ఏ తల్లికి దక్కుతుంది ఇంత అదృష్టం. ఏ అత్తకు
దొరుకుతుంది ఈ భాగ్యం. తన అమ్మ భారతి గురించి నా మేనల్లుడు తుర్లపాటి పరేష్ ఫేస్ బుక్ లో రాసిన రాతలు ఇందుకు దృష్టాంతాలు.
ఇంతటి అదృష్టాన్ని హరాయించుకోలేక ఆ చిన్ని గుండె
అలసిపోయింది. కీ అయిపోయిన గడియారంలా ఈ మధ్యాన్నం ఆగిపోయింది.
మా ఏడో
అక్కయ్య తుర్లపాటి భారతికి నా కన్నీళ్ళ శ్రద్ధాంజలి.
(02-02-2022)
కింది ఫోటో: మా అమ్మతో ఆమె కన్న సంతానం ఏడుగురు ఆడపిల్లలు. ఇప్పుడు మా అమ్మతో సహా ఎవ్వరూ లేరు.
బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం, తమ వంతు పాత్ర సరిగ్గా పోషించడం - ఆ కాలపు మహిళలు చక్కగా నెరవేర్చిన విధులు. ఈనాటి స్త్రీలకు ఆ అవగాహనా లేదు, ఆ కమిట్-మెంటూ లేదు, ఆ ఉద్దేశమూ లేదు. అఫ్కోర్స్ ఈనాడు స్త్రీలు బయటపనులు కూడా చేస్తుండడం వలన ఓపికలు తగ్గినట్లున్నాయి.
రిప్లయితొలగించండిమీ అక్కయ్య గారు ధన్యజీవి. వారు కాలధర్మం చెందడం పట్ల మీకందరకూ నా సంతాపం తెలియజేస్తున్నాను. దివంగత ఆత్మకు సద్గతులు ప్రాప్తిరస్తు 🙏.
I thank you sincerely Vinnakota Narasimha Rao garu for the kind sentiments expressed
రిప్లయితొలగించండి