28, ఫిబ్రవరి 2022, సోమవారం

శివశంకర్ – ఓ జ్ఞాపకం

 


(ఫిబ్రవరి  27 వర్ధంతి)  

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియో మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రావడంలో జాప్యం జరుగుతోంది.

విషయం తెలుసుకుందామని నేనూ, అప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న శివశంకర్ ఇంటికి ఫోను చేసి వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని చెప్పారు.

ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని ఫోన్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు.

ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది. దాంతో ఆయనతో కాసేపు అవీఇవీ మాట్లాడి, ఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న జీ. రఘురాంని (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి స్నేహితులు) కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే ‘రండి రండి మీకోసమే చూస్తున్నాను, మీ ఆర్డరు రెడీగా ఉందంటూ చేతికి అందించారు.

ఆ రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి