12, ఫిబ్రవరి 2022, శనివారం

సీతమ్మ జాడ – భండారు శ్రీనివాసరావు

 స్నేహమేరా జీవితం అన్నారు. కానీ జీవితమే స్నేహం కాదు. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలకి వర్తించే నేటి వాస్తవం ఇది. రాజకీయులు కలుస్తుంటారు, విడిపోతుంటారు. వారిని కలిపినా విడగొట్టినా ఒకటే కారణం. అది రాజకీయ అవసరం.

రాముడు, ఆంజనేయుడు ఇద్దరూ పురాణ పురుషులు. వీరిలో ఒకడు దేవుడు, మరొకడు ఆ దేవదేవుడికి పరమ వీరాగ్రేశ్వర భక్తుడు. కానీ చేసిన ప్రతిన కోసం ఒకరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మరొకరు యుద్ధ భూమిలో తారసపడ్డట్టు లోగడ రామాంజనేయ యుద్ధం పేరుతో నాటకాలు ఆడారు. సినిమా కూడా వచ్చింది.
కదనరంగంలో ఎదురయిన శ్రీరాముడికి ఆంజనేయుడు ధర్మం గురించి చెప్పబోతాడు. శ్రీరాముడు తృణీకరిస్తాడు. అంతేకాదు కఠినంగా మాట్లాడి పవనసుతుడ్ని చిన్నబుచ్చుతాడు. ’ధర్మము, ధర్మమటంచు వితండ వితర్కము లాడదీవు’ అంటూ, ‘మీ కోతి లక్షణం ఎక్కడికి పోతుంద’ని శ్రీరాముడంతటివాడు కూడా మాట తూలతాడు. తన జాతిని చులకన చేయడంతో స్వామిభక్తిని కూడా మరచిపోయి ఆంజనేయుడు రెచ్చిపోతాడు.
‘కోతి కోతి’ అంటూ మా వానర జాతిని చిన్నబుచ్చడం తగదు. ఆ కోతే లేకపోతే మీరెక్కడ. మీరనే ఆ కోతే, సీతమ్మ జాడ కనుగొనక పోయివుంటే అసలు రామాయణమే లేదు, కోతులు సేతు నిర్మాణం చేయకపోతే రామరావణ యుద్ధమే లేదు, నేను సంజీవని తేకపోతే లక్ష్మణుడు స్వర్గంలో వుండేవాడు, లంకకు చేరడానికి మా సాయమే లేకపోతే రావణుడు ఇప్పటి వరకు రాజ్యంచేస్తూ వుండేవాడు’ అని ఎదురు ఎద్దేవా చేస్తాడు.
రామాంజనేయ యుద్ధం నాటకంలోని ఈ దృశ్యాన్ని దశాబ్దాల క్రితం ఊరూరా ప్రదర్శిస్తుంటే జనాలు నోళ్ళు తెరుచుకుని చూస్తుండేవాళ్ళు. ఆంజనేయ పాత్రధారి టంకసాల శ్రీరాములు, ‘సీతమ్మ జాడ మీ చెవి వేయమైతిమా నాటితో రామాయణంబు సున్న’ అంటూ తోకఝాడిస్తూ రంగస్థలంమీద గంతులు వేస్తూ పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు ఊగిపోయేవాళ్ళు.
గతకొద్ది రోజులుగా, దేశ రాజకీయాల్లో భాగంగా వివిధ పార్టీల నాయకులు విసురుకుంటున్న ఎత్తిపొడుపులు చూసేవారికీ, వినేవారికి ఇప్పుడీ ఈ ప్రస్తావన ఎందుకన్నది తేలిగ్గా అర్ధం అవుతుంది.
ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. విమర్శలు ఎంత ఘాటుగా వున్నా, ఔచిత్యం పాటించకపోతే అభిమానులు కూడా హర్షించరు. మాట తూలిన సంగతి ఒప్పుకుంటే పోయేదేమీ లేదు. పైగా హుందాతనంగా ఉంటుందని అదే నోటితో మెచ్చుకుంటారు.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం అని నేననుకోను.
‘ఎందుకలా కావాలని పేడ మీద కాలు వేశావు’ అంటే, అదే కాలుతో ఇల్లంతా రొచ్చు చేసే రోజుల్లో జీవిస్తున్నాం.


(12-02-2022)

4 కామెంట్‌లు:

  1. భండారు గారికి , మీ తూకం ఎప్పుడూ ఒక పార్టీ వైపు కొంచెం మొగ్గు ఉంటుంది అని గతం లో నేను వక్కాణించితిని .
    కానీ మీరు ఎప్పుడు బయటపడరు . ఈ వ్యాసం లో కూడా , అది ఏ పార్టీయో , ఏ నాయకులొ , ఎక్కడో కూడా తెలియదు .
    మీరు ఇలా డిప్లొమాటిక్ గా ఉండటం వలన , మీ అభిమానులం అయినా మేము కూడా ఎవరినీ తిట్టలేక , ఎవరి మీదా కత్తి దూయలేకా , నిగ్రహం తో ఉండలేక , ఆ ఆవేశం ఇంట్లో వాళ్ళ మీద చూపించి పస్తులు తో చలిలో పడుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం .

    మీరు ఇప్పటికైనా బయటకి వచ్చి , మీ అనుచరులు ని ముందే కాపాడుకొని , ఈ వయసులో మీరు ఓదార్పు యాత్ర చేయవలసిన అవసరాన్ని తప్పించుకోండి . అని ప్రార్థిస్తున్నాను .
    ఇట్లు మీ డిప్లొమాటిక్ శిష్యుడు .

    రిప్లయితొలగించండి
  2. లౌక్యం తో కూడిన జర్నలిజం వల్ల వచ్చిన అనుభవం కావచ్చు. ఉద్యోగం లో ఉన్నప్పుడు డిప్లమసీ తప్పదు. రిటైర్ అయిన తరువాత అది ఇక మారదు. ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా ఇబ్బంది ఉండదు.

    రిప్లయితొలగించండి
  3. Venkat, అజ్ఞాత గార్లకు, నమస్కారాలు.
    అన్యాపదేశంగా చెప్పడం ఒక్కోసారి డిప్లోమసి అనిపించవచ్చు. కాదనను. కత్తులు దూసేవయసు నాది కాదని అనుకుంటున్నాను. అయినా కత్తులు దూసి ఏమిటి ప్రయోజనం, మన ఈగో చల్లార్చుకోవడానికి తప్ప. ఒక్క పదం నచ్చకపోయినా కలంతో కత్తులు దూసే అభిమానులకు కొదవలేని కాలంలో జీవిస్తున్నాం అనే ఎరుక కలిగిన మనిషిని కనుక ప్రతి పదం ఎంచి ఎంచి రాయాల్సి వస్తోంది. రాజకీయం కాని సబ్జెక్టు అనుకోండి ఎక్కడా నా రాతల్ల్లో శషభిషలు వుండవు. సూటిగా సుతిమెత్తగా చెబితేనన్నా అర్ధం చేసుకుంటారని ఓ చిన్న ఆశ.
    మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు.
    అందరం మనుషులమే అనే గుడ్డి నమ్మకం నాకు. కాదంటారా! ఇక మీ ఇష్టం.

    రిప్లయితొలగించండి