7, జనవరి 2022, శుక్రవారం

మూడు "తెలుగు" కధలు - భండారు శ్రీనివాసరావు

 కలం కూలీ, ప్రముఖ పాత్రికేయులు,కీర్తిశేషులు జి. కృష్ణ ఒకప్పుడు చెప్పిన తెలుగు ముచ్చట్లు.

పూర్వపు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వున్న రోజులు. రమేశన్ అనే తెలుగు తెలిసిన తమిళ అధికారి గుంటూరు కలెక్టర్ గా వుండేవారు. తెలుగువాడు కాకపోవడం వల్ల కావచ్చు, ఆయనకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. అంచేత, జిల్లా కలెక్టర్ కి పంపుకునే ఆర్జీలను తెలుగులో పంపుకోవచ్చని ప్రకటించాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు ఈ నిర్ణయం తలవంపులుగా అనిపించి పోయి ప్రకాశం గారికి పిర్యాదు చేశారు. ఆంధ్రకేసరికి కోపం వచ్చింది. రమేశన్ ని సంజాయిషీ అడిగారు. ఆయన ఈనాటి అధికారుల కోవలోని వాడు కాదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాడు, ‘ఆంద్ర రాష్ట్రం వచ్చింది కదా. అది ఏర్పడిన సిద్దాంతం ప్రకారం ఇట్లా ప్రకటించాను’ అంటూ. మరి ఆంద్ర కేసరి కూడా ఈనాటి నాయకుల బాపతు కాదుకదా! అధికారి చెప్పింది విని, సరే అని ఒప్పుకుని, తన చెవులు కొరికిన వాళ్ళను తరువాత చెడామడా ఉతికేసాడు.

ఆంగ్లంలో పెద్ద చదువులు చదవకుండానే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసిన కృష్ణ గారికి, రమేశన్ మాదిరిగానే తెలుగు అంటే మంచి అభిమానం. కాన్వెంటు స్కూళ్ళకు ఆయన పెట్టిన ముద్దు పేరు మమ్మీ డాడీ బడులు.

ఆయన చెప్పినదే మరో తెలుగు కధ.

1990 లో కాబోలు, హైదరాబాదులోని అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయానికి దక్షిణాఫ్రికా నుంచి పీ.ఎం. నాయుడు అనే పెద్దమనిషి వచ్చాడు. ఆయన అంతదూరం నుంచి వచ్చి మన ప్రభుత్వాన్ని అడిగింది ఏమిటో తెలుసా, ‘ఒకరిద్దరు తెలుగు పండితుల్ని ఇవ్వండి, ఆఫ్రికాలో మా పిల్లలకు తెలుగు నేర్పుకుంటాము’ అని.

స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. కృష్ణ గారు అనేవారు, అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంటాబయటా తెలుగు ‘హుష్ కాకి’.

అయితే, తెలుగు భాష పరిస్తితి మునపటంత దయనీయంగా లేదు.

ఇంటర్ నెట్ ఆగమనంతో తెలుగు భాష మరో మృతభాషగా మారిపోతుందనే భయాలు వట్టివని తొందర్లోనే తేలిపోయింది. భాష బతకాలంటే కేవలం మాట్లాడితే సరిపోదు, రాయడం, చదవడం వచ్చి తీరాలి అంటారు. ఈరోజు సోషల్ మీడియాలో అలాటి చక్కదనాల తెలుగు సౌరభం వెల్లివిరుస్తోంది. తెలిసిన వారి నుంచి తెలియని వారు నేర్చుకునే వేదికగా కూడా ఈ మీడియా ఉపయోగపడుతోంది. తెలుగు భాష ఈ మాత్రం ప్రాణంతో నిలబడి ఉన్నదంటే నిజానికి బ్లాగర్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి అధునాతన మీడియాలే కారణం అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు అనేకమంది ప్రతి రోజూ తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాసింది చదువుతున్నారు. తెలుగులో అభిప్రాయాలు పరస్పరం తెలుపుకుంటున్నారు. ఇదొక శుభ పరిణామం.

అయితే ఇదొక్కటే సరిపోదు.

భాషలను, సంస్కృతులను పరిరక్షించాల్సిన బాధ్యత ఒకనాడు ప్రభువులది, ఈనాడు మాత్రం ప్రజాప్రభుత్వాలది.

ఉపశృతి: 1980 లో కాబోలు మిమిక్రీ వేణుమాధవ్ కొంతమంది కళాకారులతో కలిసి మారిషస్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించారు. అప్పుడు వారికి డర్బన్ నగరంలో ‘వరంగల్లు వీధి’ కనిపించింది. వివరం అడిగితే అక్కడివాళ్లు చెప్పారట. ఆ నగరంలో తెలుగు వాళ్ళు వుండే వీధికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండని నగరపాలక సంస్థ సూచించింది. అంతే! అందరూ కలిసి మరో మాట లేకుండా వరంగల్ పేరు పెట్టుకున్నారట.

తెలుగుతనం, తెలుగు అభిమానం చూడాలంటే ముందుముందు విదేశాలకు వెళ్ళాలేమో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి