31, జనవరి 2022, సోమవారం

నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న

 

పుస్తకం విలువ దానిని కొన్నప్పుడు పెరుగుతుంది అనేది నా నమ్మకం. నా నమ్మకంతో నిమిత్తం లేకుండా కొన్ని పుస్తకాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. అలా అని వాటి విలువ తక్కువేమీ కాదు. రచయిత సంతకం చేసి ఇచ్చిన పుస్తకం మరెంతో ప్రియమైనది. అలాంటిది రచయితే స్వయంగా వచ్చి ఇస్తే ఇక దానికి విలువకట్ట తరమా!

జీ. వల్లీశ్వర్ జగమెరిగిన జర్నలిస్టు. బహు గ్రంధ రచయిత కూడా. అమూల్యమైన ఇంగ్లీష్ పుస్తకాలను అలవోకగా అనువదించిన ఘనత ఆయన ఖాతాలో వుంది.

రాత్రి ఫోన్ చేసి ‘ఇంట్లో వున్నారా!’ అని అడిగారు. ‘కరోనా కాలంలో ఇంట్లోనే కదా!’ అన్నాను.

‘అయితే ఓ అయిదు నిమిషాల్లో వచ్చి, రెండు నిమిషాలు వుండి వెడతాను. మీకో పుస్తకం ఇవ్వాలి’ అన్నారు.

‘మీ రాక సంతోషం. పుస్తక సమేతంగా రాక మరింత సంతోషం’ అన్నాను.

అన్నట్టే వచ్చారు. అన్నట్టే పుస్తకం ఇచ్చారు. అన్నట్టే రెండు నిమిషాలు వుండి వెళ్ళిపోయారు. ఈ కొద్ది సమయంలో ఒక ఫోటో కూడా దిగాము. ఆ పుస్తకమే:

‘నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న’

పూలు, పండ్ల మొక్కల పెంపకానికి వల్లీశ్వర్ ఇచ్చిన ప్రాధాన్యత ఈ టైటిల్ లో కనబడింది.

నర్సరీని సామ్రాజ్యంగా అభివర్ణించి పల్ల వెంకన్నను దానికి రారాజును చేసేశారు.

చాలామంది చాలామందిని గురించి పుస్తకాలు రాస్తారు. కొన్ని చదివిన తర్వాత పుస్తకాలు రాయదగ్గ గొప్పతనం ఏముంది వీరిలో అనిపిస్తుంది.

పల్ల వెంకన్న గురించి వల్లీశ్వర్ రాసిన ఈ పుస్తకం చదివిన తర్వాత ఈయన గురించి ఇంత మంచి పుస్తకం ఇంతదాకా  ఎందుకు రాలేదు అనిపించింది.

పూల మొక్కల్ని పెంచేవారికి ఆ పూలంత మృదువైన మనసు వుంటుంది. వెంకన్న గారికి ఈ వెన్నలాంటి మనసు బోలెడు వుంది.

పూల మొక్కలు, పండ్ల మొక్కలు అనగానే తటాలున గుర్తొచ్చే పేరు కడియం. ఆ కడియం పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు పల్ల వెంకన్న. కృషి వుంటే అనే పాటకు పల్లవి లాంటి మనిషి పల్ల వెంకన్న. పోలియోతో చిన్నతనంలోనే రెండు కాళ్ళు చచ్చుపడ్డా, ఆయనలోని పట్టుదల చచ్చుపడలేదు. మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మొక్కలనే  ఆయన తన ప్రపంచం చేసుకున్నారు. మొత్తం ప్రపంచం దృష్టి తనవైపు మళ్లేటట్టు ఆరుగాలం శ్రమించి, వంద ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద నర్సరీని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేశారు. వెంకన్న గారి విజయ రహస్యం వల్లీశ్వర్ మాటల్లో, అదీ ఒక్క ముక్కలో:

“ఆయన (పల్ల వెంకన్న) ఒళ్ళొంచి పని చేస్తాడు, ఒళ్ళొంగని వాళ్ళ చేతకూడా పనిచేయిస్తాడు”

ప్రచురణ: ఎమెస్కో  మూల్యం : రు. 175/-  

ఇలాంటి వ్యక్తి గురించి పుస్తకం రాసి వల్లీశ్వర్ ధన్యులు అయ్యారు. ఈ పుస్తకాన్ని అందంగా అతి ఖరీదైన కాగితం మీద ముద్రించి ఎమెస్కో వారు ధన్యులు అయ్యారు.






(31-01-2022)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి