14, జనవరి 2022, శుక్రవారం

సంక్రాంతికి సొంతూరుకు – ఓ జ్ఞాపకం

 పండక్కి సొంత ఊరుకు వెళ్లాలని ఎంతగా వున్నా కాచుకుని ఉన్న కరోనా భూతం ముందరి కాళ్ళకు బంధాలు వేసింది. అందుకే ఎప్పటి అనుభవాలనూ నెమరు వేసుకుంటూ తృప్తి పడడమే మిగిలింది.

నాలుగేళ్ల క్రితం సంక్రాంతికి సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో హైదరాబాదులో ఉంటున్న మా కుటుంబ సభ్యులం  అందరం నాలుగు కార్లలో ఉదయమే బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే బయటపడ్డాము. మేమే కాకుండా ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా యాభయ్, అరవై మందిమి మా వూరికి సంక్రాంతి అతిధులం.

ఆ రాత్రి అక్కడ నిద్ర చేసాం. అర్ధరాత్రి వరకు ఆడవాళ్ళు అందరూ రంగవల్లులు దిద్దుతూనే వున్నారు. ఎంత ఓపికో వారికి.

తెలతెలవారవస్తోంది. పక్కన శివాలయం మైకులోంచి బాలసుబ్రమణ్యం శివస్తుతి బిగ్గరగా వినవస్తోంది. ఇల్లు ఇల్లంతా నిద్ర పోతున్నవారితో నిండిపోయివుంది. ఊరేలా మారిందో కళ్ళారా చూడాలనే కోరిక చలిని జయించింది. నిద్ర మంచం మీద నుంచి లేచి వీధిలో కాలుపెట్టాను. వూళ్ళో వున్నవే మూడు వీధులు. అవన్నీ ముగ్గుల దుప్పట్లు కప్పుకుని కానవచ్చాయి.

చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో నడుచుకుంటూ చెరువు గట్టుకు చేరాను. మంచినీళ్ళ బావికి వున్న ఇనుప గిలకలు పూర్వపు ఔన్నత్యానికి గుర్తుగా మిగిలివున్నాయి. మోటారు పెట్టి నీళ్ళు తోడి ఊరి నడుమ నిర్మించిన మంచినీళ్ళ  ట్యాంకును నింపుతూ వుండడం వల్ల  ఆ గిలకల ఉపయోగం లేకుండా పోయింది. చెరువు గట్టు మీద జేసీబీలు, ట్రాక్టర్లు ఇంకా భారీ యంత్రాలు కానవచ్చాయి. గట్టును వెడల్పు చేసి గట్టి పరచడం కోసం ఒక వైపున ఇరవై అడుగుల రిటైనింగ్ వాల్ నిర్మాణంలో వుంది. లింగాల నుంచి కంభంపాడు వరకు నిర్మాణం పూర్తయిన అరవై అడుగుల వెడల్పు రహదారిలో ఇదొక భాగం. వాటిని చూస్తూ గట్టు చివరివరకు పోయి తిరిగి వస్తుంటే చలి కోటు కప్పుకున్న ఒక మనిషి ఎదురు పడ్డాడు. తెల్లటి తొలివెలుగులో నల్లటి రూపం కనిపించింది. తాగుతున్న బీడీ విసిరివేసి నా మొహంలోకి తేరిపారచూసాడు. ‘మీరు కరణంగారి తమ్ముడు కదూ’ అన్నాడు. ఇన్నేళ్ళ తరవాత కూడా వూళ్ళో నన్ను గుర్తు పట్టేవాళ్ళు వున్నారని సంతోషించాను. ‘నాకు తెలిసిపోయింది, మీరు భండారు శ్రీనివాసరావు గారు’ అనేశాడు ఇంటిపేరులో ఉన్న ‘భ’ ని ఒత్తిపలుకుతూ.

మిమ్మల్ని సాక్షి టీవీలో చూస్తుంటాను’ అన్నాడు మరే టీవీలో కనబడనట్టు. ‘మీకు గుర్తుందో లేదో నేను, యేసు రత్నాన్ని. మీ అన్నయ్య గారితో కలిసి చదువుకున్నాను, మీ ఇంటికి వచ్చేవాడిని, అయినా మీరు వూళ్ళో ఎప్పుడు వున్నారు కనుక’ అని కూడా ముక్తాయించాడు.

నేనిక్కడ వాచ్ మన్ని. ఇవిగో వీటన్నిటినీ నేను కనిబెడుతుండాలి’ చెప్పాడు గట్టు మీది యంత్రాలను గర్వంగా చూపెడుతూ.

ఇన్ని ఏళ్ళ తరువాత గుర్తు పట్టిన ఆ పెద్దమనిషిని గుర్తు పెట్టుకునే ఫోటో తీసుకోవాలని అనిపించింది. తీసే వాడు ఎవరా అని ఆలోచిస్తుంటే ఒక ట్రాక్టరు కింద నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు.

రాం సింగ్. వీళ్ళది జార్ఖండ్. జేసీబీ పనిచేస్తాడు.’ అని పరిచయం చేసాడు యేసు రత్నం. ఆ జార్ఖండ్ కుర్రాడు మా ఇద్దర్నీ ఫోటోలు తీశాడు. వాళ్లకి థాంక్స్, సంక్రాంతి శుభాకాంక్షలు జమిలిగా చెప్పేసి మళ్ళీ ఊళ్ళోకి వచ్చాను. దగ్గరలోనే మునసబు మల్లయ్య గారిల్లు. ఇప్పుడు లేరు. ఆయన కొడుకు ప్రతాప్ ఆ ఇంట్లో ఉంటున్నాడు. చాలా ఏళ్ళ క్రితమే, వూళ్ళో ఉన్న ఇతర ఖామందుల ఇళ్ళకు భిన్నంగా రెండతస్తుల భవంతి కట్టించాడు. ఇప్పుడు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లో కనబడే పెద్ద పెద్ద అధునాతన భవనాలవంటివి నా గ్రామ సందర్శనలో రెండు మూడు కనిపించాయి.

వాసిరెడ్డి జమీందారు కట్టించిన గుడికి మా వంశస్తులు ధర్మకర్తలు. భక్తి ఉన్న చోట సంపద వర్ధిల్లుతుందో, ధనధాన్యాలు సమృద్ధిగా వుంటే భక్తిప్రపత్తులు పెరుగుతాయో తెలియదు కానీ చాలాకాలం నిత్య ధూపం కూడా గగనం అనుకున్న ఆ గుడి పరిస్తితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. దానికి దాపుల్లోనే మరో దేవాలయం రూపుదిద్దుకుంది. మరో రెండు నెలల్లో విగ్రహ ప్రతిష్ట అంటున్నారు. ముందు ముందు మా గ్రామానికి ఒక చక్కటి ఆకర్షణ కాగల ఈ రామాలయాన్ని చావా నరసింహారావనే పెద్దమనిషి నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా యాభయ్ లక్షలు అయ్యాయట.

ఇక మా ఇంట్లో సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు కొంగులు దోపుకుని అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. మర్నాడు అందరం కలిసి వెళ్లి ఎస్సీ కాలనీలోని మా రెండో అన్నయ్య ధర్మకర్తగా ఉన్న పూర్వీకుల శివాలయాన్ని, మా తోటలో మామూడో అన్నయ్య వెంకటేశ్వరరావుగారు నిర్మించిన మా ‘అమ్మా నాన్నల గుడి’ని దర్శించాము. ఆ పక్కనే మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గార్ల స్మారక స్తూపాలు వున్నాయి. చుట్టూ పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.

వూళ్ళో ఉన్న రెండు రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.

మొత్తానికి పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!



(2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి