29, జనవరి 2022, శనివారం

కొత్తా జబ్బులండీ ...... భండారు శ్రీనివాసరావు

 (కరోనా అనే పేరు కూడా ప్రపంచానికి తెలియని రోజుల్లో, 2018లో రాసింది.

నా వృత్తి జర్నలిజం గురించి గతంలో ఎన్నో విమర్శనాత్మక పోస్టులు పెట్టాను. ఇతర వృత్తుల వారిని కూడా ఇదే స్పూర్తితో  స్వీకరించమని కోరుతున్నాను)

 

బ్రహ్మలోకంలో దేవుడుగారు కొలువు తీరాడు. భటుడుగారు ప్రవేశించి, నడుము వరకు వొంగి వినయంగా నమస్కరించి చెప్పాడు. 'స్వామీ! ఒక మానవాధముడు తెల్లని ఉడుపులు ధరించి వచ్చాడు. శివుడి మెడలో నాగుపామును బోలిన ఒక వస్త్ర విశేషము అతడి మెడలో కూడా వేలాడుచున్నది. అనుమతించిన లోపలకు తోడ్కొని వత్తును'

దేవుడు అంతఃచక్షువుతో పరికించి చూశాడు. తోలుపటకా సంచీతో దిక్కులు చూస్తున్న మెడికల్ రిప్రెజెంటేటివ్ కానవచ్చాడు. అతడిని చూడగానే బ్రహ్మగారికి తన శిరోవేదన జ్ఞాపకం వచ్చింది. తక్షణం ప్రవేశపెట్టడమే కాకుండా సభలో వున్న యావన్మందినీ బయటకు పంపేయమని ఆజ్ఞాపించాడు.

మె.రి. దిక్కులు చూస్తూనే లోపలకు వచ్చాడు. వస్తూనే దేవుడు గారు తలనొప్పితో బాధపడుతున్న విషయం చిటికెలో గ్రహించాడు. పటకా సంచీ తెరిచి మందుల శాంపిల్స్ అన్నీ దేవుడుగారి ఆసనం ముందు పరిచాడు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మందుల్లో తలనొప్పి గోలీ వుందని, అది రాత్రి వేసుకుని పొద్దున్న లేస్తే, నొప్పి సరే, తల వుందన్న సంగతి కూడా గుర్తుకురాదనీ విరించికి వివరించి చెప్పాడు. మాత్ర వేసుకోగానే నొప్పి మాయం, గాయబ్ అంటూ సంస్కృతంలో ఏమంటారో తెలియక ఆగిపోయాడు.

బ్రహ్మగారు మూడు తలలు పంకించి మందహాసం చేశారు. మూడు తలలతో ఆలోచించాడు. మనవాడు వుత్తుత్తిగానే ఇంతదూరం రాలేదనీ. ఏదో కారణం ఉండేవుంటుందని గ్రహించినవాడై, అదేదో చెప్పమని సూటిగా అడిగాడు.

మె.రి. భేషజాలకు పోకుండా వున్నవిషయం చెప్పాడు.

'మీరు పరబ్రహ్మ మూర్తులు. మీ రాతకు తిరుగులేదు. అలాఅని అర్ధం కూడా కాదు. అందుకే బ్రహ్మరాత అంటారు. మీలాంటి వాళ్ళు మాలోకంలో కూడా వున్నారు. కాకపొతే వాళ్ళని డాక్టర్లు అంటారు. వారి దస్తూరీ మెడికల్ షాపుల వాళ్లకు తప్ప వాళ్ళ పెళ్ళాలకు కూడా అర్ధం కాదని బోలెడు జోకులు ప్రచారంలో వున్నాయి. అయినా వాళ్ళు మా కంపెనీ మందులు రాయకపోతే మేము విషం మందు మింగి చావాలి. మా బతుకులు వారి రాతతో ముడిపడివున్నాయి. వాళ్ళు అలా మందులు రాస్తూనే వుండాలి. జనాలు వాటిని కొని మింగుతూనే వుండాలి. మరి రాయాలంటే ఉత్త మందులు వుంటే సరిపోదు, వాటికి సరిపడా రోగాలు కూడా వుండాలి. వీటిని ఇతోధికంగా పెంచడానికి మా వంతు తిప్పలు మేము పడుతూనే ఉన్నాము. కానీ మా ప్రయత్నాలు సరిపోవడం లేదు. కాబట్టి మీరు సృష్టి కార్యంతో పాటు, పెద్ద మనసు చేసుకుని అలాగే మరో చేయి చేసుకుని మరి కొన్ని కొత్త జబ్బులను కూడా సృష్టించి భూమ్మీదకు వదిలితే కాని మా ఉద్యోగాలకు భరోసా వుండదు. కావున ఓ దేవదేవా! కాసింత ఈ సాయం కానీ చేస్తివా, మీ మేలు మా మందుల కంపెనీల వాళ్ళు మరచిపోరు. మీ శ్రీమతి గారికి, లక్ష్మీదేవి గారితో సమానంగా ఏడువారాల నగలు చేయించి పెడతారు. ఇక మీకంటారా మూడు తలలకూ నిఖార్సయిన బంగారు తొడుగులు వేయిస్తారు. భూలోకంలో మీకు గుళ్ళు ఎలాగూ లేవు, అంచేత మీ లోకంలోనే ఆ భోగాలన్నీ అందిస్తారు.”

మె.రి. ఇచ్చిన శాంపిల్ గోలీతో బ్రహ్మగారి ‘తలల’ నొప్పి తగ్గింది.

కానీ భూమ్మీద కొత్త కొత్త రోగాల నొప్పి జనాలకు మొదలయింది.

(2018)

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి