"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అలా పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " – కీర్తిశేషులు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఒకనాటి అనుగ్రహభాషణ.
మనకు ఉన్న
దాంట్లో, అవసరం వున్న వాళ్లను కొంచెం
ఎక్కువ కనిపెట్టి చూడడం అనేది మహాభారత కాలం నుంచి వుంది.
కౌరవులు
కుట్రచేసి పాండవులను లక్కఇంట్లో కాల్చి చంపాలని చేసిన ప్రయత్నంలో, సొరంగ మార్గం
ద్వారా తప్పించుకున్న పాండవులు, కుంతీ సమేతంగా
కొంతకాలం అరణ్యవాసం చేసి, తర్వాత ఏకచక్రపురం చేరుకొని బ్రాహ్మణ వేషాలతో తిరుగుతూ యాచన ద్వారా సమకూరిన భోజన పదార్ధాలను
తల్లి కుంతీదేవికి తెచ్చి ఇస్తుంటారు. తల్లి మనసుకు భీముడి తిండిపుష్టి తెలుసు
కనుక, తెచ్చిన వాటిని రెండు భాగాలు
చేసి ఒక భాగాన్ని భీమసేనుడికి, మిగిలిన సగభాగాన్ని తనకు, నలుగురు అన్నదమ్ములకు పంచి ఇచ్చేదని పౌరాణికులు చెబుతూ వుంటారు. సరే ఇది పక్కన పెడితే.
‘మీరు
సంపన్నులు. ప్రభుత్వం వంటగ్యాసు సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ మీకు అవసరంలేదు. దేశంలో
అందరూ మీలా సంపన్నులు కారు. కట్టెలపొయ్యి ముందు కూర్చుని, పొగచూరిన కళ్ళతో ఇంటిల్లిపాదికీ
వంట చేసిపెట్టే పేద తల్లులకు ఈ దేశంలో కొదవ లేదు. వారి కష్టాలు తీర్చాలంటే మీరు
కొంత త్యాగం చేయాలి. చేయాలి అంటే గ్యాస్ సబ్సిడీ
వదులుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓ పేద కుటుంబానికి వంటగ్యాసు సదుపాయం లభిస్తుంది.
దయచేసి ఈ పుణ్యం కట్టుకోండి’
నరేంద్రమోడీ
ప్రధాన మంత్రి పదవిని స్వీకరించిన కొత్తల్లో
దేశంలోని సంపన్న వర్గాలకు చేసిన విజ్ఞప్తి ఇది.
ఎప్పుడో దశాబ్దాల
క్రితం పరమాచార్యుల వారు, ఏడేళ్ల క్రితం నరేంద్ర మోడీ
చేసిన ఈ వినతులకు సంపన్నవర్గాల నుంచి
లభించిన స్పందన అంతంత మాత్రమే కావడం విచిత్రం.
దీనికి
ప్రధాన కారణం మానవ మనస్తత్వం, ముఖ్యంగా మధ్య తరగతివారి ఆలోచనా ధోరణి. ఈ మధ్య తరగతి
వారిలో ఎగువ, దిగువ అని మరో రెండు రకాలు ఉన్నప్పటికీ, మనస్తత్వం మాత్రం ఒక్కటే.
పేరుకు
సబ్సిడీ అయినా వంట గ్యాస్ ధరపై ఈ సబ్సిడీ రూపంలో వినియోగదారుడికి చెల్లు పడుతోంది
చాలా చాలా తక్కువ మొత్తం. ఇళ్ళల్లోవాడే గ్యాస్ సిలిండర్ తాజా ధర 908 రూపాయలు కాగా , సబ్సిడీ కింద బ్యాంకు ఖాతాలో తనకు జమ చేసింది కేవలం 3.95 రూపాయలు మాత్రమే అనే పోస్టు సాంఘిక మాధ్యమాల్లో చూశాను. సిలిండర్ మోసుకుని ఇంటికి తెచ్చిన వాడికి ఇచ్చే
బక్షీసు ఇరవై వుంటుంది. ఒక్క నాలుగు
రూపాయల కోసం సబ్సిడీని వదులుకోలేని మనస్తత్వం ప్రజలది. ఇందుకు ఈ రచయిత కూడా
మినహాయింపు కాదు. దేన్నీ తేలిగ్గా వదులుకోలేని తత్వం ఇందుకు కారణం. పైగా సబ్సిడీ వదులుకోవడానికి
ఆఫీసుల చుట్టూ తిరగనక్కరలేదు. చేతిలో వున్న మొబైల్ లో గివ్ ఇట్ అప్ అనే ఒక బటన్
నొక్కితే చాలు. సబ్సిడీకి మంగళం పాడవచ్చు.
క్లిష్టతతోకూడిన విషయం కనుక కొన్ని
గణాంకాలు ఉదహరించక తప్పడం లేదు.
దేశం మొత్తంలో సబ్సిడీ వంట గ్యాస్
ఉపయోగించే వినియోగదారులు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల మంది వున్నారు. వీరిలో
కోటిన్నరమంది వార్షిక ఆదాయం పది లక్షల రూపాయలు ఉన్నందున వారికి సబ్సిడీ వర్తించదు.
పొతే, మిగిలిన ఇరవై ఆరుకోట్ల పైచిలుకు వినియోగదారులు సబ్సిడీకి అర్హులు. మళ్ళీ
వీరిలో మరో పద్దెనిమిది కోట్ల మందికి ఎలాంటి సబ్సిడీ అందడం లేదు. సబ్సిడీ సిలిండర్
ధరకు, మార్కెట్ ధరకు మార్కెట్లో పెద్ద వ్యత్యాసం లేకుండా పోవడం
ఇందుకు కారణం అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో ఇక గ్యాస్ సబ్సిడీలు
ఉండకపోవచ్చు. మనకు తెలియకుండానే అవి దూరం కావచ్చు.
అయితే ఇలా ఆదా అయిన మొత్తాన్ని(ఇరవై
వేల కోట్ల రూపాయలు అని అంచనా) కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలకు మళ్లిస్తోంది.
అక్షరాలా తొమ్మిది వేల ఏడువందల కోట్ల రూపాయల పై చిలుకు మొత్తాలను దేశ వ్యాప్తంగా
ఎనిమిది కోట్ల మంది పేద వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం కూడా
జరిగిపోయింది. కోవిడ్ సంక్షోభంలో దెబ్బ తిన్న పేదలకు మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే నిమిత్తం ఈ మొత్తాన్ని
వినియోగించారు.
నిజమే.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన
దేశాల్లో కూడా ఈ సబ్సిడీ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా
అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే
స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యం, అనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి.
అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలు, ఆరోగ్య సబ్సిడీలు ఘనంగానే
ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా దేశాల ప్రజలు స్వచ్చందంగా
పాటించే కొన్ని నియమ నిబద్ధతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు.
సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి సమాజాలను వారు సృష్టించుకున్నారు.
సంక్షేమ పధకాలకోసం ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు సంపన్నులకోసం కాకుండా
ఆపన్నులకోసం ఖర్చు చేయాలని ఆశించేవారు ఆదేశాల్లో అధికంగా వుండడం దీనికి కారణం. మన
దేశంలో పరిస్తితి దీనికి పూర్తిగా భిన్నం. సబ్సిడీ బియ్యం నుంచి ఆరోగ్యశ్రీ
కార్డు వరకు ఇదే తంతు. అన్ని రకాల సబ్సిడీలు ఆదాయాలతో నిమిత్తం లేకుండా తమ ఒళ్ళో
వచ్చి పడాలని కక్కుర్తిపడేవారే ఎక్కువ.
మరో
విచిత్రం అయిన విషయం ఏమిటంటే, ఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల
రెట్లు అమ్మకం ధర వుండే వస్తుసామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు
ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా నానా
కాకి గోల చేస్తుంటారు.
ఆర్ధిక
వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలు కొన్ని కఠినమైన నిర్ణయాలు
తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు
కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. వాటి
ప్రచారానికి అట్టహాసంగా ఖర్చు చేయకూడదు. ‘సబ్సిడీ వదులుకోవాలని పిలుపు బడా
నాయకుల ఇళ్ళల్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదు’ అనే విషయం తెలుసుకోగోరే
వారుంటే, అలాటి
వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి సందేహాలను నివృత్తి చేయగలిగితే
మరింత బాగుంటుంది కూడా.
గతంలో లాల్
బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల
కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం
చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన
బతికున్నంతవరకు పాటించారు.
తమ
భవిష్యత్తు గురించి ఆలోచించే రాజకీయ నాయకులు దేశంలో పుష్కలంగా
వున్నారు. రేపటి గురించి, జాతి
భవిష్యత్తు గురించి ఆలోచించే రాజనీతిజ్ఞులే క్రమంగా కనుమరుగయిపోతున్నారు.
ఇదొక
విషాదం.
తోకటపా:
ఇది రాస్తున్నప్పుడు మా అపార్ట్ మెంటు గ్రూపు మెసేజ్ వచ్చింది. ఇరవై లీటర్ల మంచి
నీళ్ళ కోసం ఆధార్ ఇవ్వాలని, వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చారని.
అందరూ బిలబిలమని వెళ్ళారు. దేశం సర్వనాశనం కావడానికి ఫ్రీ బీస్ ప్రధాన కారణమని
వీళ్ళే మళ్ళీ పోస్టులు పెడుతుంటారు.
రాజకీయ
పార్టీలు ప్రకటిస్తున్న లేదా ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు అన్నీ అర్హులకు
అందినంతవరకు అంత అనుచితమైనవి ఏవీ కావు. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వాడుకుంటే నిధులు పక్కదారి మళ్ళడం అంటూ వుండదు.
సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన వ్యక్తికి పొరపాటుగా మూడు రూపాయలు వచ్చి ఉండవచ్చు, సబ్సిడీ మాత్రం 300 రూ పైనే ఉంటుంది. మూడు రూపాయలు అయితే ప్రధానమంత్రి అంతగా అడిగేవారు కాదు. ఆన్లైన్ లో చెల్లింపులు చేసేవారు మూడు రూపాయలు వదులుకోడానికి బాధ పడతారని అనుకోను.మీతో సహా !
రిప్లయితొలగించండి