గత పది రోజుల్లో చాలా విశేషాలు జరిగాయి. అందులో ఒకటి కరోనా వచ్చి నాతొ నాలుగు రోజులు సహజీవనం చేయడం.
దీనికి
ముందు మరి కొన్ని జరిగాయి. మా కోడలుకు కరోనా. ఆ అమ్మాయి వెంటనే చేసిన పని
వంటమ్మాయిని, పని
అమ్మాయిని మళ్ళీ చెప్పినదాకా ఇంటికి రావద్దని
చెప్పడం.
వున్న
మూడు గదుల్లో ముగ్గురం చేరిపోయాం. అందులో
ఒకటి బెడ్ రూమ్ కాదు,
వాళ్లు వర్క్ ఫ్రం హోం చేసుకునే గది.
‘భయపడవద్దు!
భయపెట్టవద్దు!’
మొదటి
రోజే మా వాడు ఈ మాట చెప్పేశాడు.
‘ఇది ఇంట్లో అందర్నీ చుట్టబెడుతుంది. కానీ కంగారేమీ లేదు. మనకు మనమే దీన్ని
ఎదుర్కుందాం’ అని.
ఓ మూడు
రోజులు వాడు వంట పని నెత్తికి ఎత్తుకున్నాడు. కోడలుకు నాలుగో రోజు నెమ్మదించింది.
ఆ వెంటనే మా వాడికి అంటుకుంది. పాపం ఆ అమ్మాయి వేళకు ఇంత అన్నం వండి పెట్టే బాధ్యత
తీసుకుంది. నాకా స్టవ్ వెలిగించడం కూడా రాదు. నేను వెంటనే స్విగ్గీకి మారిపోయాను, కరోనా నుంచి కోలుకుంటున్న అమ్మాయిని
ఇబ్బంది పెట్టడం ఎందుకని.
నాలుగోనాడు, మా వాడి గది నుంచి బయటకు వచ్చిన
కరోనాకు, గదిలో ఒంటరిగా కంప్యూటర్ ముందు
కూర్చొన్న నేను కనిపించాను. నాకు చీకట్లో
రెండు కళ్ళు మెరుస్తూ కనిపించాయి. పిల్లి కాబోలు అనుకున్నా. కానీ వచ్చింది
పులే అన్న సంగతి మర్నాడు ఉదయానికి కానీ తెలియలేదు.
ఇప్పుడు
ఎలా! అపోలోలో పనిచేసే మా ఆవిడ అక్కయ్య
కొడుకు డాక్టర్ బాబీకి ఫోన్ చేశాను. ఏం భయం లేదు, ఈ మాత్రలు తెప్పించి ఇలా వాడండి అని
ఫోనులోనే చెప్పి మళ్ళీ వివరంగా మెసేజ్ పెట్టాడు.
వాట్సప్ పెడితే మందులు ఇంటికి పంపడం మా మెడికల్ షాపు అనిల్ కు అలవాటే.
పనివాళ్లు
లేరు. గదిలోకి వచ్చేవాళ్ళు లేరు. పిల్లలకి బాగా లేనప్పుడే స్విగ్గీ ఆర్డర్ ద్వారా తెప్పించుకోవడం
మొదలయింది. డాక్టర్ ఫోన్లో అందుబాటులో
వున్నాడు. నేను బయట ఎక్కడో ఆసుపత్రిలో లేను. పిల్లలు పక్క గదిలోనే వున్నారు. రెండో
వేవ్ అప్పుడే మా వాడు ఆక్సిజన్ సిలిండర్, ఆక్సీ మీటర్లు, బ్రీతింగ్ ఎక్సర్
సైజ్ కిట్లు కొనేసి ఇంట్లోనే వన్ బెడ్
హాస్పిటల్ సిద్ధంగా ఉంచాడు. ఇక ఏమిటి భయం!
‘తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు’.
ఒంటరిగా
వుండడం మూడేళ్ళుగా అలవాటే! తోడుగా ఎదురుగా
గోడ మీద మా ఆవిడ ఫోటో.
కాలక్షేపానికి
లోటు లేదు. పక్కనే లాప్ టాప్. టీవీ, అడిగిన పాత తెలుగు సినిమా
పాటలు వినిపించే అలెక్సా. కిటికీ నుంచి
పగలు కనిపించే పచ్చని చెట్టు. ఎప్పటి మాదిరిగానే రోజూ ఫోన్లు చేసి పిచ్చాపాటీ
మాట్లాడే ఫ్రెండ్స్. కరోనా మీద కత్తి
దూయడానికి కడుపులో మూడు డోసులు అదనం. సీరియస్ అయ్యే అవకాశం లేదని డాక్టర్ ఉవాచ.
అంచేత,
నా గదిలోకి వచ్చింది పులి కాదు, పిల్లి అని నాకు నేనే భరోసా ఇచ్చుకున్నాను. అది కూడా నా లెక్కలేనితనం
చూసి చిన్నబుచ్చుకున్నట్టుంది. తనదారి తాను చూసుకుంది. ఏమీ హడావిడి చేయకుండా
వెళ్ళింది అంటే అది పిల్లి అయినా కావాలి లేదా బూస్టర్ ప్రభావం అయినా కావాలి.
మా
వాళ్ళు ఫోన్ చేస్తూనే వున్నారు
పిల్లలు ఎలా వున్నారని. నా సంగతి
చెప్పలేదు.
ఏదైతేనేం!
ఇప్పుడు ఆల్ ఓకేస్!
దీనితో
ఒకటే ఇబ్బంది. చాలా చిరాకు అనిపిస్తుంది. తప్పదు. దాన్ని అధిగమించడానికి చాలా
కష్టపడాల్సి వచ్చింది.
ప్రతి
కధకు ఒక నీతి వుంటుంది. ఇందులో ఏమిటంటే :
‘కరోనాకు
భయపడవద్దు. గాభరా పడవద్దు,
ఇతరులని పెట్టవద్దు. కొన్ని జాగ్రత్తలతో ఈ పులిని పిల్లిగా మార్చవచ్చు’
తోకటపా! ఈ మధ్య ఓ స్నేహితుడు ఫోన్ చేసి అడిగాడు, ఏమిటి రోజుకు రెండు మూడు పోస్టులు
పెడుతున్నావు అని. పైగా సుదీర్ఘ సుత్తులు
అంటూ ముక్తాయింపు.
కరోనాతో
సహజీవనం చేస్తూ ఈ కాలక్షేపం ఎంచుకున్నానని
అతడికి తెలియదు.
(24-01-2022)
Wish you good health
రిప్లయితొలగించండిమీరు వాడిన మందులురెడీ రిఫరెన్స్,SOS, కోసం
రిప్లయితొలగించండిపెడితే బాగుంటుంది శ్రీనివాసరా రావు గారు. just
for precautionary purpose.