2, డిసెంబర్ 2021, గురువారం

'దడిగాడు వాన విదిచ’ – భండారు శ్రీనివాసరావు

 

సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా మా వాడి థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.
కాకపోతే, ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు మా వూళ్ళో పార్ట్ టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు. వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన, వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్‌ అని భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?' అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే ‘చదివినవాడు గాడిద’ అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం. కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.

Top of Form

Bottom of Form

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి