13, నవంబర్ 2021, శనివారం

తనదాకా వస్తే కానీ..

 మనిషి కురచగా వున్నా మనసు విశాలంగా వుండాలని అంటారు.

నా బాల్య మిత్రుడు ఒకరు చాలా ఏళ్ళ తర్వాత  ఫేస్ బుక్ ద్వారా మళ్ళీ కాంటాక్టు లోకి వచ్చాడు. దేశాలు తిరిగి వచ్చిన అనుభవం అతడికి  వుంది. అయినా ఆలోచనలు, భావాల్లో మార్పు లేదు. తన మతం అంటే ఎనలేని గౌరవం. తప్పులేదు.  కానీ పరాయి మతాలూ అంటే తగని ద్వేషం.  క్రైస్తవులను కావాలని కిరస్తానీవాళ్ళు  అంటాడు. ముస్లిం లను తురకోళ్ళు అంటాడు. ఇది సభ్యత కాదని చాలా సార్లు చెప్పాను. అయినా వినిపించుకోలేదు.

కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ లో అతడి పోస్టులు లేవు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆరా తీస్తే తెలిసింది. అతడి ఇద్దరి పిల్లలు అమెరికాలో వుంటున్నారు. కొడుకు క్రైస్తవమతానికి  చెందిన అమ్మాయిని, కుమార్తె ఆఫ్రికన్ అమెరికన్  (ముస్లిం) అబ్బాయిని   ఆ దేశంలోనే వాళ్ళ మతాచారాల  ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తలితండ్రులను పిలిపించుకుంటే వెళ్లి వచ్చారు. అప్పటి నుంచీ  ఇతర మతాల పట్ల  అక్కసుతో కూడిన అతడి పోస్టులు కనబడడం లేదు.

మనం మనలాగా జీవిస్తే ఎవరికీ ఇబ్బంది వుండదు, అందరూ మనలాగే వుండాలని అనుకుంటేనే  ఎదురు దెబ్బలు తగులుతాయి.

అతడి పిల్లలు చేసిన పనిని నేను సమర్థించడం లేదు.  సాటి మానవుల విషయంలో  నా స్నేహితుడి ప్రవర్తన పట్లే నా అభ్యంతరం.

(13-11-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి