26, నవంబర్ 2021, శుక్రవారం

కాణీ ఖర్చులేని ఎనర్జీ టానిక్!- భండారు శ్రీనివాసరావు

 

రాత్రి పది గంటల సమయంలో మా కోడలు (ఇప్పుడు నా కోడలు అనాలేమో, తను లేదుగా) నా గదిలోకి వచ్చింది, రావచ్చా అని అడుగుతూనే.  ఆ సమయంలో ఎప్పుడూ రాని మనిషి రావడం నాకు ఆశ్చర్యం అనిపించింది. తనకు తెలుగు రాదు. నాకు ఆమెకు అర్ధం అయ్యే రీతిలో మాట్లాడగలిగే స్థాయిలో  ఇంగ్లీష్ రాదు. మా మధ్య సంభాషణ తెలుగులో జరిగి వుంటే, అది  ఇలా వుండేది. (నిజానికి ఇదంతా ఇంగ్లీష్ లోనే సాగింది, భాషకు భావం ప్రధానం అనే రీతిలో. అది వేరే మాట)

“భోజనం అయ్యిందా పాపా!”

“లేదమ్మా! ఏం”

“వంటమ్మాయి పొరబాటున పొద్దుటి పెరుగు గిన్నె మీ గదిలో పెట్టి పోయింది. ఇది ఈ పూట తోడుకున్నది”

“సరే! అమ్మా! థాంక్స్!  అక్కడ పెట్టి వెళ్ళు. అయినా ఒక్క పూటకు సర్డుకుంటే  ఏమవుతుంది!”

వెంటనే వెళ్లకపోవడం చూసి అడిగాను నేనే.

“ఏమిటమ్మా! ఏమిటి సంగతి?” ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా!”

“అమెరికాలో థాంక్స్ గివింగ్ డే. వాళ్లకు లాంగ్ వీకెండ్. అంచేత మాకిక్కడ పెద్దగా ఆఫీసు పని వుండదు. కాల్స్ వుండవు. రేపూ ఎల్లుండీ కూడా ఖాళీనే”

మౌనంగా వింటున్నాను.

“అవును కానీ పాపా! చాలా రోజులుగా చూస్తున్నాను. మీరు చాలా సమయం ఒంటరిగా మీ గదిలోనే  వుంటున్నారు. బయటకే రావడం లేదు. ఏదో రాసుకుంటూ వుంటారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకుంటాను”

డెబ్బయి ఆరో ఏడు నడుస్తోంది. ఈ వయసులో వెనక్కి చూస్తూ ముందుకు నడవడమే. అంటే గత అనుభవాలే దిక్సూచి. వాటిని రాసుకుంటూ, వాటిని తలుచుకుంటూ రోజులు గడపడమే పని.

“వున్న ముగ్గురం మధ్యమధ్య కలిసి కూర్చుని రోజులో కాసేపు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా!” అన్న నిషా మాటకి ఆశ్చర్యంగా తలెత్తి చూశాను.

“మంచి ఐడియా! నేనే అందామనుకున్నాను”

“నిజానికి మధ్యాన్నం అందరం కలిసే భోజనం చేస్తున్నాము. కానీ మాటలు వుండడం లేదు.”

“అదీ! నిజమే! ఏదో సినిమా పెడతారు. అది చూస్తూ ఏం మాట్లాడుకుంటాం.”

“మీకు తెలుగు సినిమాలు ఇష్టం అని సంతోష్ చెప్పాడు. అందుకని నేను రోజూ మంచి రేటింగ్ వున్న సినిమాలు  సెలక్ట్ చేసి ఉంచుతున్నాను. మీరు వాటిని కూడా పూర్తిగా చూస్తున్నట్టు లేదు”

“............”

“పోనీ ఓ పని చేద్దాం. సినిమా వద్దు. భోంచేస్తూ మాట్లాడుకుందాం. ఏదో ఒకటి. చూసిన సినిమాలమీదే అయినా సరే  ఏవో  ముచ్చట్లు చెప్పుకుందాం!”

“తప్పకుండా! మంచి ఐడియా” అన్నాను మరోసారి.

గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది.

ఈ మధ్యాన్నం కొత్తగా గడిచింది.  ఎన్నో రోజులుగా మౌనం కాపురం చేస్తున్న ఇంట్లో మళ్ళీ మాటలు నోళ్ళు విప్పాయి. నిండా పరచుకున్న స్తబ్ధత తొలగిపోయింది. పట్టపగలే మరోసారి తెల్లవారింది (అవునూ! ఇలాంటి ఆలోచనలు ఇంతకు ముందు నాకెందుకు రాలేదు?)

మాటామంతీలో ఇంత మహత్యం ఉందా!

నిజంగా  మంచి ఐడియా ఇచ్చావు నిషా!

మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి ఒక్కోసారి మాటలు దొరకవు. నోరు పెగలదు.

(26-11-2021)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి