28, నవంబర్ 2021, ఆదివారం

ఒక్క అవకాశం - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు, 28-11-2021, ఆదివారం ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)

ఈ మాట మీరు ఎక్కడో విన్నట్టున్నప్పటికీ ఈ ఒక్క అవకాశం, ఆ ఒక్క అవకాశం గురించి మాత్రం కాదు. ఇది వేరే. అది వేరే!
2005 డిసెంబరులో దూరదర్శన్ నుంచి నేను రిటైర్ అయ్యేంతవరకు ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు ఏ ప్రోగ్రాముకు పిలిచినా నేను ఒప్పుకునేవాడిని కాదు, ఒక ఛానల్ లో పనిచేస్తూ మరో ఛానల్ కు పోకూడదని నాకు నేనై పెట్టుకున్న నిబంధన కారణంగా.
ఆ తర్వాత మాత్రం పిలిచిన ఎవ్వరినీ కాదనలేదు. ఆ క్రమంలో రోజుకు రెండు మూడుసార్లు టీవీ చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాను. ఆ రోజుల్లో ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా, అంశాన్ని బట్టి స్వతంత్రంగా విశ్లేషణ చేసే అవకాశాలు దొరకడంతో, నేను టీవీ చర్చల పర్వాన్ని నిశ్చింతగా కొనసాగిస్తూ పోయాను. అలా పుష్కర కాలానికి పైగా టీవీలతో కాలక్షేపం చేశాను. వారంలో ప్రతి రోజూ ఒక ఛానల్ అని ముందే నిర్ణయించుకుని టైం టేబుల్ మాదిరిగా వెడుతుండే కాబట్టి నన్ను వారాలబ్బాయి అని పిలిచేవారు కూడా. ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు అనేది మా ఆవిడ నిర్మల.
2019లో నా భార్య మరణం తర్వాత టీవీ చర్చలకు పోవడం పూర్తిగా మానుకున్నాను. క్రమం తప్పకుండా నన్ను తన చర్చలకు స్వయంగా ఆహ్వానించే ఓ ప్రముఖ ఛానల్ మోడరేటర్ ఒకరు, ఓసారి ఫోన్ చేసి ‘మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఈ రెండేళ్ల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, మునుపటిలా స్వతంత్రించి మాట్లాడించడానికి మాకూ, స్వతంత్రంగా మాట్లాడడానికి మీకూ వీలులేని రాజకీయ వాతావరణం ప్రస్తుతం వుంది’ అని చెప్పారు.
రోగి కోరుకుంది, వైద్యుడు చెప్పింది ఒకటే అన్నట్టు నేను కూడా సంతోషించాను. తదాదిగా నా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, ఇలా వారం వారం ఆంధ్రప్రభ దినపత్రికకు వ్యాసాలు రాస్తూ వస్తున్నాను. చాలా తృప్తిగా వుంది.
మరి ఈ ఒక్క అవకాశం సంగతి ఏమిటంటారా!
చెబుతాను. అది చెప్పడానికే ఈ అవకాశం తీసుకున్నాను.
నేను ముప్పొద్దులా, మూడు ఛానళ్ళు. ఆరు చర్చలు అనే రీతిలో పొద్దు పుచ్చుతున్న రోజుల్లో, ఓరోజు పొద్దున్నే ఒకతను మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు.
‘నాకు టీవీ చర్చల్లో పాల్గొనాలని వుంది. మీరు ఎవరికైనా చెబుతారా! ఎలాగైనా సరే, ఒక్క అవకాశం దొరికేలా చూడండి’
ఆయన్ని చూడడం నాకు అదే మొదటిసారి. అయినా భేషజాలకు పోకుండా, మనసులోని మాటని బయటపెట్టడానికి తాత్సారం చేయకుండా, చల్లకు వచ్చి ముంత దాచిన చందం కాకుండా నేరుగా చెప్పిన తీరు చూసి, ఇతడు ఎవరి సాయం లేకుండానే టీవీ రంగంలో రాణించే రోజు వస్తుందని నేను అప్పుడే అనుకున్నాను.
ఉద్యోగం చేసే రోజుల్లో మా ఆవిడ ఇలా పనిమీద వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడే విధానం గమనించి, ‘కొబ్బరికాయ పైరవి’ అనేది. అంటే పని కాకపోతే తిరిగి ఎలాగూ రాడు. పని అయినా రాకపోయే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే పని మీద శ్రద్ధ వున్నవాళ్ళు, ఏ ఒక్కరినో నమ్ముకుని ఊరుకోరు. మరో నలుగురితో చెప్పించుకుంటారు. ఆ విధంగా ఏదో విధంగా పని జరిగిందని తెలిసినప్పుడు ఆ శనివారం దేవుడికి ఓ కొబ్బరికాయ కొట్టి, అది దేవుడి ఖాతాలో వేసేవాడిని. దానికి మా ఆవిడ పెట్టిన ముద్దు పేరు ‘కొబ్బరి కాయ పైరవి’
‘అలాగే ! చెప్పిచూస్తాను’ అనేశాను మేకపోతు గాంభీర్యంతో.
ఆయన పోతూ పోతూ ఓ సలహా చెప్పాడు.
‘చాలాకాలం నుంచి చూస్తున్నాను. మీరు టీవీలో మాట్లాడేటప్పుడు, ఎప్పుడూ కెమెరా వంక చూడరు. మిమ్మల్ని జనం గుర్తు పెట్టుకోవాలి అంటే కెమెరా వంకే చూస్తూ మాట్లాడాలి, యాంకర్ వంక కాదు’
నాకు నవ్వు వచ్చింది. కానీ నవ్వలేదు.
‘యాభయ్ ఏళ్ళుగా ఈ రంగంలో ఉంటున్నాను. ఇంకా నా మొహం గుర్తు పెట్టుకునేది ఏమిటి నా మొహం!’ అనుకున్నాను మనసులో.
ఆయన వెడుతూ వెడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించి వెళ్ళాడు.
‘నాకు ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని వుంది. ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్ధికంగా నా నేపధ్యం గొప్పది కాదు. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. ఇలా విశ్లేషకుడిగా టీవీల్లో మాట్లాడుతూ వుంటే ఎవరో ఒకరి కంట్లో పడకపోను. అప్పుడు ఏదో ఒక పార్టీకి అధికార ప్రతినిధి హోదాలో ప్రతి ఛానల్లో కనబడే ఛాన్స్ లంహిస్తుంది. నాకు పార్టీలో అవకాశం ఇచ్చిన నాయకుడి కంటే కూడా ఎక్కువగా ప్రజల కళ్ళల్లో పడే మహత్తర అవకాశం నాకే వుంటుంది. రోజూ నా మొహం టీవీల్లో చూస్తుంటారు కాబట్టి నా నియోజకవర్గం ఓటర్లకు నేను బాగా గుర్తుంటాను. ఎప్పటికో అప్పటికి నా కోరిక తీర్చుకోకపోను’ అన్నాడు ధీమాగా!
అతడు చెప్పింది నిజమే. డబ్బులు ఊరికే రావు అన్నట్టు పదవులు, అవకాశాలు ఊరికే రావు. ప్రయత్నిస్తూనే వుండాలి.
అతడు కోరుకున్నట్టే టీవీల్లో మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది. సద్వినియోగం చేసుకున్నాడు అని వేరే చెప్పాల్సిన పని లేదు.
చూస్తూ ఉండగానే అతడు తన దీర్ఘకాలిక ప్రణాళికలో నిర్దేశించుకున్న మొదటి రెండు లక్ష్యాలు సాధించాడు. సొంత ప్రతిభతో విశ్లేషకుడిగా రాణిస్తూనే ఓ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా నాతోనే పలు చర్చల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు. విషయ పరిజ్ఞానం, కష్టపడి సమాచారం సేకరించే అలవాటు, పెట్టుకున్న ధ్యేయం పట్ల చిత్తశుద్ధి, అనుకున్నది సాధించాలనే తపన ఈ ఎదుగుదలకు కారణం అని నాకు అనిపించేది.
నాకొక అనుమానం వుండి పోయింది. అతడు చేరాలి అనుకుంటే, అతడి ప్రతిభ చూసి అధికార పక్షం కూడా ఆహ్వానించి వుండేది. మరి ప్రతిపక్షం పాత్రను ఎందుకు ఎంపిక చేసుకున్నట్టు?
ఒకరోజు విరామ సమయంలో ఆయన్నే అడిగాను. చెప్పిన జవాబు విని నివ్వెరపోయాను.
‘నాకిప్పుడు వున్న ప్లస్ పాయింటు నా వయస్సు. మరో పదేళ్లు ఓపిగ్గా ఎదురుచూడగలను. ఒక రాజకీయ భావజాలం అంటూ ప్రత్యేకంగా నాకు ఏమీ లేదు, ఎందులో అయినా సర్దుకుపోగలను. అధికార పార్టీ అయితే పుణ్యకాలం కాస్తా పార్టీ కార్యకలాపాలను సమర్ధించుకోవడంలోనే సరిపోతుంది. అదే ప్రతిపక్షం అయితే గొంతెత్తి మాట్లాడానికి, ఎంత ఘాటు విమర్శలు అయినా చేయడానికి అవకాశం వుంటుంది. వీక్షకులకీ, టీవీల వాళ్ళకీ కావాల్సింది ఇదే. చర్చల అవకాశాలు బాగా వుంటాయి. అంచేత ఇదే సరైన పద్దతి అనుకున్నాను. అధికార పక్షంలోకి సమయం చూసుకుని చేరతాను. అందుకు ఇంకా సమయం వుంది. తొందరపడితే అసలుకే మోసం. ‘మరో విషయం గమనించారా! విశ్లేషకుడిగా కాకుండా నేను సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరివుంటే ఎక్కడో రోడ్ల మీద ధర్నాలు చేస్తూ మిగిలిపోయేవాడిని. ఇప్పుడు చూడండి. ఎండనక, వాననక వీధుల్లో ఆందోళనలు చేస్తూ, గొంతు ఎండిపోయేలా నినాదాలు చేసే మా పార్టీ వాళ్లకు అనుకూలంగా, హాయిగా స్టూడియోల్లో కూర్చుని, స్వరం పెంచి మాట్లాడగలుగుతున్నాను. హోటళ్ళకు పోయినా, సినిమాలకు వెళ్ళినా జనం గుర్తు పట్టి పలకరిస్తున్నారు.
‘మరో రహస్యం చెబుతున్నా మీరు కాబట్టి. మా అధినాయకుడిని కలవాలంటే మా పార్టీ నాయకులకే దుర్లభం. అలాంటిది నేను నేరుగా కలవగలుగుతున్నాను. అయిదేళ్ళ కాలంలోనే ఇదంతా! ఇంకో అయిదేళ్లు మిగిలే వుంది’ అన్నాడు.
అతడి మాటల్లో ఎనలేని ఆత్మ విశ్వాసం తొణికిసలాడింది.
ఏదో ఒకరోజు ఆయన్ని అసెంబ్లీలో చూస్తాను అని నాకో ఫీలింగు కూడా ఈ మధ్య కలుగుతోంది. అతడికేదో దారి చూపించడంలో చిటికెన వేలంత పాత్ర నాది ఉందనే గర్వం ఇన్నాళ్ళు నా మనసులో ఏ మూలో వుండేది. ఇప్పుడది తొలగిపోయి, అతడే నా కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేశాడనే భావన కలుగుతోంది.
ముగించే ముందు ఓ విషయం చెప్పాలి.
ఆయన మొట్టమొదటిసారి టీవీలో కనపడ్డ రోజు, మరచిపోకుండా దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నాను. ఎందుకంటే అతడి కోరిక తీరడంలో నా ప్రమేయం ఏమీ లేదని నా అంతరాత్మకు తెలుసు కాబట్టి.
తోకటపా: ఈ రచన నా స్వకపోల కల్పితం అని పాఠకులకు మనవి.



2 కామెంట్‌లు:

  1. ఆల్రెడీ ఇది మీరు మీ బ్లాగ్ లో రాసినట్టు గుర్తు .
    మీరు ఉదహరించిన వ్యక్తి , ఈ మధ్యన వార్తల్లో పెద్ద వార్త అయినట్టు అనుమానం .
    అతని 'పట్టు'దల కి మెచ్చుకోవచ్చు

    రిప్లయితొలగించండి
  2. మిస్టర్ బీన్ మార్క్ కిచిడీ/బిర్యానీ ఇన్ ఏప్పీ!

    ఇవ్వాళ్టి కొత్తపలుకు చదివాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారిని అర్ధం చేసుకోవడానికి ఒక క్లూ దొరికింది.తెలుగుదేశం అభిమానులు అనుకుంటున్నట్టు ఆయన తెలివితక్కువ వ్యక్తి కాదు,సైకో అసలే కాదు.మహమ్మద్ బీన్ తుఘ్లక్ వంటి వాడు కూడా కాదు.ఆయనకు ఎదురౌతున్న సమస్యలకు ఆయన కనుక్కుంటున్న పరిష్కారాలు మహమ్మద్ బీన్ తుఘ్లక్ తనకు వచ్చిన సమస్యలకు కనుక్కున్న పరిష్కారాల కన్న అద్భుతమైనవి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.అయితే ఆయన ప్రజ్ఞ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ప్రదర్శించని కొత్త తెలివి కూడా కాదు.

    పెద్దలు దీన్ని గురించి "చావు తెలివి" అని ఎప్పుడో చెప్పేశారు.మహమ్మద్ బీన్ తుఘ్లక్కుది చావు తెలివి కాదు.చావు తెలివి ఉన్న మనిషి యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే సమస్యను తనే సృష్టించుకుంటాడు.అప్పుడు అతను తెలివితక్కువవాడిగానే కనిపిస్తాడు అతన్ని అభిమానించి ఆదరించి కీర్తించి తరించేవారికి సైతం!ఆ సమయంలో ప్రతికక్షులు చేస్తున్న విమర్శలని ఎట్లా సమర్ధించుకు రావాలో తెలియని అభిమానులు చాలా నిరాశ పడతారు కూడా - ఎంతటి డైహార్డు ఫ్యానుకి కూడా జెండా పీకేసి ఎగస్పార్టీలో చేరిపోదామా అనిపిస్తుంది.అయితే సరిగ్గా అప్పుడే అసలు వ్యక్తిలోని చావు తెలివి జూలు విదిల్చిన సింహంలా నిద్ర లేచి అభిమానులు సంతసించే ప్రతికక్షులు తిరస్కరించే అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది.ఈ పరిష్కారం యొక్క అసలు సిసలు చమత్కారం ఏంటో తెలుసా - అసలు వ్యక్తి తనకు తను మీద పడేసుకున్న సమస్య అద్భుతమైన రీతిలో పరిష్కారమైపోయి స్వజనులకు ఆనందాన్ని ఇస్తుంది గానీ ఆ పరిష్కారం పక్కనున్న చావు తెలివి లేనివాడికి ఎంత గింజుకున్నప్పటికీ పరిష్కారం దొరకని సమస్య అయి ఛస్తుంది!

    ఇది గందరగోళం అనిపించి అర్ధం కాకపొతే ఒక ఉదాహరణ చూపిస్తాను.Rowan Atkinson అనే మహామేధావి Mr.Bean అనే చావుతెలివి పాత్రను సృష్టించాడు.ఆ పాత్రని అతను తీర్చు దిద్దిన పద్ధతి తెలుసుకోవాలంటే అతనే ఒక ఇంటర్వూలో స్వయాన చెప్పుకున్న విషయం తెలుసుకోవాలి.అతను రోజూ వెళ్లే పచారీ కొట్టు యజమాని ఒకరోజున "మీలో మిస్టర్ బీన్ పోలికలు ఉన్నాయి!" అన్నాట్ట."ఆ పాత్రని చేసింది నేనే!" అని చెప్పుకుంటే,"వూర్కోండి సార్,హాస్యానికి కూడా హద్దులుండాలి.పొలికలు కలుస్తున్నాయి గదాని అలా ఫిరాయించేసుకోమాకండి - బావుండదు!" అని సలహా ఇచ్చాట్ట.

    ఇంతకీ ఆ మిస్టర్ బీన్ చావు తెలివి ఎట్లా ఉంటుందో చెప్పాలి గదా.ఒకసారి మిస్టర్ బీన్ కారుతో పార్కింగ్ ప్లేసు నుంచి రోడ్డు మీదలి రావాల్సి వచ్చింది.అది మనుషులు లేని ఆటోమాటిక్ గేట్.కారు దిగి టోకెన్ పంచ్ చేసి రావడానికి బద్ధకం వేసి ఒక కర్రకి టికెట్ అంటించి స్లాట్ మిషనుని పనిచేయించడం లాంటి అయుడియాలు ఫెయిలయ్యాక మన హీరో శ్రీ యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి లాగే బ్రహ్మాండమాణ ప్లాను వేశాడు.కారును కొంచెం బ్యాక్ చేసి టాప్ గేరులో ఉంచి బ్రేకు మీద కాలేసి తొక్కిపట్టి ఎదురు చూస్తున్నాడు - చావు తెలివి లేని బలిజీవి కోసం.

    బలిజీవి రానే వచ్చాడు.రోడ్డు మీదనుంచి పార్కింగ్ ప్లసెలోకి దూరడానికి ఓక వ్యక్తి టికెట్ పెట్టాడు. లివర్ పైకి లేచింది.మనోడు బ్రేక్ మీదనుంచి కాలు తీశాడు.బీన్ కారు సర్ర్ర్ర్ర్ర్న దూసుకెళ్ళిపోతున్నది.అ బలిజీవి కంగారు పడి తన కారుని వెనక్కి నడిపాడు.బీన్ తన కారుని రోడ్డెక్కించి దూసుకుపోయాడు.ఈ బలిజీవి తన కారుని వెనక్కి నడుపుతాడని తెలీక అదే రోడ్డు మీద తన దారిన తను పోతున్న మరొక బలిజీవి అసలు బలిజీవి కారుని గుద్దేశాడు."బంతీ చామంతీ ముద్దాడుకున్నాయి!" మ్యూజిక్కు ఏస్కొండి మీ మైండులో. బీన్ మాత్రం కారు విండోనుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూసి తన సమస్య పరిష్కారమైందన్న సంతోషాన్నీ ఎక్కువ సేపు అక్కడుంటే వాళ్ళీద్దరి వల్ల తనకి ప్రమాదం అని తెలిసిన భయంతో కూడిన జాగ్రత్తనూ తన ముఖకవళికలలో చూపిస్తూ రయ్యిమని దూసుకుపోయాడు.

    ఇటువైపునుంచి చూస్తున్న మనం గానీ తన చావుతెలివికి బలయిన ఇతర్లు గానీ ఎంత నవ్వుకున్నా ఎన్ని తిట్టుకున్నా బీన్ లెక్క చెయ్యడు,"తొక్కలే!ఈ పిచ్చొళ్ళని పట్టించుకుంటే మనకి గిట్టుబాటు ఎట్టా అవ్వుద్దీ?" అనేసుకుని నవ్వుకుంటాడు - అచ్చం శ్రీ యడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి లానే.అతన్ని అభిమానించి ఆదరించి కీర్తించి తరించేవారిది సైతం అదే మూస.ఆయన్ని "మహమ్మద్ బీన్ తుఘ్లక్ వంటి వాడు కూడా కాదు" అని ఎందుకు అన్నానో ఇప్పుడు అర్ధమై ఉండాలి.

    జై శ్రీ రాం!

    రిప్లయితొలగించండి